Lalbaugcha
-
Lalbaugcha Raja: లాల్బాగ్ గణపతి ప్రత్యేకతలివే..
ముంబై: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలో 10 రోజుల పాటు ఘనంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడి లాల్బాగ్చా రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్‌బాగ్‌లో పూజలు అందుకునే వినాయకుణ్ణి చూసేందుకు మనదేశం నుంచే కాదు ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడిని లాల్బాగ్చా రాజా అని పిలుస్తుంటారు. ఉత్సవాల సమయంలో లాల్ బాగ్ ప్రాంతమంతా భక్తులతో కళకళలాడుతుంటుంది. గణేశుని దర్శనం కోసం భక్తులు క్యూ కడుతుంటారు. ఇక్కడి వేదికపై ప్రతిష్ఠించిన విఘ్నహర్త గణేశుడి విగ్రహాన్ని నవశాచ గణపతి అంటారు. ఈ రూపం భక్తుల సమస్త కోరికలను తీరుస్తుందని చెబుతుంటారు.లాల్‌బాగ్‌లో నిర్వహించే 10 రోజుల గణేశ ఉత్సవంలో ప్రతిరోజూ లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలి వస్తుంటారు. ఈ 20 అడుగుల ఎత్తయిన విఘ్నహర్త విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 89 ఏళ్లుగా ఈ అందమైన బప్పా విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కాంబ్లీ కుటుంబం పర్యవేక్షిస్తోంది.కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు ఇక్కడి గణపతి బప్పాను దర్శించుకుని, ఆశీస్సులు పొందుతారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు కూడా లాల్బాగ్చా రాజా ఆశీర్వాదం కోసం ఇక్కడికి వస్తారు. -
‘రాజా’ మండలి సభ్యులపై కేసులు
సాక్షి, ముంబై: భక్తులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్న లాల్బాగ్ చా రాజా గణేశ్ మండలి కార్యకర్తలపై కేసుల నమోదుకు హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మండలి సభ్యుల అనుచిత ప్రవర్తనతో మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తుల కొంగుబంగారంగా నిలిచిన లాల్బాగ్ చా రాజా గణపతిని దర్శించుకునేందుకు రోజూ లక్షలాది మంది జనం వస్తున్నారు. ఇక్కడి కార్యక్రమాలు రోజంతా టీవీల్లో ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులతో ఆ మండలి కార్యకర్తలు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో ఒక మహిళపై మండలి సభ్యులు చేయిచేసుకుంటున్నట్లు ప్రసారమైన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి రాజా దర్శనానికి వెళ్లిన డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ సర్మలేతో సైతం మండలి సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. అతని చేయిపట్టుకుని పక్కకు నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన సర్మలే స్థానిక కాలా చౌకి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మనోజ్ మిశ్రా అనే కార్యకర్తను అరెస్టు చేశారు. కాగా అమర్యాదకర ప్రవర్తనకు నిరసనగా మహిళ భక్తులు లాల్బాగ్ చా రాజా ప్రధాన ప్రవేశ ద్వారంవద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. దురుసుగా ప్రవర్తించిన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.