Ganesh Navratri
-
గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం
హైదరాబాద్: వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఉదయం 11.00 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి లు పాల్గొంటారు. అంతేకాకుండా బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సికింద్రాబాద్ YMCA గణేష్ ఉత్సవ సమితిలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వహకులకు కూడా సమావేశానికి ఆహ్వానిస్తూ అధికారులు లేఖలను పంపించారు. గణేష్ నవరాత్రుల నిర్వహణ లో దేశంలోనే హైదరాబాద్ నగరం ప్రత్యేకతను సంతరించుకుంది. అటువంటి గణేష్ నవరాత్రులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత మరింత ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తోంది. విగ్రహాల ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా శాంతిభద్రతల నిర్వహణ, శోభాయాత్ర, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇదీ చదవండి: TS: డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్ అరెస్ట్ -
వినాయకుడికి 30 వేల కిలోల లడ్డూ
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ వారు వినాయకుడికి భారీ లడ్డూను బహుకరించారు. విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ వినాయకుడికి భక్తాంజనేయ స్వీట్స్ తరపున 30 వేల కిలోల లడ్డూని అందజేశారు. ఈ లడ్డూని 3 రోజుల పాటు విగ్రహం వద్ద ఉంచి అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
* లేదా సెప్టెంబర్ 17 నుంచి సమావేశాలు * గణేశ్ నవరాత్రుల దృష్ట్యా సర్కారు మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 30 నుంచి లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీ కంటే ముందే జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపేందుకు వీలుగా ఈ నెలాఖరునే సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు జరిపి, తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. మరోవైపు గణేశ్ నవరాత్రుల దృష్యా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఇబ్బందులు తలెత్తకుండా... నిమజ్జనోత్సవం ముగిశాక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి అందిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ నెల 30వ తేదీ నుంచిగానీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచిగానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెప్టెంబర్ తొలివారంలో బిల్లును ఆమోదించి పంపిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు సమాచారమిచ్చాయి. జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లు, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
-
లడ్డూ@: 99,999
కురుపాం: కురుపాంలోని కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుని లడ్డూ వేలం పాటలో లక్ష రూపాయలు పలికింది. 9కిలోల 900 గ్రాముల లడ్డూకు శుక్రవారం సాయంత్రం కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు అంధవరపు కోటేశ్వరరావు అధ్యక్షతన వేలం పాట నిర్వహించారు. పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలంలో మండల కేంద్రానికి చెందిన వ్యాపారులు పట్నాన గోవింధరావు, బోటు రమేష్, గెంబలి పెదతాతయ్యలు, పొట్నూరు శ్రీనువాసరావు(గంగోత్రి), గుడ్ల శ్రీనువాసరావులు సంయుక్తంగా పోటీ పడి *99,999 కు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ మేరకు కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు, సభ్యులు కొత్తకోట రవీంద్రకుమార్, తదితర సభ్యులు దైవప్రసాదాన్ని వేలంలో దక్కించుకున్న భక్తులకు అందజేశారు.