ganesh pandals
-
గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా ?
సాక్షి, చెన్నై: చైనా దిగుమతుల నిషేధంపై తీవ్ర చర్చోపచర్చలు నడుస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందుబాటులో లేని, మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం తప్పు కాదని ఆమె వెల్లడించారు. స్వావలంబన భారతదేశం (ఆత్మనిర్బర్ భారత్ అభియాన్) అంటే దిగుమతులు అస్సలు చేయకూడదని కాదు. పారిశ్రామిక వృద్ధికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన దిగుమతులు చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. వృద్ధిని పెంచేందుకు దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదు కానీ, గణేష్ విగ్రహాలను కూడా చైనా నుండే ఎందుకు దిగుమతి చేసుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకంపై తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ గా మాట్లాడిన సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. (చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?) ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సాంప్రదాయకంగా స్థానికంగా మట్టితో చేసిన గణేశ విగ్రహాల కొనుగోలుకు బదులుగా వాటిని కూడా చైనా నుండి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు. మనం తయారుచేసుకోలేమా..ఇలాంటి పరిస్థితి ఎందుకో ఆలోచించాలన్నారు. ఆఖరికి సబ్బుపెట్టె, ప్లాస్టిక్ వస్తువులు, పూజకు ఉపయోగించే అగర్ బత్తీలాంటి మనం ప్రతి రోజూ వాడే గృహోపకరణాలను దిగుమతి చేసుకోవడం స్వావలంబనకు తోడ్పడుతుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేకించి ఇటువంటి ఉత్పత్తులను భారతీయ సంస్థలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ స్థానికంగా తయారుచేసినప్పుడు మాత్రమే దేశ స్వావలంబన సాధ్యపడుతుందన్నారు. (బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు) దిగుమతులు తప్పు కాదు, అవి ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ఉపాధి అవకాశాలు, వృద్ధి లాంటి ప్రయోజనాలను తీసుకురాలేని దిగుమతులు స్వావలంబనకు, భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడవని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే అందుబాటులో ఉన్న వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి మారాలి. ఆత్మ నిర్బర్ అభియాన్ వెనుకున్న స్వయం ప్రతిపత్తి ఆలోచన ఇదేనని ఆమె పునరుద్ఘాటించారు. ఈ సందర్బంగా గత ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. మోదీ అయ్య (సార్) అంటూ తమిళంలో ప్రసంగించారు. అలాగే జూన్ 15న లద్దాఖ్‌లో మరణించిన 20 మంది సైనికుల్లో ఒకరైన తమిళనాడుకు చెందిన హవల్దార్ కె పళనికి ఆమె నివాళులర్పించారు. -
గణేశ్ ఉత్సవాలపై సైబరాబాద్ సీపీ సమీక్ష
హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలఫై సైబరాబాద్ సీపీ నవీన్ చంద్ బుధవారం సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 5న వినాయక చవితి సందర్భంగా... సైబరాబాద్ పరిధిలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేయాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి అని సీపీ స్పష్టం చేసారు. అందుకు అనుగుణంగా ఈ నెలా 25 నుంచి 31 వరకు దరఖాస్తు తప్పనిసరని, దరఖాస్తులు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. మండపాల ఏర్పాటుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్.. దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలని సీపీ తెలిపారు. ఈ మండపాలు పోలీసులు పేర్కొనే ప్రమాణాల మేరకు ఏర్పాటు చేయాలని అందుకు భిన్నంగా ఉంటే అనుమతించేది లేదని సీపీ స్పష్టం చేశారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, బాక్స్ టైపు లౌడ్ స్పీకర్ లను మాత్రమే పెట్టాలని సూచించారు. ఇవి కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
గణేశ్ మండపాలపై కఠిన ఆంక్షలు
వినాయక చవితి సందర్భంగా అనుమతి లేకుండా మండపాలు పెట్టినా, నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించినా కోర్టు ధిక్కార నోటీసులు జారీచస్తామని బాంబే హైకోర్టు హెచ్చరించింది. ఈ ఉత్సవాల్లో పెద్ద తలకాయలు ఉంటాయి కాబట్టి, మునిసిపల్ కార్పొరేషన్ వాళ్లను ఏమీ అనలేని పరిస్థితి ఉంటుందని, నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. మండపాలు ఏర్పాటుచేసే ముందే అనుమతులు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. రోడ్ల మీద అక్రమంగా మండపాలు ఏర్పాటు చేయడం, విపరీతంగా శబ్దకాలుష్యం సృష్టించడంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ వీఎల్ అచ్లియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వినాయకచవితితో పాటు దహీ హండీ ఉత్సవం సందర్భంగా ఎక్కడపడితే అక్కడే మండపాలు పెడుతున్నారని, నిబంధనలను అతిక్రమిస్తున్నారని, అయినా కార్పొరేషన్ మాత్రం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది సంజీవ్ గోర్వాడ్కర్ కోర్టుకు తెలిపారు. మామూలు మండపాల కంటే, శివసేన, కాంగ్రెస్, ఎంఎన్ఎస్ లాంటి పార్టీలు పెడుతున్న మండపాల్లో శబ్దాలు నిర్ధారిత స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కోర్టు తెలిపింది.