ganganna
-
పగబట్టి మరీ దున్నపోతే చంపేసింది!
ఆదిలాబాద్: పశువుల కాపరి పైనే దున్నపోతు దాడి చేసి చంపిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజూ రాలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పశువుల కాపరి చామన్‌పల్లి గంగన్న (60) రోజువారీలాగానే గేదెలను ఉదయం మేతకు తీసుకెళ్లాడు. వారివెంట గ్రామానికి చెందిన విత్తనపు దున్నపోతు కూడా వెళ్లింది. సాయంత్రం గేదెలను ఇంటికి తోలుకొస్తుండగా దున్నపోతు ఒక్కసారిగా కాపరిపై తిరగబడింది. విచక్షణ రహితంగా కుమ్మడంతో గంగన్న తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న మరో కాపరి గమనించి వెంటనే గ్రామస్తులకు ఫోన్‌చేసి చెప్పాడు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని దున్నపోతును తరిమారు. గాయపడిన గంగన్నను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గంగన్నకు భార్య ఆశవ్వ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పగబట్టిందంటున్న గ్రామస్తులు! ఇదిలా ఉండగా.. గ్రామానికి చెందిన విత్తనపు దున్న పగపట్టి దాడిచేసిందని గ్రామస్తులు ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ముత్యంపై దాడికి యత్నించడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం చనిపోగా అతని అంత్యక్రియల్లో ముత్యం పాల్గొన్నాడు. ఈ క్రమంలో అక్కడే మేతకు వెళ్లిన దున్న పరిగెత్తుకుంటూ వచ్చి దాడికి యత్నించింది. దీంతో అతను చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీశారు. దున్నపోతును గ్రామం నుంచి తరలించాలని సర్పంచ్‌ను కోరారు. ఇంతలోనే ఆదివారం అదే దున్న పశువుల కాపరిని పొడిచి చంపడంతో రాజూరాలో విషాదం నెలకొంది. దున్నపోతు మనుషులను పగబట్టిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి చదవండి: చిన్నారి పాలిట శాపంగా మారిన రాగిజావ! -
సీఎం కేసీఆర్ టూర్.. ఎస్సై గంగన్నతో మామూలుగా ఉండదు మరి!
కుమురంభీం జిల్లా: ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై గంగన్నను వీఆర్‌కు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చే పోలీసు సిబ్బందికి భోజనాలు ఏర్పాటు పేరిట వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జూన్ 27న ‘భోజన ఖర్చులివ్వండి!’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంపై రాష్ట్ర పోలీసు బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జోనల్‌స్థాయి అధికారిని విచారణకు ఆదేశించారు. స్థానిక నిఘా విభాగం అధికారుల ప్రాథమిక విచారణలో ఎస్సై గంగన్న వసూళ్ల పర్వం బయటపడడంతో తొలుత ఎస్సైను వీఆర్‌కు అటాచ్ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్పీ సురేశ్‌కుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్పీ సురేశ్‌కుమార్ ఎస్సై గంగన్నను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే గంగన్న వ్యవహారంపై పో లీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటి కీ.. పర్యటన ముగిసిన రెండోరోజు ఎస్సైపై వేటు వేసి సమగ్ర విచారణ చేపట్టడం గమనార్హం. వసూళ్ల వెనుక అదృశ్య శక్తులెవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అదునుగా తీసుకుని స్థానిక వర్తక సంఘాల నుంచి డబ్బులు వసూళ్లు చేయాలనే ఆలోచన ఎస్సై గంగన్నదేనా? లేక దీని వెనుక ఎవరైనా అదృశ్య శక్తులు ఉన్నాయా? అన్నది ఇప్పుడు విచారణలో ప్రధానంగా తేలాల్సిన విషయం. ఎందుకంటే ఉన్నతాధికారుల ఆదేశాలు ఇసుమంతైనా లేకుండా ఎస్సై గంగన్న అంతటి సాహసానికి పాల్పడడనే వాదనలు పోలీసు శాఖలోనే గుప్పుమంటున్నాయి. పైగా ‘సాక్షి’ పత్రికలో కథనం వచ్చినా వసూళ్లు ఆగకపోవడం ఎస్సై గంగన్న వెనుక ఎవరో ఉన్నారనే వాదనలకు బలం చేకూరింది. పోలీసుల ప్రాథమిక విచారణలో రూ.5 లక్షలకుపైగా వసూళ్లు చేశారని తేలినట్లు సమాచారం. పోలీసులు సమగ్రంగా విచారణ చేపడితే ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వాంకిడిలో దొంగనోట్ల కేసు విషయంలోనూ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చే క్రమంలో రూ.30 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. ఇక్కడా ఆ అదృశ్య శక్తులకే భారీగా వాటాలు ముట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఎస్సై గంగన్న వసూళ్ల పర్వం వెనుకా కచ్చితంగా అదృశ్య శక్తుల హస్తం ఉన్నట్లు పోలీసుశాఖలో ప్రచారం ఊపందుకుంది. పైగా వసూళ్ల విషయంలో ఎస్సైను మాత్రమే బలిపశువును చేస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉంది. ఆది నుంచి ఆరోపణలే..! ఎస్సై గంగన్నపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పోలీసుశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలోనూ దురుసుగా ప్రవర్తిస్తారని సమాచారం. చిటికీమాటికి వాహనాలను ఆపడం.. వాహనదారులతో గొడవకు దిగుతున్నారనే విషయం స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధికి తెలిసి ఎస్సైను పిలిచి ‘ఇక్కడ పనిచేయాలనుకుంటున్నావా? లేదా?’ అని గట్టిగా మందలించాకే కొంత తగ్గినట్టు తెలిసింది. అలాగే ఏదైన కేసు విషయంలో పోలీసుస్టేషన్ మెట్లెక్కితే ఇక అంతే! స్టేషన్ ఉన్నతాధికారి పేరు చెప్పి ఇరువర్గాల నుంచి అందినకాడికి దండుకుంటారని సమాచారం. ఆదాయానికి మించి ఆర్జించారనే వాదనలు ఆ శాఖవర్గాల్లోనే గుప్పుమంటున్నాయి. జిల్లా కేంద్రంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి బినామీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వ్యాపారి చేసే రియల్ దందాలో ఇతనికి వాటాలున్నాయని సమాచారం. ఇటీవల ఫోర్‌లేన్ రహదారికి ఆనుకుని ఉన్న ఓ రెండెకరాల భూమిని కబ్జా చేసి.. స్థల యజమానులను బెదిరించినా కబ్జాదారులపై ఎలాంటి కేసు నమోదు చేయకపోగా.. ఎస్సై గంగన్న స్థల యజమానులపై కేసు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు వాపోతున్నారు. ఈ కబ్జా కథ వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉండడంతోనే ఎస్సై గంగన్న రంగంలోకి దిగి మమ్మల్ని బెదిరించారని బాధితురాలు, స్థల యజమా ని తారాబాయి ఆరోపిస్తోంది. -
పేదింటి పెళ్లికి.. ఊరంతా ఒక్కటై..
భైంసా టౌన్: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా ఒక్కటయ్యారు. తలా కొంత కలేసి జమచేసిన డబ్బును కుటుంబానికి అందించి మానవత్వం చాటుకున్నారు నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (బి) వాసులు. వివరాల్లోకి వెళితే.. కిర్గుల్(బి)కు చెందిన కరాండె గోదావరి, గంగన్న దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. గంగన్న గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గోదా వరి కూలీ పనులకు వెళ్తుంది. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఇటీవల పెద్ద కూతురు వివాహం కుదిరింది. మే 7న వివాహ ము హూర్తం నిశ్చయించారు. ఉన్నంతలో ఘనంగా వివాహం చేద్దామనుకున్నారు. తెలిసిన వారి వద్ద అప్పుచేసి బంగారం, పెళ్లి సామ గ్రి కొని ఇంట్లో సిద్ధంగా పెట్టుకున్నారు. రోజులాగానే బుధవారం రాత్రి భోజనం చేసి, ఓ గదిలో అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు వారు పడుకున్న గదికి గడియపెట్టి మరో గది లోని బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇల్లు గుల్లయింది. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా నగదు, సొమ్ము దొంగలు ఎత్తుకెళ్లడంతో గంగన్న, గోదావరి దంపతులు బోరున విలపిస్తున్నా రు. వీరి దీనస్థితి అర్థం చేసుకున్న గ్రామస్తు లు తామున్నామని అండగా నిలిచారు. యువకులు ఇంటింటికీ తిరిగి రూ.1,01,000 సేకరించి బాధిత కుటుంబానికి అందించారు. వీడీసీ ఆధ్వర్యంలో చైర్మన్ పోతారెడ్డి రూ.20 వేలు, సర్పంచ్ సుధాకర్‌రెడ్డి రూ.20 వేలు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. దీంతో గంగన్న, గోదావరి దంపతులు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. -
పొట్టేలు దొంగతనం కేసులో వ్యక్తికి జైలు
బొమ్మనహళ్ : పొట్టేలు దొంగతనం కేసులో మండల పరిధిలోని బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన డోనేకల్ గంగన్నకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. గంగన్న పొట్టేళ్లను దొంగతనం చేసినట్లు ఈ ఏడాది సెప్టెంబర్ 26న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్షను జడ్జి అప్పలస్వామి ఖరారు చేశారు. -
విద్యుధ్ఘాతానికి అన్నదమ్ములు బలి
వ్యవసాయ బావిలో నుంచి చెడిపోయిన మోటర్ తీయడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కుందుప్రి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగన్న(41), నాగన్న(35)లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ బావిలో ఉన్న మోటర్ చె డిపోవడంతో.. దాన్ని బాగు చేయించడానికి బయటకు తీసే ప్రయత్నంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లకు ఇనుప పైపులు తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తేనెటీగల దాడిలో రైతు మృతి
తేనెటీగల కుట్టటంతో తీవ్రంగా గాయపడిన రైతు మరణించాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరివిచింతలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగన్న బుధవారం సాయంత్రం తన పొలం వద్దకు వెళ్లాడు. మోటారు పనిచేయకపోవటంతో దానిని బావి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బావిలోని తుట్టెలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా గంగన్నపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అతడిని చుట్టుపక్కల రైతులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు.