దున్నపోతు నుంచి తప్పించుకునేందుకు చెట్టెక్కిన ముత్యం, గంగన్న(ఫైల్)
ఆదిలాబాద్: పశువుల కాపరి పైనే దున్నపోతు దాడి చేసి చంపిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజూ రాలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పశువుల కాపరి చామన్‌పల్లి గంగన్న (60) రోజువారీలాగానే గేదెలను ఉదయం మేతకు తీసుకెళ్లాడు. వారివెంట గ్రామానికి చెందిన విత్తనపు దున్నపోతు కూడా వెళ్లింది.
సాయంత్రం గేదెలను ఇంటికి తోలుకొస్తుండగా దున్నపోతు ఒక్కసారిగా కాపరిపై తిరగబడింది. విచక్షణ రహితంగా కుమ్మడంతో గంగన్న తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న మరో కాపరి గమనించి వెంటనే గ్రామస్తులకు ఫోన్‌చేసి చెప్పాడు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని దున్నపోతును తరిమారు. గాయపడిన గంగన్నను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గంగన్నకు భార్య ఆశవ్వ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పగబట్టిందంటున్న గ్రామస్తులు!
ఇదిలా ఉండగా.. గ్రామానికి చెందిన విత్తనపు దున్న పగపట్టి దాడిచేసిందని గ్రామస్తులు ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ముత్యంపై దాడికి యత్నించడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం చనిపోగా అతని అంత్యక్రియల్లో ముత్యం పాల్గొన్నాడు.
ఈ క్రమంలో అక్కడే మేతకు వెళ్లిన దున్న పరిగెత్తుకుంటూ వచ్చి దాడికి యత్నించింది. దీంతో అతను చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీశారు. దున్నపోతును గ్రామం నుంచి తరలించాలని సర్పంచ్‌ను కోరారు. ఇంతలోనే ఆదివారం అదే దున్న పశువుల కాపరిని పొడిచి చంపడంతో రాజూరాలో విషాదం నెలకొంది. దున్నపోతు మనుషులను పగబట్టిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి చదవండి: చిన్నారి పాలిట శాపంగా మారిన రాగిజావ!
Comments
Please login to add a commentAdd a comment