కుమురంభీం జిల్లా: ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై గంగన్నను వీఆర్‌కు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చే పోలీసు సిబ్బందికి భోజనాలు ఏర్పాటు పేరిట వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జూన్ 27న ‘భోజన ఖర్చులివ్వండి!’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంపై రాష్ట్ర పోలీసు బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జోనల్‌స్థాయి అధికారిని విచారణకు ఆదేశించారు.
స్థానిక నిఘా విభాగం అధికారుల ప్రాథమిక విచారణలో ఎస్సై గంగన్న వసూళ్ల పర్వం బయటపడడంతో తొలుత ఎస్సైను వీఆర్‌కు అటాచ్ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్పీ సురేశ్‌కుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్పీ సురేశ్‌కుమార్ ఎస్సై గంగన్నను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే గంగన్న వ్యవహారంపై పో లీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటి కీ.. పర్యటన ముగిసిన రెండోరోజు ఎస్సైపై వేటు వేసి సమగ్ర విచారణ చేపట్టడం గమనార్హం.
వసూళ్ల వెనుక అదృశ్య శక్తులెవరు?
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అదునుగా తీసుకుని స్థానిక వర్తక సంఘాల నుంచి డబ్బులు వసూళ్లు చేయాలనే ఆలోచన ఎస్సై గంగన్నదేనా? లేక దీని వెనుక ఎవరైనా అదృశ్య శక్తులు ఉన్నాయా? అన్నది ఇప్పుడు విచారణలో ప్రధానంగా తేలాల్సిన విషయం. ఎందుకంటే ఉన్నతాధికారుల ఆదేశాలు ఇసుమంతైనా లేకుండా ఎస్సై గంగన్న అంతటి సాహసానికి పాల్పడడనే వాదనలు పోలీసు శాఖలోనే గుప్పుమంటున్నాయి.
పైగా ‘సాక్షి’ పత్రికలో కథనం వచ్చినా వసూళ్లు ఆగకపోవడం ఎస్సై గంగన్న వెనుక ఎవరో ఉన్నారనే వాదనలకు బలం చేకూరింది. పోలీసుల ప్రాథమిక విచారణలో రూ.5 లక్షలకుపైగా వసూళ్లు చేశారని తేలినట్లు సమాచారం. పోలీసులు సమగ్రంగా విచారణ చేపడితే ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వాంకిడిలో దొంగనోట్ల కేసు విషయంలోనూ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చే క్రమంలో రూ.30 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది.
ఇక్కడా ఆ అదృశ్య శక్తులకే భారీగా వాటాలు ముట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఎస్సై గంగన్న వసూళ్ల పర్వం వెనుకా కచ్చితంగా అదృశ్య శక్తుల హస్తం ఉన్నట్లు పోలీసుశాఖలో ప్రచారం ఊపందుకుంది. పైగా వసూళ్ల విషయంలో ఎస్సైను మాత్రమే బలిపశువును చేస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉంది.
ఆది నుంచి ఆరోపణలే..!
ఎస్సై గంగన్నపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పోలీసుశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలోనూ దురుసుగా ప్రవర్తిస్తారని సమాచారం. చిటికీమాటికి వాహనాలను ఆపడం.. వాహనదారులతో గొడవకు దిగుతున్నారనే విషయం స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధికి తెలిసి ఎస్సైను పిలిచి ‘ఇక్కడ పనిచేయాలనుకుంటున్నావా? లేదా?’ అని గట్టిగా మందలించాకే కొంత తగ్గినట్టు తెలిసింది.
అలాగే ఏదైన కేసు విషయంలో పోలీసుస్టేషన్ మెట్లెక్కితే ఇక అంతే! స్టేషన్ ఉన్నతాధికారి పేరు చెప్పి ఇరువర్గాల నుంచి అందినకాడికి దండుకుంటారని సమాచారం. ఆదాయానికి మించి ఆర్జించారనే వాదనలు ఆ శాఖవర్గాల్లోనే గుప్పుమంటున్నాయి. జిల్లా కేంద్రంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి బినామీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వ్యాపారి చేసే రియల్ దందాలో ఇతనికి వాటాలున్నాయని సమాచారం.
ఇటీవల ఫోర్‌లేన్ రహదారికి ఆనుకుని ఉన్న ఓ రెండెకరాల భూమిని కబ్జా చేసి.. స్థల యజమానులను బెదిరించినా కబ్జాదారులపై ఎలాంటి కేసు నమోదు చేయకపోగా.. ఎస్సై గంగన్న స్థల యజమానులపై కేసు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు వాపోతున్నారు. ఈ కబ్జా కథ వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉండడంతోనే ఎస్సై గంగన్న రంగంలోకి దిగి మమ్మల్ని బెదిరించారని బాధితురాలు, స్థల యజమా ని తారాబాయి ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment