గులాబీ గూటిలో అసమ్మతి... పార్టీకి వ్యతిరేకంగా మారుతున్న నాయకులు | - | Sakshi
Sakshi News home page

గులాబీ గూటిలో అసమ్మతి... పార్టీకి వ్యతిరేకంగా మారుతున్న నాయకులు

Published Fri, Jun 23 2023 1:28 AM | Last Updated on Fri, Jun 23 2023 8:29 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో అసమ్మతి, వర్గ పోరు పెరిగిపోతోంది. గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయి గులాబీ నాయకుల్లో ఐక్యత కొరవడుతోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుతో, మరికొన్ని చోట్ల వర్గ పోరుతో చీలిక ఏర్పడుతోంది. వచ్చే ఎన్నికల వరకు ఎంతమంది పార్టీలో ఉంటారు? ఎంతమంది కారు దిగుతారోననే చర్చ సాగుతోంది.

చెన్నూరులోనూ..
చెన్నూరు నియోజకవర్గంలో లోలోపల అసంతృప్తులు ఉన్నప్పటికీ ఇంకా బయటపడడం లేదు. ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఇంకా ఎవరూ ఎదురు వెళ్లడం లేదు. గతంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ భాగ్యలక్ష్మి దంపతులు పార్టీ మారి వెంటనే సొంత గూటికి చేరారు. ఆ తర్వాత బీమారానికి చెందిన సీనియర్‌ నాయకుడు సరోత్తంరెడ్డి బాల్క సుమన్‌పై తీవ్రంగా విమర్శలు చేసి, మళ్లీ సైలెంట్‌ అయిపోయారు. వీరు తప్ప ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా పెదవి విప్పలేదు. ఎమ్మెల్యే తమకు సరైన సమయం, ప్రాధాన్యత ఇవ్వడం లేదని రగులుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్‌ పరిధిలోని నాయకులు, కోటపల్లి, జైపూర్‌లో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

మంచిర్యాలలో లుకలుకలు
మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పుస్కూరి రామ్మెహ న్‌ రావు రంగ ప్రవేశంతో వర్గాలు తీవ్ర స్థాయికి చేరా యి. ఇటీవల హాజీపూర్‌ జెడ్పీటీసీ పుస్కూరి శిల్ప ఎ మ్మెల్యే దివాకర్‌రావు తమని పట్టించుకోవడం లేదని బహిరంగంగానే విమర్శలు చేశారు. రైతుబంధు మండల కన్వీనర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, మాజీ బీ ఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొమ్మటి సత్తయ్య, మా జీ ఎంపీటీసీ బొడ్డు శంకర్‌, తదితర నాయకులు అసమ్మతితో ఉన్నారు.

లక్సెట్టిపేట, దండేపల్లి మండలా ల్లోనూ వర్గాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కొంద రు కౌన్సిలర్లు, మాజీలు, నాయకులు, పార్టీలో అసంతృప్తిగానే ఉన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తుండడంతో ఎమ్మెల్యే వర్గంతో వేరుపడి ఉన్నారు. ఇక కార్మిక క్షేత్రం నస్పూర్‌, శ్రీరాంపూర్‌లో కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రూప్‌లుగా విడిపోయి ఉన్నారు.

బెల్లంపల్లిలో రగడ
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణల నేపథ్యంలో ఆయన వ్యతిరేక వ ర్గం అలర్ట్‌గా ఉంది. సమయం దొరికితే అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. ఇక్కడ టికెట్‌ ఆశి స్తున్న వారిలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రే ణికుంట్ల ప్రవీణ్‌ ఉన్నారు. వేమనపల్లి మండల జెడ్పీటీసీ స్వర్ణలత, నీల్వాయి ఎంపీటీసీ సంతోష్‌ వీరిద్ద రూ భార్యాభర్తలు. ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా నే ఉంటున్నారు. మొదట కాంగ్రెస్‌ నుంచే గెలిచి గు లాబీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ పార్టీ మార్పు ఖా యం అంటున్నారు.

ఇక కన్నెపల్లి మండలం ఎంపీపీ సృజన నర్సింగారావు సైతం అసమ్మతితో ఉన్నా రు. బెల్లంపల్లి పట్టణంతోపాటు తాండూరు మండలంలో కింది స్థాయిలో అసమ్మతి ఉంది. ని యోజకవర్గంలో ఓ జెడ్పీటీసీ, ఎంపీపీ కూడా లోపల తమను పట్టించుకోవడం లేదనే ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి వివేక్‌, కాంగ్రెస్‌ నుంచి వినోద్‌ అసంతృప్తి నేతలతో ఇప్పటికే సంప్రదింపులు చేశారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడే పార్టీ మారకుండా నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు.

ఖానాపూర్‌లోనూ అంతే..
ఖానాపూర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న జన్నారం మండలంలోనూ అధికార పార్టీలో అసమ్మతి ఉంది. స్థానిక జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీపీ సరోజన, చింతగూడ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ధర్మ తదితర నాయకులు పార్టీని అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

పార్టీని చక్కబెట్టేదెవరు?
అధికార పార్టీలో అంతర్గత వర్గ పోరు, అసమ్మతి చక్కబెట్టేదెవరనది పెద్ద ప్రశ్నగా మారింది. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించలేదనే నాయకులు చెబుతున్నారు. ఇటీవల సీఎం సభ, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగినా ఎవరికి వారే అన్నట్లు సాగింది. జిల్లాలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడి మాట వినే స్థాయిలో ఉన్నారా? అంటే, చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే తన నియోజకవర్గానికే ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారని, సుమన్‌పై ఒకింత వ్యతిరేకత ఉంది.

ఈ నేపథ్యంలో మూడోసారి రాష్ట్రంలో హ్యాట్రిక్‌ కొట్టాలని ఆరాట పడుతున్న గులాబీ పార్టీకి జిల్లా పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం, అసెంబ్లీ, తర్వాత లోక్‌సభ ఎన్నికలు వరుసగా ఉన్నాయి. ఏ మాత్రం అవకాశం చిక్కినా జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలు బీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీలో విభేదాలను తగ్గించి వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారనేది జిల్లా నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement