
సన్న బియ్యం కావాలి
● రేషన్‌దుకాణం వద్ద వినియోగదారుల బారులు ● లబ్ధిదారుల ఇంటికి సర్కారు బియ్యం ● సన్న బియ్యం రాకతో పరిస్థితిలో మార్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సన్న బియ్యం పంపిణీతో లబ్ధిదారులు రేషన్ దుకాణల వద్ద బారులు తీరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ సన్న బియ్యం కారణంగా ముందుకు వస్తున్నారని రేషన్ డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో పంపిణీ మొదలైన వారం రోజుల్లోనే 75శాతం పూర్తయింది. మిగతాది ఈ రెండు మూడు రోజుల్లోనే పూర్తి కానుంది. కొన్ని దుకాణాల్లో మొదటి మూడు, నాలుగు రోజుల్లోనే బియ్యం పంపిణీ పూర్తయింది.
అమ్మడం ఆగింది..
రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నప్పుడే పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిపోయేది. గతంలో దొడ్డు బియ్యం తినని చాలామంది రేషన్ దుకాణాల్లోనే బియ్యం బదులు డబ్బులు తీసుకునే వారు. కొందరు డీలర్లే బియ్యం కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారు. వీరే కాకుండా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అలా పెద్ద ఎత్తున బియ్యం జిల్లా దాటిపోయేది. ప్రస్తుతం సన్న బియ్యం రాకతో ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. కార్డుదారులు ఇంటి తీసుకెళ్తుండడంతో పక్కదారి పట్టకుండా వీలు కలుగుతోంది.
అందరికీ మేలు
రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వడం మంచిదే. ఇది అందరికీ మేలు చేసే ఆలోచన. ఎప్పటికీ ఇలాగే సన్న బియ్యం ఇవ్వాలి.
– కూన బుచ్చమ్మ, జైపూర్
వండితే బాగున్నాయి
రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. మేం వండుకుని తిన్నాం. బియ్యం బాగున్నాయి.
– డి.రాజమల్లు,
గ్రామం: ఎర్రగుంటపల్లి, మం: చెన్నూరు
రేషన్‌కార్డులు 2,19,106
రేషన్‌షాపులు 423
జిల్లాలో ప్రజాపంపిణీ స్వరూపం
బియ్యం కేటాయింపు 4,143.692 మెట్రిక్ టన్నులు
పంపిణీ చేసింది 3,118.113 మెట్రిక్ టన్నులు
డీలర్లకు తిప్పలు
సన్న బియ్యం పంపిణీతో డీలర్లకు తమకు కేటాయించిన కోటా కంటే తక్కువగా వస్తే ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బస్తాకు అరకిలో వరకు తక్కువ రావడం, లోడింగ్, అన్‌లోడింగ్‌లో బియ్యం వృథా కావడం, చినిగిన సంచులతో ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తూకంలో తక్కువగా వస్తే కార్డుదారులకు సరిపడా అందజేయడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి కొంతమంది డీలర్లకు ముందుగా, మరికొందరికి ఆలస్యంగా రవాణా అవుతున్నాయని చెబుతున్నారు. అన్నిషాపులకు నిర్ణీత కోటా, సకాలంలో వచ్చేలా సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాలో 75శాతం పైగా సన్న బియ్యం పంపిణీ చేశామని, మిగతాది మరో రెండ్రోజుల్లో పూర్తవుతుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సీహెచ్.బ్రహ్మారావు తెలిపారు.

సన్న బియ్యం కావాలి

సన్న బియ్యం కావాలి

సన్న బియ్యం కావాలి