
ముందస్తు ప్రణాళిక.. పంటకు మేలు
భూసార పరీక్షలు..
పంటకు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించాలి. భూసార పరీక్షకు మట్టి నమూనాలు సరైన పద్దతిలో తీసుకోవాలి. ఈ పరీక్షలతో భూమిలో ఎంత సారం ఉంది.. ఎలాంటి విత్తనాలు, ఎంత మోతాదులో ఎరువులు వేయాలి వంటి విషయాలు తెలుస్తాయి. ఇష్టారీతిగా ఎరువులు వినియోగించి నష్టపోవడం కంటే భూసార పరీక్షలతో పంటల సాగుతీరు మార్చుకోవాలి. భూసార పరీక్షలతో సూక్ష్మ, స్థూల పోషకాల లోపాలు, మోతాదు పద్ధతిలో ఎరువుల వాడకం, అదనపు ఖర్చులు తగ్గించుకునే వీలుంది. నూతన ఆధునిక యంత్రాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు.
నేలలో కలియదున్నితే మేలు..
జిల్లాలో ఏటా పత్తి పంట దిగుబడి అనంతరం పత్తి చెట్ల మొదళ్లను కోసి కుప్పగా చేసి కాల్చివేస్తుంటారు. కొంత వంట చెరుకుగా వినియోగిస్తున్నారు. అలా కాకుండా పత్తి మొదళ్లను వృథా పోకుండా రో టవేటర్ సహాయంతో భూమిలో తేమ ఉన్నప్పుడు భూమిలో కలియదున్నాలి. రోటవేటర్ తర్వాత మల్డ్‌చెల్డ్ నాగలితో దున్నాలి. తర్వాత మరోసారి రోటవేటర్‌తో కలియదున్నాలి. ఈ విధంగా చేయడం వలన భూమి సారవంతమై పత్తి పంటకు బయట నుంచి అందాల్సిన ఎరువులు తగ్గుతాయి.
వేసవి దుక్కులు కీలకం..
ఖరీఫ్ సాగుకు ముందు నుంచే చేలు చదును చేసుకుని నెల రోజుల ముందే వేసవి దుక్కులు దున్నుకోవాలి. తొలకరికి ముందే పంట విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటల కోతల తర్వాత భూమిని వదిలివేయకుండా వేసవిలో దుక్కి దున్నుకుంటే చీడపీడలను కొంత వరకు నివారించవచ్చు. నేలను లోతుగా దున్నడంతో కొంత తేమలో ఉన్న కీటకాలు నశిస్తాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి భూమిని దున్నుకోవాలి. ఈ వర్షాలతో లోతుగా దున్నడం వల్ల వరుసకు వరుస మధ్యలో వర్షపు నీరు నిలుస్తుంది. మొదటిసారి దుక్కులు దున్నిన తర్వాత రెండోసారి దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, శాస్త్రవేత్తలు సూచించిన చెరువు మట్టిని పొలంలో వేసుకుంటే పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ ఎరువులు అందించడం ద్వారా సూక్ష్మ పోషక లోపాలు నివారించవచ్చు. లోతు తక్కువ ఎర్రచల్క నేలల్లోనూ అడుగున గట్టిగా ఉన్న నేలల్లోనూ లోతుగా దుక్కి చేయడం చాలా ఉపయోగంకరంగా ఉంటుంది. నేలను 35 సెం.మీ నుంచి 40 సెం.మీ వరకు లోతుగా దున్నుకుంటే భూమిలో గట్టిపొర పగిలి నేల బాగా గుల్ల బారుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. లోతు దుక్కి ప్రభావం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది.
వేసవి దుక్కులు ఉపయోగకరం భూసార పరీక్షలు కీలకం వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్
వేసవికాలం ప్రారంభమైంది. రైతులు ఎండాకాలంలోనే దుక్కి దున్నడం, చేలు చదును చేయడం, గతేడాది పంట మొదళ్లు, ఇతర అవశేషాలు, చెత్త ఏరికాల్చడం వంటి పనులు చేస్తుంటారు. జూన్ నెలలో తొలకరి వర్షాలు కురవగానే విత్తనాలు సమకూర్చుకుంటారు. రైతులు ఇప్పటినుంచే ప్రణాళికా బద్ధంగా సాగుకు సిద్ధమైతే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ వివరిస్తున్నారు. వేసవిలో రైతులు చేపట్టాల్సిన పనులపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
– మంచిర్యాలఅగ్రికల్చర్