Gannavaram international airport
-
గన్నవరంలో పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకలు ఆలస్యం
సాక్షి, కృష్ణా: విమానాశ్రయాలపై పొగ మంచు ప్రభావం చూపిస్తోంది. తాజాగా గన్నవరం విమానాశ్రయం రన్ వేపై దట్టంగా పొగ మంచు అలుముకుంది. దీంతో, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చలి కాలం కారణంగా పొగ మంచు ప్రభావం ఎక్కువైంది. పలుచోట్ల దట్టమైన పొగ మంచు కారణంగా విమానాలు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో రన్ వేపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో, విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా ఢిల్లీ నుండి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. మరోవైపు.. ఉదయం 9 గంటలైనా రోడ్లపై దట్టమైన పొగ మంచు ఉండటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
గన్నవరం: పొగమంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
సాక్షి,కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతో విమానం హైదరాబాద్ వైపు మళ్లింది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. దీంతో విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తరచు అంతరాయం ఏర్పడుతోంది. ఇదీ చదవండి.. మిలాన్ విన్యాసాలు ప్రారంభం -
ప్రయాణికులతో కళకళ
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) ప్రయాణికులతో కళకళలాడుతోంది. ఒకప్పుడు రోజుకు 56 దేశీయ విమాన సర్వీసులు, సగటున 3,300 మంది ప్రయాణికులతో కళకళలాడింది. కోవిడ్ కారణంగా మూడేళ్లుగా తగ్గుముఖం పట్టిన ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఆరునెలల్లో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి గణనీయంగా నమోదవుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున 2,600 మందికిపైగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులు పెంచడంతోపాటు కొత్త రూట్లలో సర్వీసులు అందుబాటులోకి వస్తే మరింత వృద్ధి సాధించే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 9 నెలల్లో 6,94,293 మంది ప్రయాణికుల రాకపోకలు ఈ విమానాశ్రయం నుంచి 2019–20లో రికార్డు స్థాయిలో దేశీయంగా 11,30,583 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అనంతరం కోవిడ్ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులతోపాటు ప్రయాణికుల రద్దీ తగ్గుముఖం పట్టడంతో ఆ సంఖ్య 2020–21లో 5,07,215 మందికి చేరుకుంది. 2021–22లో ప్రయాణికుల సంఖ్య 6,25,131 మందికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే 2022–23లో తొలి తొమ్మిది నెలల్లోనే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ కాలంలో 6,94,293 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నెలకు సగటున 77 వేలమందికిపైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశీయంగా రాకపోకలు సాగించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు ప్రయాణికుల ట్రాఫిక్ పదిలక్షల మందికి చేరువయ్యే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడికి రోజుకు సుమారు 18 విమానాలు వస్తుండగా, 18 విమానాలు వెళుతున్నాయి. న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, కడపకు డొమెస్టిక్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకు సర్వీసులు పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. గతంలో నడిపిన ముంబై, వారణాసి సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు షిర్డీకి సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ఈ సర్వీసుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నుంచి పౌరవిమానయాన శాఖకు, ఎయిర్‌లైన్స్ సంస్థలకు కూడా ప్రతిపాదనలు వెళ్లాయి. -
‘గన్నవరం’ ఇక అంతర్జాతీయం
ఎయిర్‌పోర్ట్‌పై గెజిట్ విడుదల చేసిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే కేంద్ర క్యాబినెట్ గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అలాగే తిరుపతి విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అధికారికంగా గెజిట్ వెలువరించింది.