ప్రయాణికులతో కళకళ | Increasing Passengers at Vijayawada International Airport | Sakshi
Sakshi News home page

ప్రయాణికులతో కళకళ

Published Wed, Feb 1 2023 4:05 AM | Last Updated on Wed, Feb 1 2023 8:03 AM

Increasing Passengers at Vijayawada International Airport - Sakshi

విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంత­ర్జాతీయ విమానా­శ్ర­యం (గన్నవరం) ప్రయాణి­కు­లతో కళకళలాడుతోంది. ఒకప్పుడు రోజుకు 56 దేశీయ విమాన సర్వీ­సులు, సగటున 3,300 మంది ప్రయాణికులతో కళకళలా­డింది. కోవిడ్‌ కారణంగా మూడేళ్లుగా తగ్గుముఖం పట్టిన ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఆరునెలల్లో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి గణనీయంగా నమోదవుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున 2,600 మందికిపైగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తు­న్నారు. ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులు పెంచడంతోపాటు కొత్త రూట్లలో సర్వీసులు అందుబాటులోకి వస్తే మరింత వృద్ధి సాధించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

9 నెలల్లో 6,94,293 మంది ప్రయాణికుల రాకపోకలు 
ఈ విమానాశ్రయం నుంచి 2019–20లో రికార్డు స్థాయిలో దేశీయంగా 11,30,583 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అనంతరం కోవిడ్‌ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులతోపాటు ప్రయాణికుల రద్దీ తగ్గు­ముఖం పట్టడంతో ఆ సంఖ్య 2020–21లో 5,07,215 మందికి చేరుకుంది. 2021–22లో ప్రయాణికుల సంఖ్య 6,25,131 మందికి పెరిగింది. గతేడాదితో పోలి­స్తే 2022–23లో తొలి తొమ్మిది నెలల్లోనే ప్రయాణికుల సంఖ్య భా­రీ­గా పెరిగిం­ది. ఈ కాలంలో 6,94,293 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

నెలకు సగటున 77 వేలమందికిపైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశీయంగా రాకపోకలు సాగించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు ప్రయా­ణి­కుల ట్రాఫిక్‌ పదిలక్షల మందికి చేరు­వయ్యే అవకాశం ఉందని ఎయి­ర్‌­పోర్ట్‌ అధికారు­లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ప్రయా­ణికుల ఆదరణకు అనుగుణంగా కొత్త విమాన సర్వీసులు అందు­బాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడికి రోజుకు సుమారు 18 వి­మానాలు వస్తుండగా, 18 విమానాలు వెళుతు­న్నాయి.


న్యూఢిల్లీ, బెంగళూ­రు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, కడపకు డొమెస్టిక్‌ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. రద్దీ ఎక్కు­వగా ఉండే న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూ­రుకు సర్వీసులు పెంచాలని ప్రయా­ణికుల నుంచి డిమాండ్‌ వస్తోంది. గతంలో నడిపిన ముంబై, వారణాసి సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు షిర్డీకి సర్వీ­సులు నడపాలని కోరుతున్నారు. ఈ సర్వీ­సుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ నుంచి పౌరవిమానయాన శాఖకు, ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు కూడా ప్రతిపాదనలు వెళ్లాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement