ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు రూ.6.5కోట్ల విడుదల
సాక్షి, అమరావతి బ్యూరో :
గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ల్యాండ్‌పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తాత్కాలిక పరిహారం కోసం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.6.50కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర మౌలిక వసతుల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ జైన్ బుధవారం జీవో నంబరు 115 జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ప్రభుత్వం భూసమీకరణ విధానంలో భూములు సేకరించింది. ఈ విధానంలో 707మంది రైతులు 600 ఎకరాలను ఇచ్చారు. వారికి ఎకరాకు వెయ్యి గజాలు స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అప్పటి వరకు ఒక్కో రైతుకు జీవనభృతి కింద ఏడాదికి ఎకరాకు రూ.50వేలు చొప్పున ఇచ్చేందుకు అంగీకరించింది. ఉద్యానవన రైతులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎకరాకు రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఆ ప్రాంతంలో రైతు కూలీలకు కుటుంబానికి నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.6.50కోట్లు విడుదల చేసింది.