ganta murali
-
ఒకే ఒరలో రెండు కత్తులు
సాక్షి,పశ్చిమ గోదావరి : రాజకీయాలలో బద్ధశత్రువులు, మిత్రులు ఉండరంటారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిన్నటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ఒకే కారులో రాజధాని అమరావతికి పయనమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇప్పటికి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ఒక్కమారు కూడా సమయానికి రాని ఎమ్మెల్యే పీతల సుజాత వట్లూరు గేటు వద్ద తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళికి స్వాగతం పలకడానికి ముందే సిద్ధంగా ఉండటంతో ఆ పార్టీ నేతలే అవ్వాక్కయారంట. ప్రస్తుతం వారిద్దరూ ఒకే కారులో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా పీతల వర్గీయులందరినీ ఈ కార్యక్రమానికి సమాయత్తం చేయడంతోపాటు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి 40 కార్లలో ఆమె అనుచరులు హాజరవడం చర్చనీయాంశమైంది. అంతా పాత నీరే కొత్త నీరు స్వల్పం చింతలపూడి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కామవరపుకోట మండలం నుంచి వెళ్ళిన వారందరూ అధిక శాతం ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్న నాయకులు, కార్యకర్తలే. వెళ్లిన వారిలో కొత్తగా మురళీ అనుచరగణంగా చెప్పుకునే స్థాయికల నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎమ్మెల్యే సుజాత వర్గీయులుగా ఉన్న కామవరపుకోట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల ఎంపీపీలతో పాటు వారి అనుచరగణం మొత్తాన్ని ఈ సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ఉందా? లేదా? చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కామవరపుకోట ఆర్అండ్బీ బంగ్లా దగ్గర నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులతో సుమారు 100 కార్లలో ర్యాలీగా అమరావతికి తరలివెళ్లారు. వీటిలో 30 నుంచి 40 కార్ల వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన జెండాలతో ర్యాలీగా వెళ్ళాయి. ప్రతీ కారుకూ ఓ స్టిక్కరు ఉంది. ఎన్నికల నియమావళి నేపథ్యంలో జెండాలు, స్టిక్కర్లు, ర్యాలీకి ఎటువంటి అనుమతి తీసుకోలేదని స్థానిక తహసీల్దార్ శ్రీ పల్లవి, ఎంపిడీఓ జె మన్మథరావు తెలిపారు. తాము ఏలూరు కలెక్టరేట్లో జరుగుతున్న ఎన్నికల సమావేశానికి వెళ్లినట్టు వివరించారు. -
'మోసం చేసిన బాబు రాజీనామా చేయాలి'
పశ్చిమగోదావరి: జామం పేట వద్ద పట్టిసీమ కుడికాలువ గండిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతాలోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు, దేవినేని ఉమ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు డిమాండ్ చేశారు. పట్టి సీమ పేరుతో ఇసుక, మట్టిని దోచుకుని వేలాది కోట్లు సంపాధించారని గంటా మురళి ఆరోపించారు. గండి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మహిళలకు సీఎం క్షమాపణలు చెప్పాలి
ఏలూరు : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మండిపడ్డారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మాట్లాడుతూ... 15 నెలలు పాలనలో ప్రత్యేక హోదా ఎందుకు గుర్తుకు రాలేదంటూ చంద్రబాబును వారు ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం న్యూఢిల్లీలో ధర్నా చేపట్టారని... ఆ తర్వాత కూడా చంద్రబాబు మేల్కొలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు లింగ వివక్ష వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మహిళలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తన అనుచరులతో కలిసి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సీమాంధ్రలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కాగా గంటా మురళికి మంచి పట్టు ఉండటంతో ఆయన చేరికతో చింతలపూడి నియోజకవర్గంలోని కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సీపీ మరింత బలపడనుంది. కాగా విజ్ఞాన్ సంస్థలు అధినేత లావు రత్తయ్య కూడా ఇవాళ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.