garbage storage
-
చెత్త బ్యాగ్ రూ.లక్షా 40వేలు.. వైరలవుతోన్న మీమ్స్
అంతలేదని కొట్టి పారేస్తున్నారా? అది నిజం. లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా ఈ బ్యాగులను తయారు చేసింది. కంపెనీ ‘ట్రాష్ పౌచ్’గా పిలుస్తున్న ఈ బ్యాగులను దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని తయారు చేసింది. బ్యాగును క్లోజ్ చేసేందుకు బ్యాక్‌పాక్‌కు ఉన్నట్టుగా త్రెడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్–22 కలెక్షన్లో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా ట్విట్టర్లోకి వచ్చాయి. అంతే ఆ ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్ యూజర్స్ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. కొందరైతే తిట్ల దండకమే మొదలుపెట్టారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీట్ చేశాడో యూజర్. ఇక ‘‘ఆ చెత్త బ్యాగ్‌ను తీసుకుని మీరు వెళ్తే... మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తా’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా లగ్జరీ ఐటమ్స్‌తో వివాదాస్పదం కావడం బలెన్సియాకు కొత్తేం కాదు... ఇదే ఏడాది మేలో ‘రబ్బిష్ బిన్’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ కంపెనీ. -
కొడుకు కోసం చెత్తని పోగుచేస్తే.. అదే అదృష్టంగా మారింది
చెట్టంత కొడుకు పనీపాటా లేకుండా ఇంట్లోనే కూర్చొని తింటూంటే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? చీవాట్లు పెట్టి బుద్ది చెపుతారు. పని వెదుక్కొని ఇంటి అవసరాలకు చేదోడువాదోడు అవమని కోరతారు. కానీ సౌత్‌కొరియాలో.. ఓ తండ్రి మాత్రం అలాంటి బద్ధకిస్టు కొడుకు మీద నిరసనగా ఇంటి నిండా చెత్తను పోగు చేయటం ప్రారంభించాడు. అది కూడా దశాబ్దంపాటు. అలా పోగైన చెత్త వాసనకు అతని భార్య అనారోగ్యం పాలయింది. డాక్టర్ల సలహా మేరకు వెంటనే ఆ చెత్తను తొలగించాల్సిన పరిస్థతి వచ్చింది. అందులో భాగంగా ఆ చెత్తనంతా అమ్మితే అతనికి రూ. 36 కోట్లు లభించాయి. అదంతా చూసిన చుట్టుపక్కల వాళ్లు ‘కొడుకు కోసం చెత్తనే ఆస్తిగా పోగుచేసినట్లుందే’ అని బుగ్గలు నొక్కుకున్నారట. నిజానికి ఆ తండ్రి అనుకున్నదొకటి.. అయినది ఇంకొకటి. ఇంట్లో చెత్తను పేర్చితే భరించలేక కొడుకు బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకుంటాడని ఆ తండ్రి ఆలోచన! ఏదైతేనేం పనిచేయని కొడుక్కి చెత్తతో ఆస్తిని సంపాదించి పెట్టాడు. ఇది దక్షిణకొరియాలో చోటు చేసుకుంది. -
నిర్మానుష్యంగా కొంగరకలాన్
ఇబ్రహీంపట్నంరూరల్ : లక్షలుగా తరలివచ్చిన ప్రజలను ఆ గ్రామం అక్కున చేర్చుకుంది. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వేదికగా నిలిచిన కొంగరకలాన్ ప్రస్తుతం బోసిపోయింది. సభ ఏర్పాట్లు ప్రారంభమైన పది రోజుల నుంచి అక్కడ సందడి నెలకొంది. ప్రతి రోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల రాకపోకలతో రద్దీగా మారింది. సభకు తరలివచ్చిన జనంతో రహదారులు కిక్కిరిపోయాయి. జనం నినాదాలు, మైకుల శబ్ధాలతో హోరెత్తిన ఆ ప్రాంతం సోమవారం తెల్లారే సరికి మూగబోయింది. ఆదివారం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడ్డారు. మరుసటి రోజు ఒక్క వాహనం కూడా కనిపించలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లే వారు కూడా లేకుండా పోయారు. ప్రగతి సభ కోసం ఏర్పాటు చేసిన కార్పెట్‌ను తీసేశారు. గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన కుర్చీలను ప్రాంగణం నుంచి తరలించారు. సభ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను తొలగించే పనిలో పడ్డారు. సూమారు 2వేల ఎకరాల్లో చెత్త ఎత్తివేయడానికి టీఆర్ఎస్ పార్టీ పనులు చేపడుతోంది. పర్యావరణానికి ముప్పు రాకుండా శుభ్రం చేస్తున్నారు. మోబైల్ మూత్రశాలను ప్రాంగనం నుంచి తరలించారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్రం చేసేలా చర్యలు చేపడతామని స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
మహా లక్ష్యం నీరుగారె..
► ఫలితమివ్వని సంస్కరణలు ► మెరుగుపడని పారిశుద్ధ్యం ► ‘దారి’ మళ్లిన రంగు డబ్బాల పథకం ► వేతనాలు, సిబ్బంది పెరిగినా ఫలితం శూన్యం ► కోట్లు ఖర్చు చేసినా బాగుపడని నగరం సాక్షి, సిటీబ్యూరో: మహానరగాన్ని మెరిపించేందుకు కొంగొత్త సంస్కరణలు అమలు చేశారు. అందుకు కోట్లు ఖర్చుపెట్టారు. సిటీని చెత్త రహితంగా మారుస్తామని నేతలతో కలిసి గ్రేటర్ అధికారులు ప్రమాణం చేశారు. రెండు రంగుల చెత్త డబ్బాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఉండేందుకు చెత్త తరలింపు కోసం దాదాపు 2 వేల చెత్త తరలింపు ఆటో ట్రక్కులను కొనుగోలు చేసి కార్మికులకు పంపిణీ చేశారు. చెత్త నిల్వ ప్రాంతాలుగా ఉన్న 1,1116 ప్రదేశాలను పరిశుభ్రం చేసి, తిరిగి అక్కడ చెత్త వేయకుండా రంగవల్లులతో తీర్చిదిద్దారు. పారిశుధ్య కార్మికులకు గుర్తింపునిస్తూ ‘పరిచయం’ పేరిట స్థానిక ప్రజలకు తెలిసేలా చేశారు. ఓవైపు ఈ పనులు చేస్తూనే మరో వైపు కార్మికుల డిమాండ్ల కనుగుణంగా వారి వేతనాలనూ పెంచారు. ఏడాది గడిచింది. నగరంలో పారిశుధ్యం మెరుగుపడిందా..? అంటే మాత్రం ప్రజల నుంచి పెదవి విరుపే సమాధానమైంది. నగరంలో నిర్వహించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’పై ‘సాక్షి’ ఫోకస్.. పక్కదారి పడుతున్న ఆటో టిప్పర్లు.. ఉన్నత లక్ష్యంతో చెత్త తరలించేందుకు జీహెచ్ఎంసీ చెత్త తరలింపునకు దాదాపు 2 వేల ఆటో టిప్పర్లు కొనుగోలు చేసింది. వాటిని తీసుకున్న కార్మికులు వాహనాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆటో వాళ్లకు, ఎప్పటినుంచో పనిచేస్తున్న రిక్షా కార్మికులకు గొడవలు జరుగుతున్నాయి. అందుకు కారణం తమ ఉపాధి పోతుందని రిక్షా కార్మికులు వాదిస్తున్నారు. ఈ ఆటోలను సైతం ఆస్పత్రుల వంటి వాటి నుంచి చెత్త తరలించేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇళ్లనుంచి సేకరించే చెత్తతో వచ్చే ఆదాయం కంటే ఆస్పత్రుల వ్యర్థాలను తరలిస్తే అధిక మొత్తం వస్తుందని ఇక్కడకే వెళ్లేందుకు పోటీపడుతున్నారు. ఇందుకు జీహెచ్ఎంసీ ఆటోలను వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేరు. రంగు వెలసిన జంట డబ్బాలు.. రోడ్లపై చెత్త వేయకుండా ఇళ్ల నుంచి నేరుగా చెత్త ఆటోల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలనే తలంపుతో ఆటోట్రాలీలను కొన్నారు. ఇంటికి రెండు రంగుల చెత్త డబ్బాలను అందజేశారు. వాటిలో తడి, పొడి చెత్తను వేరుగా వేయాలన్నారు. ఇందుకు జీహెచ్ఎంసీ 44.04 లక్షల డబ్బాలు పంపిణీ చేసింది. వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించలేకపోయారు. దాంతో ప్రజలు వీటిని ఇతర అవసరాలకు వాడుతున్నారు. దీంతో రూ. 42 కోట్లు ఖర్చు చేసినా వృథా ప్రయత్నమైంది. వేతనం పెరిగినా మారని తీరు.. గత జూలైలో 11 రోజుల పాటు పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పారిశుధ్య కార్మికుల వేతనం రూ. 8500 నుంచి రూ. 12,500కు పెరిగింది. డ్రైవర్లకు రూ. 10,200 నుంచి రూ. 15 వేలు చేశారు. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 24,446 మంది కార్మికులు లబ్ధి పొందారు. ఇందులో 948 మంది ఎస్ఎఫ్ఏలు, 975 మంది డ్రైవర్లు, 1537 మంది రవాణా విభాగంలోని కార్మికులు ఉన్నారు. తద్వారా జీహెచ్ఎంసీపై దాదాపు రూ. 200 కోట్ల భారం పడింది. ఏడాది గడిచింది.. పారిశుధ్య కార్యక్రమాలు మాత్రం మెరుగుపడలేదని నగర ప్రజలు భావిస్తున్నారు. ‘పరిచయం’ బాగున్నా.. గ్రేటర్‌లోని వివిధ విభాగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి ‘పరిచయం’ పేరిట విధుల్లోని కార్మికులపేర్లను ఆయా వీధుల్లోని గోడలపై రాయించారు. అయినా చాలా చోట్ల నాలుగైదు పేర్లే ఉంటాయి తప్ప ఏడుగురివీ ఉండవు. అంటే వాస్తవంగా పనిచేస్తున్నది నలుగురైదుగురేనన్న మాట. ఏదీ స్వచ్ఛ స్ఫూర్తి..! గత ఏడాది ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. పేరుకున్న చెత్తకుప్పలను తొలగించేందుకు వీలైనన్ని అదనపు వాహనాలు, సిబ్బందిని వినియోగించారు. ఆ పనుల కోసం దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో కాలనీని ఒక్కో వీఐపీ దత్తత తీసుకున్నారు. ఒకటిరెండు సమావేశాలు నిర్వహించారు. అనంతరం విస్మరించి లక్ష్యాన్ని నీరుగార్చారు. ఆగని అవినీతి.. సమ్మె కారణంగా అప్పట్లో తొలగించిన దాదాపు 1300 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు డబ్బులు చేతులు మారాయి. పనిలో పనిగా తీసివేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు లక్షలు తీసుకున్నట్టు ఆరోపణులున్నాయి. కాగితాల్లో తప్ప క్షేత్రస్థాయిలో కార్మికులు లేకపోవడం విచారణలో వెలుగు చూసింది. ఇలాంటి కారణాలతో ఇద్దరు ఏఎంఓహెచ్‌లను మాతృ సంస్థలకు సరెండర్ చేశారు. మరికొందరిని సస్పెండ్ చేశారు. -
చెత్తకు చెల్లు
సాక్షి, కర్నూలు: గ్రామాల్లో చెత్త నిల్వ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పల్లెల్లో చెత్త తొలగింపు పెద్ద సమస్యగా మారింది. తాజా నిర్ణయంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోనే చెత్త నిల్వ కేంద్రాలు(డంపింగ్ యార్డులు) ఉండగా.. తాజాగా గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలకు ఊరట లభించనుంది. ప్రత్యేక చర్యలు చేపట్టినా గ్రామాల్లో ఎప్పటికప్పుడు చెత్త పేరుకుపోతుండటంతో తరలింపు ప్రక్రియకు పంచాయతీలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. పంచాయతీలకు నిధుల మంజూరు కూడా అంతంతమాత్రమే కావడంతో సర్పంచ్‌లు ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్పంచ్‌లపై భారం కాస్త తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా పల్లెల్లో ప్రస్తుతం సేకరిస్తున్న చెత్తను సమీపంలోని చెరువులు, కుంటలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. తద్వారా నీరు రంగు మారడంతో పాటు కలుషితమై వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. నిల్వ కేంద్రాల ఏర్పాటుతో ఈ సమస్యలకూ పరిష్కారం లభించనుంది. ఉపాధి నిధులతో... ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. జిల్లాలోని 783 గ్రామ పంచాయతీలు, రెండు వేలకు పైగా అనుబంధ గ్రామాలకు తాజా ప్రభుత్వ నిర్ణయం మేలు చేకూర్చనుంది. మొదట మండల కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో గ్రామాల్లో మరింత పక్కాగా పథకం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా కూలీలకు నిరంతరం పని లభించడమే కాకుండా చెత్త తొలగింపుతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడనుంది. తాజా నిర్ణయంలో భాగంగా గ్రామ శివారులోని ఖాళీ పంచాయతీ స్థలంలో ఓ పెద్ద గుంత తవ్వి ఉంచుతారు. గ్రామంలోని చెత్తను ఉపాధి కూలీల ద్వారా అక్కడికి తరలించి నిల్వ చేయనున్నారు.