సాక్షి, కర్నూలు: గ్రామాల్లో చెత్త నిల్వ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పల్లెల్లో చెత్త తొలగింపు పెద్ద సమస్యగా మారింది. తాజా నిర్ణయంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోనే చెత్త నిల్వ కేంద్రాలు(డంపింగ్ యార్డులు) ఉండగా.. తాజాగా గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలకు ఊరట లభించనుంది. ప్రత్యేక చర్యలు చేపట్టినా గ్రామాల్లో ఎప్పటికప్పుడు చెత్త పేరుకుపోతుండటంతో తరలింపు ప్రక్రియకు పంచాయతీలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
పంచాయతీలకు నిధుల మంజూరు కూడా అంతంతమాత్రమే కావడంతో సర్పంచ్‌లు ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్పంచ్‌లపై భారం కాస్త తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా పల్లెల్లో ప్రస్తుతం సేకరిస్తున్న చెత్తను సమీపంలోని చెరువులు, కుంటలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. తద్వారా నీరు రంగు మారడంతో పాటు కలుషితమై వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. నిల్వ కేంద్రాల ఏర్పాటుతో ఈ సమస్యలకూ పరిష్కారం లభించనుంది.
ఉపాధి నిధులతో...
ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. జిల్లాలోని 783 గ్రామ పంచాయతీలు, రెండు వేలకు పైగా అనుబంధ గ్రామాలకు తాజా ప్రభుత్వ నిర్ణయం మేలు చేకూర్చనుంది. మొదట మండల కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో గ్రామాల్లో మరింత పక్కాగా పథకం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా కూలీలకు నిరంతరం పని లభించడమే కాకుండా చెత్త తొలగింపుతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడనుంది. తాజా నిర్ణయంలో భాగంగా గ్రామ శివారులోని ఖాళీ పంచాయతీ స్థలంలో ఓ పెద్ద గుంత తవ్వి ఉంచుతారు. గ్రామంలోని చెత్తను ఉపాధి కూలీల ద్వారా అక్కడికి తరలించి నిల్వ చేయనున్నారు.
చెత్తకు చెల్లు
Published Wed, Nov 27 2013 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement