garidepalli
-
పండగింట విషాదం
అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొంది. వీరన్న దేవుడి పండు గ ఉండడంతో పుట్టమన్నుకోసం వెళ్లి ఊరేగింపుగా తిరిగి వస్తుండగా మృత్యురూపంలో లారీ వారిపైకి దూసుకొచ్చింది.సూర్యాపేట జిల్లా గరి డేపల్లి మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సాక్షి, గరిడేపల్లి : వీరన్న దేవుడి పండుగకు ఆనందంగా గడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆదివారం తెల్లవారుజామున పుట్టమట్టి కోసం ఊరేగింపుగా వెళ్లిన వారిపైకి ఓ లారీ మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో తుంబాయిగడ్డ, సమ్మక్కసారక్క హోటల్ వద్ద మిర్యాలగూడెం–కోదాడ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లికి చెందిన చామకూరి అనిల్, నాగేశ్వరరావు ఇంట్లో వీరన్న దేవుడి పండుగ ఆదివారం జరగాల్సి ఉంది. పండుగకు ఆయా ఊళ్లలోని బంధువులను పిలిపించుకున్నారు. పండుగలో భాగంగా తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో గ్రామంలో ఊరేగింపుగా పలువురు పుట్టమట్టి కోసం వెళ్లారు. పుట్టమట్టి తీసుకుని తిరిగి వస్తుండగా మిర్యాలగూడెం నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో వారిపైకి దూసుకొచ్చింది. దీంతో గ్రామానికి చెందిన మర్రి వెంకమ్మ (44), మర్రి ధనమ్మ (44), చిలుకూరు మండలం బేతవోలుకు బీమలి మట్టమ్మ (38) అక్కడికక్కడే మృతిచెందారు. వీరితో పాటు మారిపెద్ది నాగమణి, పులగం భవానీ, చామకూరి శేషమ్మ, చామకూరి మమతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మిర్యాలగూడకు చెందిన మారిపెద్ది నాగమణి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందడంతో..ఊరేగింపులో పాల్గొన్న బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వచ్చి ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలానికి గరిడేపల్లి ఎస్ఐ వై.సైదులు తన సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన హుజూర్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలంలో పడి ఉన్న మృతదేహాలు మిన్నంటిన బంధువుల రోదనలు.. మహిళల పైనుంచి లారీ దూసుకెళ్లడంతో వెంక మ్మ, ధనమ్మ, మట్టమ్మ మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి. పలువురికి గాయాలు కావటంతో కేకలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాధం అలుముకుంది. మట్టమ్మ మృతదేహం లారీ టైర్ల కిందపడి నుజ్జునుజ్జుగా మారి ముద్దలుగా రోడ్డుపై పడిపోయింది. వెంకమ్మ, మట్టమ్మ ఒకే ఇంటికి చెందిన వారు కావడం.. వంట మనుషులుగా గ్రామంలో ప్రజలందరికీ సుపరిచితులు కావడంతో గ్రామస్తులంతా మృతదేహాలను చూ సేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పండుగ జరగాల్సిన రోజున ఇలాంటి సంఘటన జరగటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గరిడేపల్లిలో ఇంతపెద్ద సంఘటన జరగటం మొదటిసారి కావటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా మృతదేహాలను గరిడేపల్లి జెడ్పీటీసీ పెండెం శ్రీని వాస్‌గౌడ్, సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్నావెంకట్‌రెడ్డి, చైర్మన్ బండానర్సిరెడ్డి, ఉప సర్పంచ్ షేక్ సైదాబీ రాజమహ్మద్ పరిశీలించి నివాళులర్పించారు. సైదమ్మ, సీతమ్మ కుటుంబాలకు రూ.13 వేల ఆర్థికసాయం అందించారు. వారి వెంట వార్డు మెంబర్లు కొలిపాక నారాయణ, పిట్ట నర్సయ్య, మర్రి రాములు, షేక్ మన్సూర్‌అలీ, కానుగు ఆంజనేయులు, కానుగు నగేష్ ఉన్నారు. -
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
పొనుగోడు (గరిడేపల్లి) :మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని మంగళవారం పొనుగోడులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ నందిపాటి సైదులు, జ్యోతిల పెద్ద కుమారుడు నందిపాటి సునీల్ (17)మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లోని బాత్ రూంలో ఒంటిపై పెట్రోల్‌పోసుకుని నిప్పటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ శనివారం సినిమాకు వెళ్లడంతో తండ్రి మండలించగా మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తండ్రి సైదులు తెలిపారు. తన కుమారుడు సునీల్ కోదాడ అనురాగ్ కళాశాలలో డిప్లోమా మెకానికల్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్నాడని చాలా తెలివిగా ఉంటాడని తాను మంచిగా చదువుకోమని మందలించడంతో తెల్లవారుజామున ఎవరూ లేవని సమయంలో 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. తన చిన్న కుమారుడు రోహిత్ ఎస్ఆర్ఎం కోదాడలో 9వ తరగతి చదువుతున్నాడన్నారు. తాను చదువుకోమని చెప్పానని ఇలా చేసుకుంటాడని ఊహించలేదని తెలిపాడు. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు తమ కుమారుడు సునీల్ మృతి చెందడంతో తల్లిదండ్రులు సైదులు, జ్యోతి, చిన్నకుమారుడు రోహిత్‌తో పాటు బంధువులు, స్నేహహితులు, కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి సైదులు మేజర్ గ్రామ పంచాయతీ గ్రామసర్పంచ్‌గా, కళాకారునిగా ప్రతి ఒక్కరికి పరిచయముండడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సంతాపం తెలియజేశారు. -
కాలిబాటలతో ప్రయోజనం
గడ్డిపల్లి (గరిడేపల్లి) : పొలాల్లో కాలిబాటల ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని లయోలా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు తెలిపారు. శుక్రవారం మండలంలోని గడ్డిపల్లిలో రైతు మల్లిఖార్జున్ పంట పొలంలో కాలిబాటలపై కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. నాట్లు వేసే సమయంలో ఎన్ని ఎక్కువ మొక్కలు నాటితే అంత దిగుబడి వస్తుందని రైతులు భావించడం సరికాదన్నారు. వరిసాగులో మొక్కల సాంద్రత చాలా కీలకమైందని, మొక్కలు దగ్గరదగ్గరగా నాటడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి చీడపీడలు వ్యాపిస్తాయన్నారు. కాలిబాటలను తీసుకోవడం వల్ల దోమ పోటును నివారించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు కరిష్మా, సింధు, నిషిత, తేజస్వీ, బిందు పాల్గొన్నారు. -
రూ. 25 వేల విరాళం అందజేత
గరిడేపల్లి : కృష్ణా పుష్కరాల కోసం మట్టపల్లి నర్సింహాస్వామి క్షేత్రంలో జరుగే నిత్యాన్నదాన కార్యక్రమానికి మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విరాళం అందజేశారు. ఇందులో భాగంగా రూ. 25 వేలు, ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని ఆ సంఘం మండల అధ్యక్షుడు కడియం అప్పయ్య, అన్నదాన సత్రం అధ్యక్షుడు సాలేటి రామారావుకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మున్నూరు కాపుల వద్ద నుంచి ఈ విరాళం సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల రాము, కంబాలపల్లి వెంకటనారాయణ, గోపగాని సత్యనారాయణ, అర్జున్‌రావు, సైదులు, వెంకటమ్మ, సత్యావతి పాల్గొన్నారు. -
ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ
కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం శివాలయంలో నూతనంగా నిర్మించిన శివాంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుజారులు రాయప్రోలు శ్రీరామశర్మ, రాయప్రోలు భద్రయ్యశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెంగుండ్ల వెంకటేశ్వర్లు పుష్పావతి దంపతుల విరాళంతో 25 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చింతకాయల రామచంద్రయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
7న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ
కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివాంజనేయ విగ్రహా ప్రతిష్ట మహోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరాయప్రోలు భద్రశర్మ, శ్రీరామశర్మలు మంగళవారం తెలిపారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెగుండ్ల వెంకటేశ్వర్లు, పుష్పావతి దంపతుల సహకారంతో ఆలయంలో 25 అడుగుల ఎత్తుగల శివాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
గారకుంటతండాలో తీజ్ పండుగ
గారకుంటతండా (గరిడేపల్లి) : మండలంలోని గారకుంటతండాలో గురువారం తీజ్ పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు మోతీ మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ప్రతిఏటా జరుపుకునే పండుగే తీజ్ అన్నారు. తీజ్ ఉత్సవాలను జరుపుకునేందుకు ప్రభుత్వం గిరిజన తండాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, సక్రు లకుపతి, సురభి వెంకన్న, దశరథ నాయక్, పూల్‌సింగ్, డేంజర్, భవాని, మంగి పాల్గొన్నారు. -
కంకర మిల్లు పనుల అడ్డగింత
సర్వారం (గరిడేపల్లి) : మండలంలోని సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఈసీఎల్ కంకర మిల్లులోని డాంబర్ మిక్సర్ ప్లాంట్ పనులను బుధవారం గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు సర్వారం వెళ్లిన జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ భీమపంగు సోమమ్మ, సర్పంచ్ బజారమ్మను ప్లాంట్ విషయంపై గ్రామస్తులు నిలదీశారు. డాంబర్ మిక్సర్ ప్లాంట్‌తో దుర్గంధం, పొగ వ్యాపిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై ఎన్నిసార్లు చెప్పినా ప్లాంట్ యజమాన్యం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో విషయాన్ని జెడ్పీటీసీ వెంటనే ఫోన్ ద్వారా తహసీల్దార్‌కు వివరించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ప్లాంట్ వద్దకు వెళ్లి పనులను అడ్డుకున్నారు. దీంతో ప్లాంట్ పనులను నిలిపివేశారు. అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్లగానే మళ్లీ పనులను ప్రారంభించడంతో తిరిగి వెళ్లిన గ్రామస్తులు, నాయకులు తహసీల్దార్ వచ్చే వరకు కదిలేది లేదని బీష్మించుకూర్చున్నారు. దీంతో తహసీల్దార్ జయశ్రీ ప్లాంట్ వద్దకు చేరుకొని గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ప్లాంటులో ఉపయోగిస్తున్న కెమికల్ వివరాలను తెలపాలని, ప్లాంటును మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న ప్లాంటు నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, కెమికల్‌ను సేకరించి విచారణ జరుపుతామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుమ్మడెల్లి అంజయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కర్నాటి నాగిరెడ్డి, డైరెక్టర్లు సీతారాములు, పగిడి అంజయ్యతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.