మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు , అంతిమయాత్రకు తరలివచ్చిన జనం
అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొంది. వీరన్న దేవుడి పండు గ ఉండడంతో పుట్టమన్నుకోసం వెళ్లి ఊరేగింపుగా తిరిగి వస్తుండగా మృత్యురూపంలో లారీ వారిపైకి దూసుకొచ్చింది.సూర్యాపేట జిల్లా గరి డేపల్లి మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
సాక్షి, గరిడేపల్లి : వీరన్న దేవుడి పండుగకు ఆనందంగా గడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆదివారం తెల్లవారుజామున పుట్టమట్టి కోసం ఊరేగింపుగా వెళ్లిన వారిపైకి ఓ లారీ మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో తుంబాయిగడ్డ, సమ్మక్కసారక్క హోటల్ వద్ద మిర్యాలగూడెం–కోదాడ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లికి చెందిన చామకూరి అనిల్, నాగేశ్వరరావు ఇంట్లో వీరన్న దేవుడి పండుగ ఆదివారం జరగాల్సి ఉంది.
పండుగకు ఆయా ఊళ్లలోని బంధువులను పిలిపించుకున్నారు. పండుగలో భాగంగా తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో గ్రామంలో ఊరేగింపుగా పలువురు పుట్టమట్టి కోసం వెళ్లారు. పుట్టమట్టి తీసుకుని తిరిగి వస్తుండగా మిర్యాలగూడెం నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో వారిపైకి దూసుకొచ్చింది. దీంతో గ్రామానికి చెందిన మర్రి వెంకమ్మ (44), మర్రి ధనమ్మ (44), చిలుకూరు మండలం బేతవోలుకు బీమలి మట్టమ్మ (38) అక్కడికక్కడే మృతిచెందారు. వీరితో పాటు మారిపెద్ది నాగమణి, పులగం భవానీ, చామకూరి శేషమ్మ, చామకూరి మమతకు తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో మిర్యాలగూడకు చెందిన మారిపెద్ది నాగమణి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందడంతో..ఊరేగింపులో పాల్గొన్న బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వచ్చి ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలానికి గరిడేపల్లి ఎస్‌ఐ వై.సైదులు తన సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సంఘటన స్థలంలో పడి ఉన్న మృతదేహాలు
మిన్నంటిన బంధువుల రోదనలు..
మహిళల పైనుంచి లారీ దూసుకెళ్లడంతో వెంక మ్మ, ధనమ్మ, మట్టమ్మ మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి. పలువురికి గాయాలు కావటంతో కేకలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాధం అలుముకుంది. మట్టమ్మ మృతదేహం లారీ టైర్ల కిందపడి నుజ్జునుజ్జుగా మారి ముద్దలుగా రోడ్డుపై పడిపోయింది. వెంకమ్మ, మట్టమ్మ ఒకే ఇంటికి చెందిన వారు కావడం.. వంట మనుషులుగా గ్రామంలో ప్రజలందరికీ సుపరిచితులు కావడంతో గ్రామస్తులంతా మృతదేహాలను చూ సేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పండుగ జరగాల్సిన రోజున ఇలాంటి సంఘటన జరగటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గరిడేపల్లిలో ఇంతపెద్ద సంఘటన జరగటం మొదటిసారి కావటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా మృతదేహాలను గరిడేపల్లి జెడ్పీటీసీ పెండెం శ్రీని వాస్‌గౌడ్, సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్నావెంకట్‌రెడ్డి, చైర్మన్ బండానర్సిరెడ్డి, ఉప సర్పంచ్ షేక్ సైదాబీ రాజమహ్మద్ పరిశీలించి నివాళులర్పించారు. సైదమ్మ, సీతమ్మ కుటుంబాలకు రూ.13 వేల ఆర్థికసాయం అందించారు. వారి వెంట వార్డు మెంబర్లు కొలిపాక నారాయణ, పిట్ట నర్సయ్య, మర్రి రాములు, షేక్ మన్సూర్‌అలీ, కానుగు ఆంజనేయులు, కానుగు నగేష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment