గోదావరిఖని, న్యూస్‌లైన్ : రెండు రోజుల్లో దీపావళి పండుగ.. ఆనందంగా జరుపుకుందామని ఆశపడిన ఆ నిరుపేదల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. పండుగరోజు ఇంటి ముందు దీపాలు వెలిగించి.. బాణాసంచా కాల్చుతూ పిల్లలతో ఆనందంగా గడపాలని భావించిన వారి ఆశలను బుధవారం రాత్రి గోదావరినది బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆవిరి చేసింది. కూరగాయల విక్రయంతో రోజువారి కష్టం చేసుకుని జీవిస్తున్న చిరువ్యాపారులను లారీ రూపంలో వచ్చిన మృత్యుశకటం కబళించింది.
ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. దీపావళి వేళ తమ ఇంటి దీపం ఆరిపోయిందని మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు కలిచివేసింది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం సరిహద్దులో రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు ఇద్దరు కూరగాయల వ్యాపారులు మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ముగ్గురూ నివాసముండేది అద్దె ఇళ్లల్లోనే. ఇంటి యజమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మృతదేహాలను నేరుగా వారి స్వగ్రామాలకు తీసుకెళ్లినట్లు సమాచారం.
పాపం...శారద
గోదావరిఖని గాంధీనగర్‌లో నివాసముండే గూడూరి లక్ష్మీనారాయణ, శారద దంపతులు నిత్యం చుట్టుపక్కల నిర్వహించే వారసంతలకు వెళ్లి కూరగాయలు విక్రయిస్తారు. బుధవారం ఉదయం కూరగాయలను తీసుకుని ఆదిలాబాద్ జిల్లా ఇందారంలో జరిగే సంతకు వెళ్లారు. కూరగాయలు విక్రయించి సామగ్రిని ఆటోలో సర్దుకుని ఇంటికి బయలుదేరారు. కొద్ది సమయంలోనే రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. 22 ఏళ్ల క్రితం పెళ్లి అయిన ఈ దంపతులకు పిల్లలు లేరు. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎక్కడ సంత జరిగినా ఇద్దరూ వెళ్లేవారు. భర్త సంఘటన స్థలంలోనే చనిపోయిన విషయం తెలియని శారద తలతోపాటు కాళ్లు, చేతులు విరిగినా.. తన భర్తకేమైంది, కనిపించడం లేదంటూ ఆసుపత్రిలో తన బెడ్ పక్కన ఉన్న వారిని, వైద్యులను ఆడగడం కలిచివేసింది. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో లక్ష్మీనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నేరుగా గోదావరినది ఒడ్డుకు తీసుకెళ్లి తల్లి అనసూర్య ద్వారా బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త మరణించి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న శారదను చూసిన వారంతా ‘అయ్యో పాపం’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆటోనడిపితేనే...జీవనం
జమ్మికుంట మండలం రాములపల్లికి చెందిన గోపు తిరుపతి (40) కొం తకాలం క్రితం గోదావరిఖనికి వచ్చి అద్దె ఇంటిలో ఉంటూ ఆటో నడిపిస్తున్నాడు. ఈయన ప్రతీరోజు వివిధ ప్రాంతాల్లో జరిగే సంతలకు స్థాని క కూరగాయల వ్యాపారులను తీసుకెళ్తాడు. ఇందారం సంతకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈయనకు భార్య పద్మ, కుమారుడు రాకేశ్, కూతురు రమ్య ఉన్నారు. తిరుపతి ఆటో నడుపుతుండగా.. పద్మ కూలీకెళ్లేది. ఇద్దరు కష్టపడగావచ్చిన సొమ్ముతో కుమారుడిని పాలిటెక్నిక్, కూతురును పదో తరగతి చదివిస్తున్నారు. గురువారం ఉదయం వరంగల్ జిల్లా భూపాలపల్లిలో జరిగే సంతకు వెళ్తానని ఇందారం సంత నుంచి ఫోన్‌లో భార్యకు చెప్పిన కొద్ది క్షణాలలోనే తిరుపతి కానరాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబసభ్యులను తీవ్రంగా కలిచివేసింది. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన రాములపల్లిలో నిర్వహించగా.. కాలనీవాసులు, బంధువులు తరలివెళ్లారు.
ప్రమీల కుటుంబాన్ని వెంటాడుతున్న విధి
గోదావరిఖని విఠ ల్‌నగర్ పోచమ్మగుడి ప్రాంతంలో నివసించే శిలువేరి ప్రమీల రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. నాలుగేళ్ల క్రితం భర్త అనారోగ్యంతో మరణించాడు. ఏడాదిన్నర క్రితం కుమారుడుఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ప్రమీల మృతిచెందడంతో ఆమె ఇద్దరు కూతుళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరికి పెళ్లిళ్లు చేసి కూరగాయల వ్యాపారం చేస్తున్న ప్రమీల ప్రమాదంలో మృత్యువాత పడడం కాలనీవాసులను కలిసివేసింది. స్వగ్రామం మంథని సమీపంలోని బట్టుపల్లిలో ప్రమీల అంత్యక్రియలు నిర్వహించారు.
పండుగ వేళ ఆరిన ఆశల దీపాలు
Published Fri, Nov 1 2013 4:09 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement