ప్రభుత్వ గ్యాస్ ధరల ఫార్ములా సరికాదు
♦ ఈ ఫార్ములాను సమీక్షించండి
♦ కేంద్రాన్ని కోరిన ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యాస్ ధరల ఫార్ములా సరైనది కాదని ప్రభుత్వ రంగ సంస్థ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొ(ఓఎన్జీసీ) పేర్కొంది. కేజీ బేసిన్లో గ్యాస్ అన్వేషణల అభివృద్ధి ఈ ధరల ఫార్ములాతో సాధ్యం కాదని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఓఎన్జీసీ నివేదించింది. అందుకని ఈ ధరలను సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరామని ఓఎన్జీసీ సీఎండీ దినేశ్ కె. సరాఫ్ చెప్పారు.
గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్న అమెరికా, రష్యా, కెనడా దేశాల్లోని ధరల ఫార్ములా ఆధారంగా 2014లో ప్రభుత్వం కొత్తగా ఈ ధరల ఫార్ములాను రూపొందించింది. ఈ ఫార్ములా ప్రకారం ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్‌కు ధర 4.24 డాలర్లుగా ఉంది. కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో బ్లాక్‌లు భారీ లోతులో ఉన్నాయని, వీటినుంచి గ్యాస్ అన్వేషణ, వెలికితీతకు భారీగా పెట్టుబడులు పెట్టాలని, ఈ పెట్టుబడుల పరంగా చూస్తే ప్రభుత్వం ప్రతిపాదించిన ధర సరిపోదని సరాఫ్ వివరించారు.
కేజీ-డీ5 బ్లాక్‌లో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కోసం సవివరమైన ఫైల్డ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎఫ్డీపీ)ని చమురు రంగ నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ైెహ డ్రోకార్బన్స్(డీజీహెచ్)కు నివేదించామని తెలిపారు. అయితే ఈ ఎఫ్డీపీలో ఎలాంటి పెట్టుబడుల వివరాలను పొందుపరచలేదని తెలిపారు. 2018-19 కల్లా రోజులకు 77 వేల బ్యారెళ్ల చమురును, 14 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్ల గ్యాస్ ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని తెలిపారు.