గేట్ టాప్ స్కోర్?
ఫర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఎంటెక్, ఎంఎస్ (ఇంజనీరింగ్), ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి 30 వేలలోపు సీట్ల కోసం పోటీ దాదాపు పది లక్షల వరకూ ఉంటోంది.
మరోవైపు నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికం. దీంతో గేట్లో మంచి ర్యాంక్ కోసం పోటీ నానాటికీ పెరుగుతోంది. గేట్-2015 పరీక్ష తాజాగా ముగిసింది. గేట్లో మంచి స్కోర్ అంటే ఎంత? టాప్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం లభించాలంటే.. ఎంత ర్యాంకు రావాలి? పీఎస్యూలో ఉద్యోగం వంటి వివరాలపై ఫోకస్..
ఈసారీ.. ఈసీఈదే పైచేయి
గేట్-2015కు 8,89,156 మంది హాజరయ్యారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 7, 8 తేదీల్లో రోజుకు రెండు స్లాట్ల చొప్పున మొత్తం 8 స్లాట్‌ల్లో 22 సబ్జెక్ట్‌ల్లో పరీక్ష జరిగింది. 2,16,367 మంది అభ్యర్థులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసీఈ) ముందంజలో నిలిచింది. మిగతా బ్రాంచ్‌లు సీఎస్ఈకి 1,55,190; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు 1,41,799; మెకానికల్ ఇంజనీరింగ్‌కు 1,85,578; సివిల్ ఇంజనీరింగ్‌కు 90,872 మంది హాజరయ్యారు.
పూర్తి స్థాయి నైపుణ్యాన్ని పరీక్షించేలా
గేట్-2015 అన్ని పేపర్లలోనూ అభ్యర్థుల్లో పూర్తి స్థాయి సబ్జెక్ట్ నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉన్నాయని నిపుణుల విశ్లేషణ. న్యూమరికల్ టైప్ ప్రశ్నలు పెరగడం, సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు సమాన వెయిటేజీ, ప్రతి ప్రశ్నకు సాధన చేస్తేనే సమాధానం వచ్చేలా ప్రతి సబ్జెక్ట్ ప్రశ్నపత్రం ఉంది. దాంతో ఆయా అంశాలపై పూర్తి పట్టున్న అభ్యర్థులు మాత్రమే మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశముంది.
ఎలిమినేషన్, గెస్సింగ్ వంటి టెక్నిక్స్ ఉపయోగిద్దామనుకున్న అభ్యర్థులకు నిరాశే ఎదురైందని నిపుణుల అభిప్రాయం. అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రశ్నల క్లిష్టత స్థాయి గతేడాది కంటే ఎక్కువగానే ఉంది. సబ్జెక్ట్‌లు, స్లాట్ల మధ్య క్లిష్టత స్థాయిలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా.. తొలి స్లాట్‌లో హాజరైన అభ్యర్థికి, చివరి స్లాట్‌లో హాజరైన అభ్యర్థికి కూడా ఒకే తీరుగా క్లిష్టత స్థాయి ఉండటం గమనార్హం.
గేట్ స్కోర్‌తో ఐఐటీల్లో ఎంటెక్.. మలి దశ
గేట్ స్కోర్ ఆధారంగా ఎంటెక్, ఎంఈ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఐఐటీలు.. తదుపరి దశలో వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయి. గేట్ స్కోర్‌కు 70 శాతం వెయిటేజీ; మలి దశలోని గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలకు 30 శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి. అభ్యర్థులు ప్రతి ఐఐటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిందే! గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.వీటిల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. గేట్ స్కోర్ ఎంత ఉన్నా.. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలోనూ రాణిస్తేనే ఐఐటీల్లో సీటు ఖరారవుతోంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే వీటిలో ప్రతిభ చూపే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. గ్రూప్ డిస్కషన్లో సమకాలీన అంశాలపై చర్చించమని అడుగుతున్నారు. కాబట్టి తాజా ఆర్థిక, సామాజిక, వ్యాపార-వాణిజ్య పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇందుకోసం ఇప్పటి నుంచి నిరంతరం దినపత్రికలు చదవాలి, టీవీల్లో చర్చా కార్యక్రమాలను వీక్షించి సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పర్సనల్ ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు అకడమిక్ నేపథ్యం, భవిష్యత్తు లక్ష్యాలపైనే అడుగుతున్నారు. ప్రధానంగా చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, బయోడేటాలో పేర్కొన్న ఇష్టమైన సబ్జెక్ట్స్ నుంచే ఉంటున్నాయి.ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఇలాఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు కూడా గేట్ స్కోర్ ఆధారంగానే పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీటిలో సీట్ల భర్తీ సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్ (సీసీఎంటీ) ద్వారా జరుగుతుంది. ఇందుకోసం సీసీఎంటీ త్వరలో తేదీలు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయనుంది. అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి తమ ఇన్స్టిట్యూట్ ప్రాథమ్యాలను పేర్కొనాలి.
పీఎస్‌యూలకూ ప్రామాణికం గేట్ స్కోర్
దేశంలోని నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) ట్రైనీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇంజనీరింగ్) ఉద్యోగాల భర్తీకి గేట్ స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్‌హెచ్‌పీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్హెచ్ఏఐ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఖాళీల భర్తీ చేపడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతి సంస్థ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తోంది. గేట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ; తాము సొంతంగా నిర్వహించే గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలకు 25 శాతం వెయిటేజీ కల్పించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి.
200 నుంచి 1200లోపు ర్యాంకుతో ఐఐటీల్లో
గేట్ స్కోర్ ఆధారంగా ఖరారయ్యే ర్యాంకులు, ఐఐటీల ఇంటర్వ్యూ కాల్స్ ఆశించదగిన ర్యాంకుల విషయానికొస్తే..200 నుంచి 1200లోపు ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఆయా ఐఐటీల నుంచి మలి దశలో పోటీ పడే అవకాశం లభించనుందని అంచనా. దశాబ్దాలుగా పేరుగడించిన ఐఐటీ ఖరగ్‌పూర్, ముంబై, చెన్నై వంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు పొందాలంటే 500లోపు ర్యాంకుతోనే సాధ్యమని నిపుణుల అభిప్రాయం. ఇతర ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి 600 నుంచి 1000 లోపు ర్యాంకుతో మంచి స్పెషలైజేషన్‌లో ప్రవేశం లభించే అవకాశముంది. 1000 నుంచి 2000లోపు స్కోర్‌తో అప్‌కమింగ్ స్పెషలైజేషన్లలో సీటు పొందొచ్చు. పీఎస్‌యూ ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి జనరల్ కేటగిరీలో 800లోపు ర్యాంకు అవసరమని నిపుణుల అంచనా.
గేట్‌కు ప్రత్యామ్నాయాలివే
గేట్ స్కోర్ ఆధారంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఎంటెక్ ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించిన అభ్యర్థులు ఆ మేరకు స్కోర్ పొందలేకపోయినా నిరాశపడక్కర్లేదు. ఇప్పుడు ఎంటెక్ కోర్సును అభ్యసించేందుకు గేట్‌కు మరెన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవి..
⇒ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లలో ర్యాంకు ద్వారా సంబంధిత రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎంటెక్ అభ్యసించొచ్చు.
⇒ రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఎంటెక్ అడ్మిషన్ కౌన్సెలింగ్ సమయంలో గేట్ స్కోర్ పొందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని అభ్యర్థులు గమనించాలి.
⇒ ట్రీపుల్ ఐటీ హైదరాబాద్ నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ద్వారా ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 10, 2015. వివరాలకు www.iiit.ac.in/admissions/pgee చూడొచ్చు.
⇒ సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ర్యాంకుతో సెంట్రల్ యూనివర్సిటీల్లో చేరొచ్చు.
⇒ అమృత యూనివర్సిటీ, నిర్మా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ స్టడీస్, థాపర్ యూనివర్సిటీల్లోనూ గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం పొందే అవకాశం ఉంది.
⇒ గేట్ స్కోర్‌తో సంబంధం లేకుండా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లలో ప్రతిభ చూపి ఎంటెక్, ఎంఎస్ ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసించొచ్చు.
⇒ ఐఐటీ- చెన్నై, కాన్పూర్‌లు ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రత్యేక పరీక్ష కూడా అందుబాటులో ఉంది.
ఉద్యోగ అవకాశాలు
బీటెక్ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్నత విద్యతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగావకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగంలో స్థిరపడొచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇంజనీరింగ్ ఎంట్రీ పోస్ట్‌లకు నిర్వహించే పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ పరీక్షలకు సైతం సంసిద్ధులు కావొచ్చు.
స్పష్టత ఉండాలి
గేట్ స్కోర్‌తో ఉన్నత విద్యతోపాటు పీఎస్‌యూల్లో ఉద్యోగం పొందొచ్చు. అభ్యర్థులు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి అనే విషయంలో స్పష్టతతో ఉండాలి. సీసీఎంటీ ద్వారా ప్రవేశాలు లభించే ఎన్ఐటీలకు సంబంధించి ప్రాథమ్యాలను పేర్కొనే విషయంలో ముందస్తు కసరత్తు చేయాలి. జీడీ/పీఐలో విజయానికి మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపై పరిజ్ఞానం కూడా కీలకం.
- అమర్త్యసింగ్, డెరైక్టర్ (గేట్ కోచింగ్), టైమ్ ఇన్స్టిట్యూట్
మాక్ సెషన్స్‌తో మరింత ప్రయోజనం
గేట్ అభ్యర్థులు మలి దశలో విజయానికి మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్‌కు హాజరవ్వాలి. పీఎస్‌యూల్లో ఉద్యోగాల కోసం సబ్జెక్ట్‌పై పరిపూర్ణత సాధించాలి. పీఎస్‌యూ ఇంటర్వ్యూల్లో టెక్నికల్ సెషన్ పేరుతో ప్రత్యేకంగా సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా చిన్నపాటి రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఐఐటీలు, ఇతర ఇన్స్టిట్యూట్లలో ఎంపిక ప్రక్రియకు సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు కాంటెంపరరీ ఇష్యూస్‌పై అవగాహన అవసరం. ఇంజనీరింగ్‌తో అనుసంధానమైన సమకాలీన పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- ఎ. సునీల్ వర్మ, గెయిల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
(గేట్-2014 మెకానికల్ 4వ ర్యాంకు)
సరైన ప్రణాళికతో వ్యవహరించాలి
ఇంటర్వ్యూలో అకడమిక్ ప్రశ్నలను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి. ‘ఇష్టమైన సబ్జెక్ట్? లేదా ఈ స్పెషలైజేషన్నే ఎంచుకోవడానికి కారణం? అనే రెండు ప్రశ్నలకు ఇచ్చే జవాబులు ఇంటర్వ్యూలో కీలకం. బీటెక్ ప్రాజెక్ట్ వర్క్ నుంచి కూడా ప్రశ్నలు అడగొచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అకడమిక్ అంశాలన్నింటిని ఔపోసన పట్టాలి.
- వై.వి. గోపాల కృష్ణమూర్తి,ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ.