కొత్త జిల్లాలకు త్వరలో కొత్త నాయకత్వం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు
సాక్షి, హైదరాబాద్: పునర్ విభజనలో భాగంగా ఏర్పాటైన 31 జిల్లాలకూ త్వరలో అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన అత్యవసరంగా భేటీ అయ్యారు. కేసీఆర్ జిల్లా విభజనను ఏ ఉద్దేశంతో చేసినా అది పరోక్షంగా పార్టీల బలోపేతానికి దోహదపడుతుందని గట్టు అన్నారు. భారీ వర్షాలతో రైతులకు, నగర ప్రజలకు కలిగిన ఇబ్బందులను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు.
‘‘కల్తీ విత్తనాలతో నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి. వారికి రుణ మాఫీ చేయడమే గాక కేంద్రం ఇచ్చిన రూ.750 కోట్ల సబ్సిడీని తక్షణమే వారి ఖాతాలకు జమ చేయాలి. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించి కార్పొరేట్, ప్రయివేట్ ఆస్పత్రులు సమ్మెకు దిగకుండా చూడాలి’’ అని కోరారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ లేక వేలాది మంది విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారిందని పార్టీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. రూ.2 వేల కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కె. శివకుమార్, బోయినపల్లి శ్రీనివాసరావు, జె.మహేందర్ రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, మతీన్, నేతలు నర్రా భిక్షపతి, బొడ్డు సాయినాథ్ రెడ్డి పాల్గొన్నారు.