జినుగుర్తి కేజీబీవీలో కలకలం!
తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తిగేటు సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలకలం రేగింది. ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన గురువారం అలస్యంగా వెలుగుచూసింది. వివరాలు...జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న కేజీబీవీలో ఏడో తరగతి చదువుతున్న అనూష, ఎనిమిదో తరగతి చదువుతున్న అనిత కాచిగూడలోని ఓ అనాథాశ్రమం నుంచి ఇటీవలే ఇక్కడికి వచ్చారు. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి ఇద్దరు విద్యార్థినులు తోటివారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలలోని గదిలో నిద్రకు ఉపక్రమించారు. బుధవారం తెల్లవారుజమున 5 గంటల సమయంలో విద్యార్థినులు కనబడలేరు. దీంతో పాఠశాల సిబ్బంది వారికోసం తరగతి గదులు, ఆవరణలో వెతికినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఈ విషయాన్ని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ భావనికి తెలిపారు. ఆమె పోలీస్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని ఎస్ఐ రేణుకారెడ్ది దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినులు అదృశ్యమై రెండు రోజులు కావొస్తున్నా ఆచూకీ లేకపోవడంతో యాజమాన్యం, తోటి విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు.
విద్యార్థినుల అదృశ్యంపై సర్వశిక్షా అభియాన్ ఏఎమ్ఓ రవి విచారణ జరిపారు. కేజీబీవీకి చేరుకొని విద్యార్థినులతో పాటు సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. సమగ్రంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు చేశాం..
అదృశ్యమైన అనూష, అనితకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టాం. విద్యార్థినులిద్దరు అనాథలు కావడంతో వారి అచూకీ దొరకడం కష్టంగా మారింది. కాచీగూడ అనాథాశ్రమంలోనూ వారి గురించి వాకబు చేయగా అక్కడికి రాలేదని చెప్పారు.
– వెంకటయ్య, ఎంఈఓ