genetically
-
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..!
వాషింగ్టన్: తల్లి అయితే గాని స్త్రీ జన్మకు పరిపూర్ణత లభించదనుకునే సమాజం మనది. ఇక మాతృత్వం కోసం ప్రతి మహిళ పరితపిస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అమ్మ అని పిలుపించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. దురదృష్టం కొద్ది పిల్లలు పుట్టే అవకాశం లేని వారి బాధ వర్ణానాతీతం. అయితే ప్రస్తుతం వీరిపాలిట వరంగా మారింది కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్). కృత్రిమ గర్భధారణ ఎందరో మహిళలకు మాతృత్వం అనే వరాన్ని తిరిగి అందిస్తుంది. ఇదంతా బాగానే ఉంది.. కానీ దీనిలో ఏ మాత్రం తేడా జరిగినా.. ఫలితం దారుణంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు అమెరికాకు చెందిన ఓ జంట. ఇందుకు కారణమైన ఐవీఎఫ్ క్లినిక్పై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. (చదవండి: భర్త మరణించిన ఆరు నెలలకు గర్భం..!) అమెరికాకు చెందిన డఫ్నా, అలెగ్జాండర్ కార్డినాల్ దంపతులకు వివాహం అయ్యి చాలా కాలమయ్యింది కానీ పిల్లలు కలగలేదు. దాంతో వాళ్లు కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్) ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ ఐవీఎఫ్ కేంద్రాన్ని సంప్రదించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భవతి అయిన డఫ్నా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ రంగు, ఒత్తైన నల్లటి జుట్టు.. చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. తమ కుటుంబంలో ఎవరికి ఈ చిన్నారి లాంటి శరీర ఛాయ, జుట్టు లేవు. అయితే బిడ్డ పుట్టిన సంతోషంలో ప్రారంభంలో వారు ఇవేం పట్టించుకోలేదు. కానీ బిడ్డ పెరుగుతున్న కొద్ది వారిలో అనుమానం బలపడసాగింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు వారి బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించారు. ఫలితాలు వారిద్దరిలో ఎవరితో కూడా సరిపోలేదు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. (చదవండి: కోవిడ్ కాలం.. అంకురం కోసం...) ఈ క్రమంలో వారు తాము సంప్రదించిన ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లి.. విషయం చెప్పి.. నిలదీయగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డఫ్నా దంపతులు ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో జంట కూడా కృత్రిమ గర్భధారణ కోసం పక్కనే ఉన్న క్లినిక్కు వచ్చారు. అయితే ఈ రెండింటిలో పని చేసేది ఒక్కడే డాక్టర్. ఫలితంగా సదరు డాక్టర్ పొరపాటున ఇరువురి పిండాలను తారుమారు చేశాడు. అంటే డఫ్నా దంపతుల పిండాన్ని వేరే వారి గర్భంలో.. వారి పిండాన్ని డఫ్నా గర్భంలో ప్రవేశపెట్టాడు. జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండటంతో అనుమానం రావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు సదరు ఐవీఎఫ్ కేంద్రం మీద కేసు పెట్టారు. తమ జన్యుపరమైన బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. (చదవండి: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు) ఈ క్రమంలో రెండు జంటలు తమ తమ జన్యుపరమైన బిడ్డలను పరస్పరం మార్చుకుని... సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా డఫ్నా దంపతులు తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. మేం వేసిన లాసూట్ ద్వారా భావోద్వేగ నష్టాలు, పరిహారం,ఆస్తి నష్టాలు, అలాగే అనేక రకాల ఖర్చులను కోరుతోంది. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! -
డెంగ్యూ నియంత్రణకు జన్యుమార్పిడి దోమలు!
డెంగ్యూ వ్యాధి నివారణకు ఇప్పుడు భారతదేశంలో వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. దోమలవల్ల వ్యాపించే డెంగ్యూను.. అదే దోమలతో నివారించేందుకు మహరాష్ట్రకు చెందిన ఓ సంస్థ ప్రయోగాలు జరుపుతోంది. విజృంభిస్తున్న ప్రాణాంతక డెంగ్యూ వ్యాధిని నియంత్రించే దిశగా దృష్టి సారించిన సంస్థ... జన్యుమార్పిడి పద్ధతిలో దోమలను అరికట్టే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. భారతదేశంలో జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అభివృద్ధి చేసే కంపెనీ 'మైకో' సోదర సంస్థ.. గంగాబిషన్ భికులాల్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మహరాష్ట్రలో నెలకొన్న దోమల జన్యుమార్పిడి ప్రయోగశాల... అందులోని సాంకేతిక నిపుణులు భారతీయులే అయినప్పటికీ ఈ టెక్నాలజీని మాత్రం లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనలను ప్రోత్సహించే ఆక్సిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ పద్ధతిలో డెంగ్యూ దోమలు పెరిగి పెద్దవి అవకుండా శైశవ దశలోనే వాటిని అంతమొందిస్తారు. జన్యుమార్పిడి చేసిన మగదోమల వల్ల కలిగే సంతానం క్రమంగా అంతమొందుతుంది. అయితే ఈ పద్ధతిలో జరిగే సంపర్కం వల్ల ఏ ఇతర జీవులకు నష్టం కలగదని ఆక్సిటెక్ సంస్థ చెప్తోంది. లండన్ కు చెందిన పురుగులను నియంత్రించే పరిశోధనా సంస్థ ఆక్సిటెక్ ఈ జన్యుమార్పిడి దోమలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ ప్రయోగానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా డెంగ్యూ దోమలను జన్యుమార్పిడి దోమలను ప్రయోగించి నియంత్రించాలన్నది శాస్త్రవేత్తల ప్రయత్నం. ఈ సంస్థ విడుదల చేసిన జన్యు నియంత్రిత మగ దోమలు టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్ లేనప్పుడు లార్వా దశలోనే చనిపోవటం జరుగుతుంది. ఫలితంగా దోమల సంతతి తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరాలకు ప్రధానంగా కారణమయ్యే ఈడిస్ ఈజిప్టి దోమల నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. అయితే జన్యుమార్పిడి మగ దోమలతో ఆడదోమల సంభోగం జరగకుండా తప్పించుకునే దశలో ఏమౌతుంది అన్న విషయంలో మాత్రం... ఇంకా సందిగ్ధత కనిపిస్తోంది. అయితే ఈ జన్యు మార్పిడి దోమలవల్ల ఎటువంటి నష్టం కలగదని, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా నిర్మూలనకు మాత్రం ఎంతగానో సహకరిస్తుందని ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న సీనియర్ సైంటిస్ట్.. డాక్టర్ దాస్ గుప్తా చెప్తున్నారు.