డెంగ్యూ వ్యాధి నివారణకు ఇప్పుడు భారతదేశంలో వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. దోమలవల్ల వ్యాపించే డెంగ్యూను.. అదే దోమలతో నివారించేందుకు మహరాష్ట్రకు చెందిన ఓ సంస్థ ప్రయోగాలు జరుపుతోంది. విజృంభిస్తున్న ప్రాణాంతక డెంగ్యూ వ్యాధిని నియంత్రించే దిశగా దృష్టి సారించిన సంస్థ... జన్యుమార్పిడి పద్ధతిలో దోమలను అరికట్టే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. భారతదేశంలో జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అభివృద్ధి చేసే కంపెనీ 'మైకో' సోదర సంస్థ.. గంగాబిషన్ భికులాల్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.
మహరాష్ట్రలో నెలకొన్న దోమల జన్యుమార్పిడి ప్రయోగశాల... అందులోని సాంకేతిక నిపుణులు భారతీయులే అయినప్పటికీ ఈ టెక్నాలజీని మాత్రం లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనలను ప్రోత్సహించే ఆక్సిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ పద్ధతిలో డెంగ్యూ దోమలు పెరిగి పెద్దవి అవకుండా శైశవ దశలోనే వాటిని అంతమొందిస్తారు. జన్యుమార్పిడి చేసిన మగదోమల వల్ల కలిగే సంతానం క్రమంగా అంతమొందుతుంది. అయితే ఈ పద్ధతిలో జరిగే సంపర్కం వల్ల ఏ ఇతర జీవులకు నష్టం కలగదని ఆక్సిటెక్ సంస్థ చెప్తోంది. లండన్ కు చెందిన పురుగులను నియంత్రించే పరిశోధనా సంస్థ ఆక్సిటెక్ ఈ జన్యుమార్పిడి దోమలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ ప్రయోగానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా డెంగ్యూ దోమలను జన్యుమార్పిడి దోమలను ప్రయోగించి నియంత్రించాలన్నది శాస్త్రవేత్తల ప్రయత్నం. ఈ సంస్థ విడుదల చేసిన జన్యు నియంత్రిత మగ దోమలు టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్ లేనప్పుడు లార్వా దశలోనే చనిపోవటం జరుగుతుంది. ఫలితంగా దోమల సంతతి తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరాలకు ప్రధానంగా కారణమయ్యే ఈడిస్ ఈజిప్టి దోమల నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
అయితే జన్యుమార్పిడి మగ దోమలతో ఆడదోమల సంభోగం జరగకుండా తప్పించుకునే దశలో ఏమౌతుంది అన్న విషయంలో మాత్రం... ఇంకా సందిగ్ధత కనిపిస్తోంది. అయితే ఈ జన్యు మార్పిడి దోమలవల్ల ఎటువంటి నష్టం కలగదని, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా నిర్మూలనకు మాత్రం ఎంతగానో సహకరిస్తుందని ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న సీనియర్ సైంటిస్ట్.. డాక్టర్ దాస్ గుప్తా చెప్తున్నారు.