ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? : జానారెడ్డి
* మా సందేహాలకు సమాధానం ఇవ్వకుండా బెదిరింపులా: జానారెడ్డి
* ముఖ్యమంత్రి అధికార దర్పంతో మాట్లాడుతున్నారు
* చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే అధికారపక్షమైనా జైలుకు వెళ్లాల్సిందే
* మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రక తప్పిదం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా అని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇవ్వకుండా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సీఎంకు మంచిది కాదని, తమిళనాడులో పరువునష్టం కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో అణచివేత విధానం సరికాదన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రాజెక్టుల విషయంలో ప్రజల అభిప్రాయాలను, నష్టం జరిగే అంశాలను కాంగ్రెస్ ప్రశ్నించింది. వాటికి జవాబు చెప్పాల్సింది పోయి సీఎం అధికార దర్పంతో మాట్లాడుతున్నారు. ఊతపదాలు కాకుండా హుందాగా వ్యవహరించాలి. రాజకీయాలంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తీసుకురావొద్దు. గతంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్న సీఎం.. ఇప్పుడు చేస్తున్నదేమిటో చెప్పాలి. ప్రజల అభివృద్ధికి, శాశ్వత ప్రయోజనాలను పరిరక్షించడానికి ఏం చేస్తున్నారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
ఏటా కరెంటు బిల్లులే రూ.8 వేల కోట్లు!
మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రక తప్పిదమని జానారెడ్డి మరోసారి స్పష్టంచేశారు. 152 మీటర్లకు మహారాష్ట్రను ఒప్పించడానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసిందన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారెవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని, అది అధికార పక్షానికి కూడా వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు సంబంధించిన డీపీఆర్ కావాలని జూన్ 21న మంత్రికి లేఖ రాస్తే ఇప్పటిదాకా సమాధానం రాలేదని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా రూ.8 వేల కోట్లు కరెంటు బిల్లులే కట్టాల్సి ఉంటుందన్నారు. ‘‘వ్యక్తిగా నేను ఉండొచ్చు.. లేకపోవచ్చు.. కానీ రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం జర గొద్దన్నదే మా బాధ. 152 మీటర్ల ఎత్తుతో చేపట్టిన పనులు ఆపాలని మహారాష్ట్ర సీఎం లేఖ రాసింది నిజం కాదా? దీనిపై అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకుపోలేదు? ‘నేను ఇక్కడ ఉన్నా.. రా’ అని సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ సవాల్ చేయడం సరికాదు’’ అని అన్నారు. రైతుల పొలాలకు నీళ్లిస్తే ప్రభుత్వానికి ప్రచారం చేస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటనని చెప్పారు. మాటకు మాట మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేస్తున్న అవకతవకలను సరిదిద్దడం దేవుడి వల్ల కూడా కాదన్నారు. గద్వాల జిల్లా కోసం ప్రజలు బలంగా అభిప్రాయం వినిపిస్తున్నారని, పెద్ద జిల్లా అయిన పాలమూరును నాలుగు జిల్లాలుగా చేయాలని కోరారు.