genomics
-
ఇండియన్ జినామిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు
-
దేశంలో కరోనా కొత్త వేరియంట్.. ఫోర్త్ వేవ్ వస్తుందా?
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. 76 కేసుల్లో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కోటి ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ మొదటగా జనవరిలో 2 శాంపిళ్లలో బయటపడింది. ఫిబ్రవరిలో 59కి చేరింది. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడ్డట్టు ఇన్సాకాగ్ పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మాజీ కన్వీనర్ విపిన్ ఎం. వశిష్ట చెప్పారు. ఈ వేరియంట్ కారణంగా దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయని ట్వీట్ చేశారు. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం. యాక్టివ్ కేసులు 5,389కు చేరాయని కేంద్రం తెలిపింది. -
కరోనా XBB వేరియంట్ గుప్పిట్లో భారత్.. ముప్పు తప్పదా?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సబ్ వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుండడం అందుకు బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశోధన సంస్థ, సార్స్ కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియ్ ఇన్సకాగ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌బీబీ వేగంగా విస్తరిస్తోందని సోమవారం ఓ బులిటెన్ విడుదల చేసింది. ఎక్స్‌బీబీతో పాటు బీఏ.2.75, బీఏ.2.10 సైతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిపింది. ‘ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీఏ 2.75 ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, వ్యాధి వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనల్లో ఎలాంటి పెరుగుదల లేకపోవటం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్, దాని ఉప రకాలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. XBB అనేది భారత దేశం అంతటా ప్రస్తుతం ప్రభావం చూపుతున్న అత్యంత ప్రబలమైన వేరియంట్. నమోదవుతున్న కేసుల్లో 63.2 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్‌వే. బీఏ.2.75 కేసులు 46.5 శాతం, ఎక్స్‌బీబీ దాని ఉపరకాలు 35.8 శాతం ఉన్నాయి. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1ల వ్యాప్తిపై ఇన్సకాగ్ నిశితంగా పరిశీలిస్తోంది.’ అని బులిటెన్‌లో పేర్కొంది ఇన్సకాగ్. ఇదీ చదవండి: ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి -
40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ ఇవ్వొచ్చు!
న్యూఢిల్లీ: దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసు ఇవ్వొచ్చా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సార్స్–కోవ్–2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్ (ఇన్సాకాగ్) చెందిన శాస్త్రవేత్తల బృందం సిఫారసు చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు రంగాల్లో వ్యక్తులకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇన్సాకాగ్ తన వారాంతపు నివేదికలో చెప్పింది. లోక్‌సభ ఎంపీలు బూస్టర్ డోసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇన్సాకాగ్ ఈ సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా వైరస్‌లోని జన్యుక్రమాలను పరీక్షించడానికి ఇన్సాకాగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వేరియెంట్ కేసులు దేశంలోకి ప్రవేశించాయన్న విషయాన్ని త్వరితగతిన తెలుసుకోవడం కష్టసాధ్యమని, అందుకే కరోనా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలని చెప్పింది. -
భారతీయుల జెనోమిక్స్ విశ్లేషణ
లండన్: మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యూఎస్, యూకేలకు చెందిన రెండు కంపెనీలు జతకట్టాయి. ఇందుకోసం అవి భారతీయుల జెనోమిక్స్ (మాలిక్యులర్ బయాలజీలో ఓ భాగం) సమాచారాన్ని వాడుకోనున్నాయి. అరుదైన రోగాలను అధునాతన పద్ధతుల ద్వారా గుర్తించి మెరుగైన చికిత్స అందించే ఉద్దేశంతో కేంబ్రిడ్జిలోని గ్లోబల్ జెనె కార్ప్ (జీజీసీ), న్యూయార్క్‌లోని రీజనరాన్ జెనెటిక్స్ సెంటర్ (ఆర్జీసీ)లు సంయుక్తంగా భారత్‌లో ఓ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతీయుల జెనోమిక్స్ సమాచారాన్ని విశ్లేషించి, వ్యాధులను గుర్తించేందుకు, చికిత్స అందించేందుకు మెరుగైన మార్గాలను కంపెనీలు సూచించనున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో జెనోమిక్స్ సమాచారాన్ని ఈ కంపెనీలు పరిశీలించనున్నాయి. ఈ ప్రాజెక్టుతో భారత్‌లో ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వస్తాయనీ, ఇటీవల ప్రధాని ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకం వంటి లక్ష్యాలను సాధించడంలో జెనోమిక్స్ సమాచారం సాయపడుతుందని ఇన్వెస్ట్ ఇండియా అనే కంపెనీ సీఈవో చెప్పారు. ముంబై, అహ్మదాబాద్‌లలో జీజీసీకి మౌలిక వసతులను సమకూర్చే పనిని ఇన్వెస్ట్ ఇండియా చూసుకుంటోంది. -
‘జీనోమిక్స్’తో కేన్సర్ నిర్ధారణ ఉత్తమం
హెచ్‌సీజీ వైద్య సంస్థల చైర్మన్ అజయ్‌కుమార్ సాక్షి, బెంగళూరు : కేన్సర్ నిర్ధారణలో సంప్రదాయ పద్ధతి కన్నా జీనోమిక్స్ ఆధారిత విధానం ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని హెచ్‌సీజీ వైద్య సంస్థల చైర్మన్ బి.ఎస్.అజయ్‌కుమార్ తెలిపారు. కేన్సర్ రోగ నిర్ధారణ పరిశోధనల పరంగా ప్రముఖ లాబోరేటరీ స్టాండర్డ్ లైఫ్ సైన్స్, హెచ్‌సీజీ సంస్థల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా స్టాండర్డ్ లైఫ్ సైన్స్ చైర్మన్ విజయ్ చంద్రుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంప్రదాయ రోగ నిర్ధారణలో కేన్సర్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్‌లో ఉంది అనే విషయాన్ని గుర్తించేందుకు వీలవుతుందని అన్నారు. అయితే జీనోమిక్స్ ఆధారిత రోగ నిర్ధారణలో రోగికి ఏ స్థితిలో కేన్సర్ కారకం ఉందనే విషయంతో పాటు కుటుంబసభ్యులో ఎవరికైనా ఇదే విధమైన కేన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని కూడా గుర్తించవచ్చునని వివరించారు. కేన్సర్ కణం పరిమాణంతో పాటు ఎంత వేగంగా ఏ దిశలో విస్తరిస్తోందో కచ్చితంగా తెలుసుకునే అవకాశం కూడా ఉందన్నారు. దీని వల్ల రోగికి చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. దేశంలో తొలిసారిగా బెంగళూరులోని హెచ్‌సీజీ కేంద్ర కార్యాలయంలో ఈ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 60 మందికి జీనోమిక్స్ విధానంలో రోగ నిర్ధారణ చేసినట్లు చెప్పారు. ఈ విధానానికి రెండు వారాల సమయం పడుతుందని, ఉత్తమ ఫలితాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోగితో పాటు సంబంధీకులు ఎంతమందికి పరీక్షలు చేయాలనే విషయం కేన్సర్ రకం, స్టేజ్‌పై ఆధాపడి ఉంటుందని అన్నారు. కాగా, ప్రస్తుతం బ్రెస్ట్, ఓవరీ, లంగ్ కేన్సర్లకు జీనోమిక్ ఆధారిత రోగనిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని రకాల కేన్సర్ పరీక్షలకు వీటిని ఉపయోగిస్తామని అజయ్‌కుమార్ వివరించారు.