
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. 76 కేసుల్లో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కోటి ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ మొదటగా జనవరిలో 2 శాంపిళ్లలో బయటపడింది.
ఫిబ్రవరిలో 59కి చేరింది. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడ్డట్టు ఇన్సాకాగ్ పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మాజీ కన్వీనర్ విపిన్ ఎం. వశిష్ట చెప్పారు. ఈ వేరియంట్ కారణంగా దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయని ట్వీట్ చేశారు. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం. యాక్టివ్ కేసులు 5,389కు చేరాయని కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment