కేన్సర్ కణాల కాళ్లు విరగొట్టారు!
కేన్సర్ ప్రాణాంతకమే అయినప్పటికీ అది ఏ ఒక్క అవయవానికో పరిమితమైతే ప్రాణాపాయం తక్కువ. ఎప్పుడైతే అది ఒకచోటి నుంచి ఇతర అవయవాలకు విస్తరించడం మొదలవుతుందో అప్పుడే సమస్య. మెటాస్టాసిస్ అని పిలిచే ఈ దశను అడ్డుకునేందుకు జార్జియా టెక్ శాస్త్రవేత్తలు బంగారు నానో కడ్డీలతో ఓ ప్రయోగం చేశారు. మానవ కేన్సర్ కణాలపైకి ఈ నానో బంగారు కడ్డీలను ప్రయోగించి, వాటిని లేజర్ కిరణాల సాయంతో వేడిచేశారు.
ఈ వేడికి కేన్సర్ కణాలకు ఉండే కాళ్లలాంటి నిర్మాణాలు ధ్వంసమై పోయాయి. దీనివల్ల ఈ కణాలు ఇతర ప్రాం తాలకు విస్తరించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తాము అభివృద్ధి చేసిన ఈ పద్ధతి భవిష్యత్తులో కేన్సర్ మెటాస్టాసిస్ దశను అడ్డుకునేందుకు.. తద్వారా కేన్సర్ కణితులే లక్ష్యంగా మరింత మెరుగైన చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ముస్తఫా ఎల్.సయీద్ అంటున్నారు.