ఇదో ఇంటర్నెట్ ఆట!
కొందరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల లీల
డేటా కార్డుల అద్దెలు రూ.22 లక్షలు
వినియోగించకపోయినా తప్పని వ్యయం
సాక్షి, సిటీబ్యూరో: కాగితం లేకుండానే సమాచారం పంపిణీ కోసమని ల్యాప్‌టాప్‌లు పొందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గడచిన రెండేళ్లలో రూ. 21,87,701లను ఇంటర్నెట్ సదుపాయం కోసం డేటాకార్డుల నెలవారీ ఖర్చుల కింద ఖర్చు చేసేశారు. ల్యాప్‌టాప్‌ల కోసమని రూ.40లక్షలు ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ వాటిని వినియోగిస్తున్నారా? అంటే అదీ లేదు. ఇదీ మన కార్పొరేటర్ల తీరు. జీహెచ్ఎంసీ అధికారులు తమకు అవసరమైన సమాచారం పంపేందుకు తాము సైతం తమ ప్రతిపాదనల్ని అధికారులకు పంపేందుకు ల్యాప్‌టాప్‌లను వాడతామని, ఇంటర్నెట్ సదుపాయం కోసం డేటాకార్డులతో సహా పొందారు.
గత మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌లు వాడుతున్న కార్పొరేటర్లు గడిచిన రెండేళ్లలో డేటాకార్డుల బిల్లుల కింద పై మొత్తాన్ని వినియోగించారు. కాగితం లేకుండానే పనులు నిర్వహిస్తామని చెప్పిన వారు వాటిని వినియోగించకపోవడంతో అటు కాగితాల ఖర్చు వాటిని వారికి చేరవేసేందుకు కొరియర్ ఖర్చులు అయ్యాయి. ఎలాగూ బడ్జెట్ ఉందని ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్ పొందిన వారు వాటిని వినియోగించకపోవడమే విమర్శలకు తావిస్తోంది.
ఏంచేస్తున్నారు.. ?
కార్పొరేటర్ల ల్యాప్‌టాప్‌లను వారి సంతానం వాడుకుంటున్నారు. ఇంటర్నెట్ ద్వారా కొందరు యూట్యూబ్‌లో మూవీలు చూసేందుకు వాడుకుంటుండగా, ఇంకొందరు చాటింగ్‌కు వాడుకుంటున్నారు. మరికొందరు తమ చదువులకు పనికి వచ్చే సమాచారం కోసం వినియోగిస్తున్నారు.. ఇప్పటికీ కొంద రు కార్పొరేటర్లకు ల్యాప్‌టాప్‌ను వినియోగించడమే తెలియదంటే విడ్డూరం కాక మరేంటి.
గ్రేటర్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులు ఉండగా ..
ల్యాప్‌టాప్‌లను వాడుతున్నవారు 55 శాతం
ల్యాప్‌టాప్‌లను కుటుంబీకులు వాడుతున్న వారు 30శాతం
వాడని వారు 15 శాతం ఇలా అందరూ వాడటం లేదు. వాడే వారు సైతం ఇతర అవసరాలకు వాడుతుండడంతో జీహెచ్ఎంసీకి తప్పుతాయనుకున్న స్టేషనరీ, కొరియర్ ఖర్చులు తగ్గలేదు.
డేటాకార్డులతో సహా కార్పొరేటర్లకు గౌరవ వేతనం, ఫోన్‌బిల్లులు, తదితర ఖర్చులకుగాను గడచిన రెండేళ్లలో జీహెచ్ఎంసీ మొత్తం రూ. రూ. 3.47 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.68 కోట్లు ఖర్చు చేయగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.79 కోట్లు ఖర్చు చేసింది.