ఒకే ఒక్కడు త్రివర్ణంతో...
బీజింగ్: కరోనా పుట్టిన దేశం రెండేళ్ల తర్వాత కరోనా ఆంక్షల మధ్య ఒలింపిక్ క్రీడలకు వేదికైంది. దేశంలో పలు చోట్ల ఇంకా లాక్డౌన్లు కొనసాగుతుండగానే మరోవైపు చైనా రాజధాని నగరంలో వింటర్ ఒలింపిక్స్–2022 శుక్రవారం ప్రారంభమయ్యాయి. 2008 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ స్టేడియంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ రెండింటినీ నిర్వహించిన తొలి నగరంగా బీజింగ్ ఘనత వహించింది.
ఆరంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పాటు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి హాజరు కాగా... భారత్ సహా పలు దేశాలు ‘దౌత్యపర బహిష్కరణ’ను ప్రకటించి కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. 2020లో గాల్వాన్ సరిహద్దుల్లో భారత్‌తో పోరులో గాయపడిన సైనికుడు ఖి ఫాబియోను రిలేలో టార్చ్ బేరర్‌గా పెట్టడంపై తమ అసంతృప్తిని ప్రదర్శిస్తూ భారత్ ‘డిప్లొమాటిక్ బాయ్‌కాట్’ను ప్రకటించింది.
మానవ హక్కుల విషయంలో చైనా వ్యవహార శైలిని విమర్శిస్తూ పలు ఇతర దేశాలు కూడా ప్రారంభోత్సవానికి దూరమయ్యాయి. వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్ ఖాన్ అర్హత సాధించాడు. స్కీయింగ్‌లో స్లాలొమ్, జెయింట్ స్లాలొమ్ ఈవెంట్లలో అతను పోటీ పడుతున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్ ప్రారంభోత్సవ కార్య క్రమంలో భారత జాతీయ జెండాతో ముందుండగా ... భారత సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు కూడా ఆరిఫ్ వెంట నడిచారు. ఆరిఫ్ ఈవెంట్లు ఈనెల 13, 16వ తేదీల్లో ఉన్నాయి.