girl friend revenge
-
ప్రియుడి వేధింపులు: వీడియో కాల్ చేసి ప్రియురాలి ఆత్మహత్య
సాక్షి, గాంధారి(నిజామాబాద్): మండల పరిధిలోని మాధవపల్లి గ్రామానికి చెందిన యువతి రాయల సౌందర్య(21) నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల సౌందర్య బంధువైన లింగంపేట్ మండలం కొర్పోల్ గ్రామానికి చెందిర కర్రెల్లో స్వామి ఇరువురు గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి నిశ్చయించిన కొన్ని రోజుల తర్వాత ప్రియుడు స్వామి అదనంగా రూ. 2 లక్షలతో పాటు బైక్ ఇప్పించాలని సౌందర్యను వేధించసాగాడు. పెద్దలు నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అదనపు కట్నం తెస్తేనే పెళ్లి చేసుకుంటానని లేదంటే వేరే అమ్మాయిని చూసుకుంటానని స్వామి తేగిసి చెప్పాడు. ఈ క్రమంలో గత నెల 18న సౌందర్య ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్రియుడు స్వామితో వీడియో కాల్లో మాట్లాడింది. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరింది. ప్రియుడు నిరాకరించడంతో వీడియో కాల్లో మాట్లాడుతూనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. గాంధారిలోనే ఉన్న స్వామి వెంటనే సౌందర్య ఇంటికి చేరుకొని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వెళ్లి పోయాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల2న నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి రాయల సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేయసికి అవమానం: ప్రతీకారం తీర్చుకున్నాడు
రాజ్‌కోట్: ఐదేళ్ల క్రితం తన ప్రేయసికి జరిగిన అవమానానికి విభిన్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల తమిళసెల్వన్ కన్నన్.. 2015లో తన ప్రేయసిని అసభ్యకరంగా చిత్రీకరించి,సైబర్ వేధింపులకు గురి చేసిన ఆమె సహా వైద్య విద్యార్ధులందరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు తన ప్రతీకారం తీర్చుకునేందుకు విభిన్న రీతిని ఎంచుకొని, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్ధుల ల్యాప్‌టాప్‌లను టార్గెట్ చేశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఓ ల్యాప్‌టాప్ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీకారేచ్ఛలో భాగంగా నిందితుడు ఇప్పటివరకు 500 మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు దొంగిలించానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీలకు పాల్పడేందుకు నిందితుడు ఇంటర్నెట్లో మెడికల్ కాలేజీల సమాచారం సేకరించి, ఆ తరువాత రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. తాను చోరి చేసిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువ శాతం దక్షిణ భారత దేశంలోని మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్ధులవిగా పేర్కొన్నాడు. నిందితుడు చివరిగా గతేడాది డిసెంబర్లో జామ్ నగర్‌లోని ఎంపి షా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
గర్ల్ ఫ్రెండే పట్టించింది..
సాక్షి, శ్రీనగర్: భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టిన జైషే మహ్మద్ కాశ్మీర్ చీఫ్ ఖలీద్ ఎన్కౌంటర్ వెనుక పెద్ద కథే నడిచింది. ఖలీద్ పతనానికి మోహం, కామం, వంచన ప్రేరేపించాయి. అతడిని పట్టుకుని హతమార్చే ప్రక్రియకు స్వయంగా ఖలీద్ మాజీ ప్రియురాలే భద్రతా దళాలకు సహకరించడం గమనార్హం. ఖలీద్‌ను మట్టుబెట్టడమే తనకు కావాలని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరితో 20 సంవత్సరాల వయసున్న అతని గర్ల్ ఫ్రెండ్ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఖలీద్ కదలికలపై తాను సమాచారం ఇస్తానని మిగిలిన పని (హతమార్చడం) మీరు చక్కబెట్టాలని ఆమె పోలీస్ అధికారితో అన్నారు. ఉత్తర కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఖలీద్‌ను మట్టుబెట్టాయి. ఖలీద్‌పై ఆమెకు కోపం ఎందుకంటే..? ఉగ్రవాది ఖలీద్‌తో సన్నిహితంగా మెలిగిన అనంతరం గత ఏడాది తాను గర్భం దాల్చినట్టు బాధిత యువతి గుర్తించారు. ఈ వార్తతో తనలాగే ఖలీద్ సైతం సంతోషిస్తాడని ఆమె ఆశించారు. అయితే తన కడుపులో ఉన్న బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న అతడి సమాధానానికి ఆమె గుండె పగిలినంత పనైంది. దీంతో పంజాబ్‌లోని జలంధర్‌లో ఉంటున్న తన సోదరుడి వద్దకు వెళ్లి అక్కడే అబార్షన్ చేయించుకున్నారు. ఇక అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత లైంగిక అవసరాల కోసం తనను వాడుకుని, తర్వాత తనను మోసగించడం, కడుపులో పసికందునూ చిదిమివేయడం పట్ల ఖలీద్‌పై ప్రతీకారం కోసం రగిలిపోయారు. మరణశాసనం లిఖిస్తూ.. ఖలీద్‌పై పట్టరాని ఆగ్రహంతో రగిలిన బాధిత మహిళ పకడ్బందీగా తన మిషన్‌ను అమలు చేసేందుకు పూనుకున్నారు. ఎనిమిదేళ్లుగా ఖలీద్‌ను మట్టుబెట్టడంలో తృటిలో టార్గెట్ మిస్ అయిన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం చేరవేయడం ద్వారా తన పనిసులువవుతుందని భావించి జమ్మూలో సీనియర్ పోలీస్ అధికారిని కలిసి తన ప్లాన్‌ను వివరించారు. గత కొన్నేళ్లుగా జైషే ఉగ్రదాడుల వెనుక సూత్రధారిగా ఉన్న ఖలీద్‌ను మట్టుబెట్టేందుకు ఇదే సరైన అవకాశమని పోలీసులూ తమ ఆపరేషన్‌కు పదును పెట్టారు.లవర్‌బాయ్ ఇమేజ్ను పొందిన ఖలీద్ చివరకు తాను హతమయ్యే సమయంలోనూ ముగ్గురు, నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఉన్నట్టు గుర్తించారు. వంచన నుంచి ఎన్కౌంటర్ వరకూ... ఖలీద్ గర్ల్‌ఫ్రెండ్ ఇస్తున్న సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో అతడిని మట్టుబెట్టేందుకు వెళ్లిన భద్రతా దళాలకు అతడు ఝలక్ ఇస్తూ తప్పించుకు పారిపోయే వాడు. అయితే సోమవారం సొపోర్‌లో ఓ వ్యక్తిని కలుసుకునేందుకు వచ్చిన ఖలీద్‌ను అంతమొందించేందుకు భద్రతా దళాలు, పోలీసులు వేసిన స్కెచ్ నుంచి ఈసారి ఖలీద్ బయటపడలేకపోయారు. తనను చుట్టుముట్టిన దళాలపై ఖలీద్ కాల్పులకు తెగబడ్డా కేవలం నాలుగు నిమిషాల్లోనే ఎన్కౌంటర్ పూర్తి చేసిన అధికారులు కరుడుగట్టిన కమాండర్‌ను మట్టుబెట్టారు. -
అబ్బాయి ఫొటో మార్ఫింగ్.. ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు!!
సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాళ్ల ఫేస్బుక్ ప్రొఫైళ్లలోను, ఇతర పోర్న్ వెబ్సైట్లలోను అసభ్యంగా పోస్ట్ చేయడం చూస్తుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. తన బోయ్‌ఫ్రెండ్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి అతడి ఫొటోను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన యువతి.. వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దేవేశ్ శర్మ అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే వ్యాపార రంగంలో కాస్త కుదురుకుంటున్నాడు. '20 సమ్‌థింగ్ గాళ్' అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ఓ యువతి అతడికి పరిచయం అయ్యింది. వాళ్లిద్దరూ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్లు. 23 ఏళ్ల వయసున్న ఆమె సోదరికి తన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చేందుకు కూడా అతడు ఒప్పుకొన్నాడు. తర్వాత బయటకు పార్టీలకు వెళ్దామని అతడిని పిలవసాగింది. ఈలోపు ఆగస్టు మూడోతేదీ.. స్నేహితుల దినోత్సవం వచ్చింది. ఆరోజు బయటకు పార్టీకి వెళ్దామని, తనకు రూ. 4,500 పెట్టి హ్యాండ్‌బ్యాగ్, రూ. 9వేలు పెట్టి మినీస్కర్టు కొనివ్వాలని, అవి వేసుకుని పార్టీకి వస్తానని చెప్పింది. ఇలా మొదలుపెడితే ఇక తన పని అంతేనని అర్థం చేసుకున్న దేవేష్ శర్మ.. ఆమెను కలవకుండా ఊరుకున్నాడు. అప్పటికి వాళ్లు ఒకసారి కూడా కలవలేదు. అయితే ఇంటర్నెట్లోను, ఫోన్లో మాత్రం ఆమె అతడిని పలకరిస్తూనే ఉంది. మళ్లీ ఖరీదైన బహుమతులు అడగడంతో దేవేష్ ఎందుకొచ్చిందని ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాతి రోజు ఏకంగా వంద సార్లు ఫోన్ చేసి, 50 ఎస్ఎంఎస్లు ఇచ్చింది. తన డిమాండ్లను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఎస్ఎంఎస్లలో బెదిరించింది. అయినా దేవేష్ పట్టించుకోలేదు. దాంతో అతడి ఫొటోలను ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి సంగ్రహించి, వాటిని మార్ఫింగ్ చేసి అతడి పేరుమీద తప్పుడు ప్రొఫైల్ సృష్టించి, అందులో అతడి ఫొటోలను అత్యంత అసభ్యంగా పోస్ట్ చేసింది. దాంతోపాటు బూతు వెబ్సైట్లలో కూడా ఆ ఫొటోలను, అతడి ఫోన్ నెంబరును పోస్ట్ చేసింది. దేవేష్ స్వలింగ సంపర్కుడని అందులో రాసింది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న కుర్రాడు.. చేసేదేమీ లేక సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఆమె ఐపీ అడ్రస్‌ను బట్టి ఆమె మానక్నగర్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దాంతో ఆమె దేవేష్కు క్షమాపణ చెప్పి, ఆ ప్రొఫైల్ డిలిట్ చేసింది. ఇలాంటి కేసు ఇదే మొదటిసారని, అబ్బాయిలు కూడా ఇలా ఇబ్బంది పడటం ఇంతకుముందెప్పుడూ లేదని సైబర్ సెల్ పోలీసులు అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)