గర్ల్‌ ఫ్రెండే పట్టించింది.. | Story behind killing of a Jaish-e-Mohammad commander | Sakshi
Sakshi News home page

జైషే కమాండర్‌ ఎన్‌కౌంటర్‌: గర్ల్‌ ఫ్రెండే పట్టించింది

Published Mon, Oct 9 2017 4:28 PM | Last Updated on Mon, Oct 9 2017 6:59 PM

Story behind killing of a Jaish-e-Mohammad commander

సాక్షి, శ్రీనగర్‌: భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టిన జైషే మహ్మద్‌ కాశ్మీర్‌ చీఫ్‌ ఖలీద్‌ ఎన్‌కౌంటర్‌ వెనుక పెద్ద కథే నడిచింది. ఖలీద్‌ పతనానికి మోహం, కామం, వంచన ప్రేరేపించాయి. అతడిని పట్టుకుని హతమార్చే ప్రక్రియకు స్వయంగా ఖలీద్‌ మాజీ ప్రియురాలే భద్రతా దళాలకు సహకరించడం గమనార్హం. ఖలీద్‌ను మట్టుబెట్టడమే తనకు కావాలని జమ్మూ కాశ్మీర్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరితో 20 సంవత్సరాల వయసున్న అతని గర్ల్‌ ఫ్రెండ్‌ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఖలీద్‌ కదలికలపై తాను సమాచారం ఇస్తానని మిగిలిన పని (హతమార్చడం) మీరు చక్కబెట్టాలని ఆమె పోలీస్‌ అధికారితో అన్నారు. ఉత్తర కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఖలీద్‌ను మట్టుబెట్టాయి. 

ఖలీద్‌పై ఆమెకు కోపం ఎందుకంటే..?
ఉగ్రవాది ఖలీద్‌తో సన్నిహితంగా మెలిగిన అనంతరం గత ఏడాది తాను గర్భం దాల్చినట్టు బాధిత యువతి గుర్తించారు. ఈ వార్తతో తనలాగే ఖలీద్‌ సైతం సంతోషిస్తాడని ఆమె ఆశించారు. అయితే తన కడుపులో ఉన్న బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న అతడి సమాధానానికి ఆమె గుండె పగిలినంత పనైంది. దీంతో పంజాబ్‌లోని జలంధర్‌లో ఉంటున్న తన సోదరుడి వద్దకు వెళ్లి అక్కడే అబార్షన్‌ చేయించుకున్నారు. ఇక అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత లైంగిక అవసరాల కోసం తనను వాడుకుని, తర్వాత తనను మోసగించడం, కడుపులో పసికందునూ చిదిమివేయడం పట్ల ఖలీద్‌పై ప్రతీకారం కోసం రగిలిపోయారు.

మరణశాసనం లిఖిస్తూ..
ఖలీద్‌పై పట్టరాని ఆగ్రహంతో రగిలిన బాధిత మహిళ పకడ్బందీగా తన మిషన్‌ను అమలు చేసేందుకు పూనుకున్నారు. ఎనిమిదేళ్లుగా ఖలీద్‌ను మట్టుబెట్టడంలో తృటిలో టార్గెట్‌ మిస్‌ అయిన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులకు సమాచారం చేరవేయడం ద్వారా తన పనిసులువవుతుందని భావించి జమ్మూలో సీనియర్‌ పోలీస్‌ అధికారిని కలిసి తన ప్లాన్‌ను వివరించారు. గత కొన్నేళ్లుగా జైషే ఉగ్రదాడుల వెనుక సూత్రధారిగా ఉన్న ఖలీద్‌ను మట్టుబెట్టేందుకు ఇదే సరైన అవకాశమని పోలీసులూ తమ ఆపరేషన్‌కు పదును పెట్టారు.లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను పొందిన ఖలీద్‌ చివరకు తాను హతమయ్యే సమయంలోనూ ముగ్గురు, నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఉన్నట్టు గుర్తించారు. 

వంచన నుంచి ఎన్‌కౌంటర్‌ వరకూ...
ఖలీద్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇస్తున్న సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో అతడిని మట్టుబెట్టేందుకు వెళ్లిన భద్రతా దళాలకు అతడు ఝలక్‌ ఇస్తూ తప్పించుకు పారిపోయే వాడు. అయితే సోమవారం సొపోర్‌లో ఓ వ్యక్తిని కలుసుకునేందుకు వచ్చిన ఖలీద్‌ను అంతమొందించేందుకు భద్రతా దళాలు, పోలీసులు వేసిన స్కెచ్‌ నుంచి ఈసారి ఖలీద్‌ బయటపడలేకపోయారు. తనను చుట్టుముట్టిన దళాలపై ఖలీద్‌ కాల్పులకు తెగబడ్డా కేవలం నాలుగు నిమిషాల్లోనే ఎన్‌కౌంటర్‌ పూర్తి చేసిన అధికారులు కరుడుగట్టిన కమాండర్‌ను మట్టుబెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement