Girls trafficking
-
మరో ఏడుగురు బాలికలకు విముక్తి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వ్యభిచార నిర్మూలనకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు దాడులతో బాలికలను వ్యభిచార కూపంలోకి దించుతున్న నిర్వాహకుల అరాచకాలు ఒక్కొ క్కటి వెలుగు చూస్తున్నాయి. శనివారం రాచ కొండ పోలీసులు గుట్టలో బాలికలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు మహిళలను అరెస్టు చేసి వారి చెరలో ఉన్న ఏడుగురు బాలికలకు విముక్తి కల్పించారు. జూలై 30న, బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది వ్యభిచార గృహ నిర్వాకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 11మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ నెల 2న మరో 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని నలుగురు చిన్నారులను వారి నుంచి కాపాడారు. ఇందులో బాలికలకు హర్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడినీ అరెస్టు చేశారు. ఈనెల 10న కూడా ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు చిన్నారులను రక్షించారు. ఇప్పటి వరకు 24 మంది చిన్నారులను రక్షించి, 24 మంది వ్యభిచార నిర్వాహకులను అరెస్టు చేశారు. ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు గుట్ట సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాలికలు ఇంకా వ్యభిచార కూపా ల్లో మగ్గుతున్నారని తేలడంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బృం దాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐదుగురు మహిళలను అరెస్టు చేసి ఏడుగురు చిన్నారులను రక్షించారు. బాలికలను వ్యభిచార కూపాలనుంచి రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి చెప్పారు. -
పాపం పసి మొగ్గలు!
సాక్షి, యాదాద్రి : కొందరిని కిడ్నాప్ చేసి ఎత్తుకొస్తారు.. ఇంకొందరిని లక్షల రూపాయలు పోసి కొంటారు.. మరికొందరిని మాయమాటలతో పట్టుకొస్తారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఆడపిల్లలు తమ పిల్లలే అని చెప్పి స్కూళ్లలో చేర్పిస్తారు.. ఎవరడిగినా తామే తల్లిదండ్రులని చెప్పాలంటూ చిత్రహింసలు పెడతారు.. శరీర అవయవాలు పెంచేందుకు, యుక్త వయస్కులుగా కనిపించేందుకు ఇంజెక్షన్ల ద్వారా హార్మోన్లు ఎక్కిస్తారు.. 14 ఏళ్లు రాగానే వ్యభిచార కూపంలోకి దింపుతారు! ముక్కుపచ్చలారని పిల్లల దేహాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సాగిస్తున్న అమానుష దందా ఇదీ!! సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కంసాని కల్యాణి అనే వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఓ బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయాన్ని స్థానికులు షీ టీమ్‌కు అందించడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఈ కేసు మూలాల్లోకి వెళ్లే కొద్దీ ఒళ్లు గగుర్పొడిచే అనేక అంశాలు బయటికి వస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న అమ్మాయిని షీ టీమ్ పోలీసులు విచారించగా.. తనతోపాటు చాలా మంది బాలికలు నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. విషయం బయటపడటంతో.. చిన్నారులను ఇలా మురికి కూపంలోకి దింపుతున్నవారు ఇళ్లకు తాళాలు వేసి పారిపోయారు. ఎలా పట్టుకొస్తారంటే.. పిల్లలను వ్యభిచార కూపంలోకి అమ్మేందుకు కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఏపీలోని మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని కరీంనగర్, మెదక్, దుబ్బాక, నిజామాబాద్ జగదేవ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి ఈ ముఠా సభ్యులు పిల్లల్ని తీసుకొస్తారు. వీరు రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఉండే ఆడపిల్లలు, ఒంటరి మహిళలను, ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే పిల్లల్ని టార్గెట్ చేస్తారు. వీరితోపాటు అనాథలు, ఇళ్ల నుంచి పారిపోయి వచ్చే పిల్లల్ని గుర్తించి వారిని మచ్చిక చేసుకుని తీసుకొస్తారు. తమ మాట వినకుంటే బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లలో మత్తుమందు కలిపి తినిపించి కిడ్నాప్ చేస్తారు. సాధారంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న పిల్లల్ని నాలుగు నుంచి ఐదు రోజుల వరకు గమనించి వారితో మాట కలిపి దగ్గరవుతారు. ఈ ప్రయత్నం సఫలమైతే ఆ పిల్లలను నేరుగా వారు అనుకున్న ప్రదేశానికి తరలిస్తారు. అలా కాకుంటే కిడ్నాప్ చేస్తారు. అలాగే ఆస్పత్రులు, గిరిజన తండాలకు తిరిగి ‘మాకు పిల్లలు లేరు.. మీ పిల్లలను పెంచుకుంటాం..’అని మాయమాటలు చెప్పి తల్లిదండ్రులకు ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు. ఒంటరి మహిళలను కూడా ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని తెచ్చి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మే కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిగుట్టకు చెందిన శంకర్ 2015లో పట్టుబడ్డాడు. యాదగిరి అనే మరో వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఇంకా తెరవెనుక చాలామంది సూత్రధారులు ఉన్నట్లు తెలుస్తోంది. రంగును బట్టి రేటు అమ్మాయిలను తీసుకువచ్చిన ఏజెంట్లు, బ్రోకర్లు వ్యభిచార గృహాల నిర్వాహకులకు అమ్మేస్తారు. 3 నుంచి 4 సంవత్సరాల వయసున్న చిన్నారులను రంగును బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తుంటారు. యాదగిరిగుట్టలో పట్టుబడిన 13 మంది అమ్మాయిల్లో ముగ్గురిని ఇలానే కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారులను కొనుగోలు చేసిన వ్యభిచార గృహాల నిర్వాహకులు.. తమను తల్లిదండ్రులుగా గుర్తించాలని వారిని చిత్రహింసలకు గురి చేస్తారని తేలింది. గుండు గీయించడం, విపరీతంగా కొట్టడం, ఇనుప చువ్వలతో కాల్చడం, అన్నం, నీళ్లు ఇవ్వకుండా కడుపు మాడ్చడం వంటి హింసలకు గురి చేస్తారు. గతాన్ని మరిచిపోయేలా బీభత్సాన్ని సృష్టించి, ఎవరడిగా వారే మా తల్లిదండ్రులు అనేలా ఒప్పిస్తారు. తర్వాత పాఠశాలల్లో తమ పిల్లలుగా నమోదు చేసి చదువు చెప్పిస్తారు. తొందరగా రజస్వల అయ్యేందుకు హార్మోన్లు చిన్న వయస్సులోనే రజస్వల కావడానికి పిల్లలకు ఇంజక్షన్ల ద్వారా హర్మోన్లను ఎక్కిస్తున్నారు. ఈ ఇంజక్షన్లతో 13 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ల యుక్త వయస్కురాలిగా కనిపిస్తుంది. పోలీసుల దాడులు చేసిన వ్యభిచార గృహాల్లో ఆరు ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు లభించినట్లు తెలిసింది. ఆర్ఎంపీ వైద్యుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పిల్లలకు ఈ సూదులు ఇప్పిస్తున్నారు. తర్వాత వ్యభిచార నిర్వాహకులు వారిని ఈ ప్రాంతాలకు దూరంగా బంధువుల వద్దకు పంపించి వ్యభిచారం చేయిస్తారు. ఒకవేళ అందుకు అంగీకరించకుంటే చిత్రహింసలకు గురిచేస్తారు. తప్పుడు పత్రాలతో స్కూళ్లో చేర్పించి.. ప్రజ్వల లెర్నింగ్ స్కూలు నుంచి ఏడుగురు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. కేవలం కంసాని ఇంటి పేరు గల వారి పిల్లల కోసమే ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో వ్యభిచార నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణతో ఆడపిల్లలను చేర్పించారు. సోమవారం పోలీసులు రక్షించిన వారంతా 5 నుంచి 7 సంవత్సరాల బాలికలే కావడం గమనార్హం. వ్యభిచార నిర్వాహకులు రెండేళ్ల క్రితం వారిని ఈ పాఠశాలలో చేర్పించారు. మూడేళ్ల క్రితమే వెలుగులోకి.. 2015 నవంబర్ 16లో తూర్పుగోదావరికి చెందిన ఐదేళ్ల చిన్నారిని ఖమ్మంకు చెందిన సునీత, ఆదిలాబాద్‌కు చెందిన కుమార్‌లు యాదగిరిగుట్టకు చెందిన శంకర్‌కు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అమ్మారు. ఈ మేరకు కేసు కూడా నమోదైంది. అక్కడ సీసీ పుటేజీ, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్ల వివరాలను సేకరించేందుకు రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. సునీత, కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఐదేళ్ల చిన్నారితోపాటు మరో ముగ్గురు అమ్మాయిలను కూపంలోకి దింపినట్టు తేలింది. 11 మంది చిన్నారులకు విముక్తి: సీపీ బాలికల అక్రమ రవాణా కేసులో 8 మంది వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓ బాలికను తల్లి చిత్రహింసలకు గురిచేస్తుందన్న సమాచారంతో కంసాని కల్యాణి అనే మహిళ ఇంటిపై దాడులు చేశామన్నారు. ఇంట్లో ఉన్న చిన్నారి ఎవరని ఆరా తీయగా తన కూతురు కాదని, కొనుగోలు చేసినట్లు తెలిపినట్లు చెప్పారు. గణేష్‌నగర్‌లో ఉంటున్న మరొకొందరు కూడా 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను కొనుగోలు చేసినట్లు ఆమె చెప్పిందని, దీంతో వారిళ్లపై దాడులు చేసి 11 మంది చిన్నారులకు విముక్తి కల్పించామని వివరించారు. -
అరబ్ పంజరం
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరిట కామాంధులైన అరబ్ షేక్‌ల దాష్టీకానికి నగర అమ్మాయిలు ఎందరో సమిధలవుతూనే ఉన్నారు. అరబ్ షేక్‌లు నగరానికి రాకుండా ఇక్కడి అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో అక్కడికి పిలిచి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాలో ట్రావెల్ ఏజెంట్లు దళారులుగా వ్యవహరించి నిండు జీవితాలను బలిచేస్తున్నారు. ఉపాధి పేరుతో నగర అమ్మాయిల అక్రమ రవాణాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.... నెలకు 20 మంది రవాణా.. కాంట్రాక్ట్ మ్యారేజ్లు, ఖాజీలపై పోలీసుల ఉక్కుపాదంతో అరబ్ షేక్‌లతో అమ్మాయిల పెళ్లిళ్లు తగ్గాయి. కానీ ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను అరబ్ దేశాలకు తరలించడం ఇంకా సాగుతూనే ఉంది. బ్యూటీషియన్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, సేల్స్‌గర్ల్, రిసెప్షనిస్టు, ఇంటి పనులు తదితర వీసాలపై అమ్మాయిలను ఏటా వందల సంఖ్యలో గల్ఫ్ దేశాలకు తీసుకెళ్తున్నారు. ట్రావెల్ ఏజెంట్లు అక్కడి దళారులతో కుమ్మక్కై అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు ఉద్యోగాల ఎర వేస్తున్నారు. ఇక్కడైతే ఐదారువేలే సంపాదించవచ్చని.. అరబ్ దేశాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్జించవచ్చని మాయ మాటలు చెప్పి వారిని నమ్మిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కొందరు మహిళలను ప్రతినిధులుగా నియమిస్తున్నారు. చెప్పేదొకటి.. జరిగేది ఇంకోటి.. దళారులు, ఏజెంట్లు ఇక్కడి నుంచి అమ్మాయిలను జాబ్ వీసాపై పంపిస్తారు. అక్కడి వెళ్లిన తరువాత వీసా జారీ చేసిన షేక్‌కు వారిని అమ్మేస్తారు. పెళ్లి కాని అందమైన అమ్మాయిని రూ.5 లక్షలు, పెళ్లి అయిన మహిళని రూ.3 లక్షలు, వయసు ఎక్కువున్న మహిళను రూ.లక్షకు కొంటున్నారు. కొందరు అక్కడి నరకం భరించలేక బయటికొచ్చి చెప్పుకుంటున్నారు. మరి కొందరు అదే నరకంలో ఉండిపోతున్నారు. నరకం అనుభవించా.. సేల్స్‌గర్ల్ ఉద్యోగం ఉందని నమ్మించి ఏజెంట్లు నన్ను దుబాయికి పంపించారు. షార్జా ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తర్వాత ఏజెంట్ వచ్చి ఓ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. ఒక్కో షేక్ వచ్చి శరీరాన్నంతా తడిమి ఎంపిక చేసుకొని తీసుకెళ్లేవాడు. రోజుకో షేక్ రావడం తీసుకెళ్లడం.. నేను వెళ్లనని చెబితే తీవ్రంగా కొట్టేవారు. రూ.3.5 లక్షలకు విక్రయించామని ఏజెంట్ చెప్పాడు. ఆ నరకం భరించలేక మా అమ్మకు విషయం చెప్పాను. దీనిపై కేంద్రానికి ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ లేఖ రాయడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు నన్ను విడిపిం చారు. – అస్మా బేగం, హబీబ్‌నగర్ నా కూతురిని విడిపించండి బ్యూటీషియన్ వీసా ఉందని నమ్మించి ఏజెంట్ నా కూతుర్ని దుబాయికి పంపాడు. అక్కడికి వెళ్లిన తరువాత నా కూతురిని షేక్ అమ్మేయడంతో, ఇంటి పనితో పాటు పడక పని చేయిస్తున్నారు. నాకు ఫోన్ చేసి.. ఈ నరకం నుంచి రక్షించండి అని వేడుకుంది. – హలీమ్ ఉన్నీసా తల్లి హబీబ్ ఉన్సీసా, వట్టేపల్లి ఎందరినో రక్షించాం ఇమిగ్రేషన్ అధికారుల నిర్లక్ష్యంతో అమ్మాయిల అక్రమ రవాణా సాగుతోంది. ఏజెంట్ల మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. అలాంటి దుర్మార్గులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తేనే అమ్మాయిల రవాణాకు అడ్డుకట్టపడుతుంది. అలాగే ప్రజల్లోనూ ఇలాంటి ఉద్యోగాలపై అవగాహన కల్పించాలి. – అంజదుల్లాఖాన్,ఎంబీటీ అధికార ప్రతినిధి -
రూ. 2 లక్షలకు కన్నకూతుర్ని అమ్మేశారు
డబ్బులకు ఆశపడి అభం శుభం తెలియని బాలికను తల్లిదండ్రులు రూ. 2 లక్షలకు విక్రయించారు. ఈ మేరకు మధ్యవర్తి నుంచి డబ్బులు స్వీకరించి బాలికను గుజరాత్ తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రక్షించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా బషిరాబాద్ మండలం దామర్చేడ్ పంచాయతి పరిధిలోని వాల్యానాయక్ తండాకు చెందిన బాలిక(16)ని తల్లిదండ్రులు మనీబాయి అనే మధ్యవర్తికి విక్రయించారు. అతను ఆ అమ్మాయికి పెళ్లి చేస్తానని రైల్లో గుజరాత్‌కు తీసుకెళ్తుండగా.. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను రక్షించి విక్రయించిన తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. -
బాలికల అక్రమ రవాణాను నిరోధించాలి
ఏలూరు(ఆర్ఆర్ పేట) : బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక సెయింట్ థెరిస్సా పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. బాలికల, మహిళల రక్షణకు సమర్థవంతమైన చట్టాలు ఎన్ని అమల్లో ఉన్నా సమాజంలో సరైన చైతన్యం లేని కారణంగా ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని దేశాల్లోను డ్రగ్స్ వినియోగించి బాలికలను, మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని, దీనిపట్ల ప్రతి ఒక్కరూ అపమ్రత్తంగా ఉండాలని సూచించారు. చిన్ననాటి నుంచే ఏది మంచి, ఏది చెడు అనే విషయంపై సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. పరిచయం లేనివారితో ఏవిధంగా మెలగాలనే విషయంపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలు ఎక్కువగా తెలిసినవారి ద్వారానే జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి పోలీస్, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. బాలికల అక్రమ రవాణా ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత శాఖలు స్పందిస్తే 48 గంటల్లోనే ఆ బాలికలు ఎక్కడ ఉన్నా రక్షించవచ్చన్నారు. 8 మండలాల నుంచి బాలికల అక్రమ రవాణా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ ఆర్.సూయిజ్ మాట్లాడుతూ బాలికల అక్రమ రవాణాకు సంబంధించిన కార్యకలాపాలు జిల్లాలోని 8 మండలాల్లో నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. ఈ మండలాల్లో పోలీస్ శాఖ సమన్వయంతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రతి గ్రామంలోను స్థానికులతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా బాలల సంరక్షణ సమితి అధ్యక్షుడు స్నేహన్, ఐసీడిఎస్ పీడీ వి.వసంతబాల, శాంతిదాత, ప్రతినిధి హెరాల్డ్‌బాబు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, సెయింట్ థెరిస్సా హైస్కూల్ ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా బాలికలతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు.