పాపం పసి మొగ్గలు! | Girls Trafficking In Yadadri | Sakshi
Sakshi News home page

బాలికల అక్రమ రవాణా  

Published Tue, Jul 31 2018 2:59 PM | Last Updated on Wed, Aug 1 2018 4:40 AM

Girls Trafficking In Yadadri - Sakshi

కల్యాణిని విచారిస్తున్న చైల్డ్‌లైన్, ఐసీడీఎస్, షీటీం అధికారులు

సాక్షి, యాదాద్రి : కొందరిని కిడ్నాప్‌ చేసి ఎత్తుకొస్తారు.. ఇంకొందరిని లక్షల రూపాయలు పోసి కొంటారు.. మరికొందరిని మాయమాటలతో పట్టుకొస్తారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఆడపిల్లలు తమ పిల్లలే అని చెప్పి స్కూళ్లలో చేర్పిస్తారు.. ఎవరడిగినా తామే తల్లిదండ్రులని చెప్పాలంటూ చిత్రహింసలు పెడతారు.. శరీర అవయవాలు పెంచేందుకు, యుక్త వయస్కులుగా కనిపించేందుకు ఇంజెక్షన్ల ద్వారా హార్మోన్లు ఎక్కిస్తారు.. 14 ఏళ్లు రాగానే వ్యభిచార కూపంలోకి దింపుతారు! ముక్కుపచ్చలారని పిల్లల దేహాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సాగిస్తున్న అమానుష దందా ఇదీ!! సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కంసాని కల్యాణి అనే వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఓ బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయాన్ని స్థానికులు షీ టీమ్‌కు అందించడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఈ కేసు మూలాల్లోకి వెళ్లే కొద్దీ ఒళ్లు గగుర్పొడిచే అనేక అంశాలు బయటికి వస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న అమ్మాయిని షీ టీమ్‌ పోలీసులు విచారించగా.. తనతోపాటు చాలా మంది బాలికలు నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. విషయం బయటపడటంతో.. చిన్నారులను ఇలా మురికి కూపంలోకి దింపుతున్నవారు ఇళ్లకు తాళాలు వేసి పారిపోయారు. 

ఎలా పట్టుకొస్తారంటే.. 
పిల్లలను వ్యభిచార కూపంలోకి అమ్మేందుకు కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఏపీలోని మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని కరీంనగర్, మెదక్, దుబ్బాక, నిజామాబాద్‌ జగదేవ్‌పూర్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ ముఠా సభ్యులు పిల్లల్ని తీసుకొస్తారు. వీరు రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో ఉండే ఆడపిల్లలు, ఒంటరి మహిళలను, ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే పిల్లల్ని టార్గెట్‌ చేస్తారు. వీరితోపాటు అనాథలు, ఇళ్ల నుంచి పారిపోయి వచ్చే పిల్లల్ని గుర్తించి వారిని మచ్చిక చేసుకుని తీసుకొస్తారు. తమ మాట వినకుంటే బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లలో మత్తుమందు కలిపి తినిపించి కిడ్నాప్‌ చేస్తారు. సాధారంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న పిల్లల్ని నాలుగు నుంచి ఐదు రోజుల వరకు గమనించి వారితో మాట కలిపి దగ్గరవుతారు. ఈ ప్రయత్నం సఫలమైతే ఆ పిల్లలను నేరుగా వారు అనుకున్న ప్రదేశానికి తరలిస్తారు. అలా కాకుంటే కిడ్నాప్‌ చేస్తారు. అలాగే ఆస్పత్రులు, గిరిజన తండాలకు తిరిగి ‘మాకు పిల్లలు లేరు.. మీ పిల్లలను పెంచుకుంటాం..’అని మాయమాటలు చెప్పి తల్లిదండ్రులకు ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు. ఒంటరి మహిళలను కూడా ముఠాలు టార్గెట్‌ చేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని తెచ్చి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మే కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిగుట్టకు చెందిన శంకర్‌ 2015లో పట్టుబడ్డాడు. యాదగిరి అనే మరో వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఇంకా తెరవెనుక చాలామంది సూత్రధారులు ఉన్నట్లు తెలుస్తోంది. 

రంగును బట్టి రేటు 
అమ్మాయిలను తీసుకువచ్చిన ఏజెంట్లు, బ్రోకర్లు వ్యభిచార గృహాల నిర్వాహకులకు అమ్మేస్తారు. 3 నుంచి 4 సంవత్సరాల వయసున్న చిన్నారులను రంగును బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తుంటారు. యాదగిరిగుట్టలో పట్టుబడిన 13 మంది అమ్మాయిల్లో ముగ్గురిని ఇలానే కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారులను కొనుగోలు చేసిన వ్యభిచార గృహాల నిర్వాహకులు.. తమను తల్లిదండ్రులుగా గుర్తించాలని వారిని చిత్రహింసలకు గురి చేస్తారని తేలింది. గుండు గీయించడం, విపరీతంగా కొట్టడం, ఇనుప చువ్వలతో కాల్చడం, అన్నం, నీళ్లు ఇవ్వకుండా కడుపు మాడ్చడం వంటి హింసలకు గురి చేస్తారు. గతాన్ని మరిచిపోయేలా బీభత్సాన్ని సృష్టించి, ఎవరడిగా వారే మా తల్లిదండ్రులు అనేలా ఒప్పిస్తారు. తర్వాత పాఠశాలల్లో తమ పిల్లలుగా నమోదు చేసి చదువు చెప్పిస్తారు. 

తొందరగా రజస్వల అయ్యేందుకు హార్మోన్లు 
చిన్న వయస్సులోనే రజస్వల కావడానికి పిల్లలకు ఇంజక్షన్‌ల ద్వారా హర్మోన్‌లను ఎక్కిస్తున్నారు. ఈ ఇంజక్షన్లతో 13 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ల యుక్త వయస్కురాలిగా కనిపిస్తుంది. పోలీసుల దాడులు చేసిన వ్యభిచార గృహాల్లో ఆరు ఈస్ట్రోజన్‌ ఇంజక్షన్లు లభించినట్లు తెలిసింది. ఆర్‌ఎంపీ వైద్యుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పిల్లలకు ఈ సూదులు ఇప్పిస్తున్నారు. తర్వాత వ్యభిచార నిర్వాహకులు వారిని ఈ ప్రాంతాలకు దూరంగా బంధువుల వద్దకు పంపించి వ్యభిచారం చేయిస్తారు. ఒకవేళ అందుకు అంగీకరించకుంటే చిత్రహింసలకు గురిచేస్తారు. 

తప్పుడు పత్రాలతో స్కూళ్లో చేర్పించి.. 
ప్రజ్వల లెర్నింగ్‌ స్కూలు నుంచి ఏడుగురు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. కేవలం కంసాని ఇంటి పేరు గల వారి పిల్లల కోసమే ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో వ్యభిచార నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణతో ఆడపిల్లలను చేర్పించారు. సోమవారం పోలీసులు రక్షించిన వారంతా 5 నుంచి 7 సంవత్సరాల బాలికలే కావడం గమనార్హం. వ్యభిచార నిర్వాహకులు రెండేళ్ల క్రితం వారిని ఈ పాఠశాలలో చేర్పించారు. 

మూడేళ్ల క్రితమే వెలుగులోకి.. 
2015 నవంబర్‌ 16లో తూర్పుగోదావరికి చెందిన ఐదేళ్ల చిన్నారిని ఖమ్మంకు చెందిన సునీత, ఆదిలాబాద్‌కు చెందిన కుమార్‌లు యాదగిరిగుట్టకు చెందిన శంకర్‌కు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అమ్మారు. ఈ మేరకు కేసు కూడా నమోదైంది. అక్కడ సీసీ పుటేజీ, ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కిడ్నాపర్ల వివరాలను సేకరించేందుకు రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. సునీత, కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఐదేళ్ల చిన్నారితోపాటు మరో ముగ్గురు అమ్మాయిలను కూపంలోకి దింపినట్టు తేలింది. 

11 మంది చిన్నారులకు విముక్తి: సీపీ 
బాలికల అక్రమ రవాణా కేసులో 8 మంది వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓ బాలికను తల్లి చిత్రహింసలకు గురిచేస్తుందన్న సమాచారంతో కంసాని కల్యాణి అనే మహిళ ఇంటిపై దాడులు చేశామన్నారు. ఇంట్లో ఉన్న చిన్నారి ఎవరని ఆరా తీయగా తన కూతురు కాదని, కొనుగోలు చేసినట్లు తెలిపినట్లు చెప్పారు. గణేష్‌నగర్‌లో ఉంటున్న మరొకొందరు కూడా 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను కొనుగోలు చేసినట్లు ఆమె చెప్పిందని, దీంతో వారిళ్లపై దాడులు చేసి 11 మంది చిన్నారులకు విముక్తి కల్పించామని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

విచారణ కోసం చిన్నారులను తీసుకెళ్తున్న అధికారులు

2
2/2

మౌనిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement