Gita
-
లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు!
కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్లో ఈరోజు(ఆదివారం, డిసెంబరు 24) లక్ష మంది సామూహిక గీతా పఠనం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సంస్కృత పరిషత్, మతిలాల్ భారత్ తీర్థ సేవా మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం. ఈ కార్యక్రమం నిర్వహించడంపై ప్రధాని ప్రత్యేక సందేశం ద్వారా ప్రశంసించారు. కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ‘లోఖో కాంఠే గీతార్ పాఠ్’ కార్యక్రమం అభినందనీయమని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మన సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలు, జ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మేధస్సు, సాంస్కృతిక వైవిధ్యం, సామరస్య సమ్మేళనాల మేళవింపు ఈ కార్యక్రమం అని ప్రధాని మోదీ కొనియాడారు. శ్రీమద్ భగవత్ గీత మహాభారత కాలం మొదలుకొని నేటి కాలం వరకూ మనందరికీ స్ఫూర్తినిస్తోంది. అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి గీత మనకు దిశానిర్దేశం చేస్తుందని, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడాన్ని నేర్పుతుందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా కోల్‌కతాలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 300 మందికి పైగా సాధువులు కోల్‌కతా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారంతా ముందుగా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు 20 బ్లాకులను రూపొందించినట్లు నిర్వాహకుల్లో ఒకరైన స్వామి నిర్గుణానంద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. -
'దేవాలయం కంటే తక్కువేం కాదు..' గీతా ప్రెస్పై ప్రధాని ప్రసంశలు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గీతా ప్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశలు కురిపించారు. గీతా ప్రెస్ దేవాలయం కంటే తక్కువేం కాదని అన్నారు. ఈ మేరకు గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. ప్రతిపక్షాల చర్యలను ఎండగట్టారు. గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. 'కొన్నిసార్లు సన్యాసులు దారి చూపిస్తారు. మరికొన్ని సార్లు గీతా ప్రెస్ లాంటి సంస్థలు మార్గం చూపిస్తాయి' అని మోదీ చెప్పారు. గీతా ప్రెస్ మానవత్వానికి దారి చూపిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీకి గీతా ప్రెస్‌తో మంచి సంబంధం ఉందని గుర్తు చేశారు. గాంధీ నెలవారీ మ్యాగజీన్ 'కల్యాన్'ను ఈ సంస్థకే కేటాయించారని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఆ మ్యాగజీన్‌ను ప్రకటనలు లేకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు. గీతా ప్రెస్‌కు మహాత్మాగాంధీ శాంతి బహుమతిని కేటాయిస్తూ కొన్నిరోజుల క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ పార్టీ భావాజాలానికి చెందిన సంస్థకే కేటాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గీతా ప్రెస్ ఆ బహుమతికి చెందిన ప్రైజ్ మనీ కోటి రూపాయలను నిరాకరించింది. అనంతరం ప్రధాని మోదీ గీతా ప్రెస్పై మాట్లాడింది ఇదే తొలిసారి. గీతా ప్రెస్ ఎంతో మంచి పుస్తకాలను ముద్రిస్తుందని ప్రధాని తెలిపారు. ఎక్కడ గీత ఉంటుందో అక్కడ సాక్షాత్తు కృష్ణుడు ఉంటాడని అన్నారు. గీతా ప్రెస్ దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశ జ్ఞాన సంపదను పెంచుతోందని కొనియాడారు. 'ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్' విధానాన్ని గీతా ప్రెస్ ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఇదీ చదవండి: 'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు.. -
గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి–2021ను ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్‌కు ఈ బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలియజేసింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. ఈ బహుమతిని 2020లో బంగ్లాదేశ్‌కు చెందిన బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మన్‌కు ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లో గీతా ప్రెస్‌ను 1923లో స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. 14 భాషల్లో 41.7 కోట్లకుపైగా పుస్తకాలను ప్రచురించింది. వీటిలో 16.21 కోట్ల భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి. గీతా ప్రెస్‌కు అవార్డు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు. -
డా‘‘ రోల్ మోడల్: వయసు మరచి కలలు కనండి
యవ్వనంలో ఉన్న అమ్మాయికి గానీ అబ్బాయిలకు గానీ కాస్త ఈ పనిచేయండి? అని దేనిగురించి అయినా చెప్పామంటే..‘‘నా వల్ల కాదని కొందరు చెబితే, మరికొందరు నాకే చాలా పని ఉంది మళ్లీ ఇది చేయాలా? అని సణుగుతారు. ఇటువంటి యంగ్ జనరేషన్ ఉన్న ఈ రోజుల్లో ఆరుపదులు దాటిన అమ్మమ్మలు, నాయనమ్మలు కొందరు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే, మరికొందరు డెభైఏళ్ల వయసులోనూ కొత్త బిజినెస్‌లు ప్రారంభించి ఔరా అనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డాక్టర్ గీతా ప్రకాష్ ఈ కోవకు చెందిన వారే అయినప్పటికీ... వీరందరి కంటే ఒక అడుగు ముందుకేసి ఏకంగా రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. పేరులోనే తెలుస్తోంది ఆమె ఒక డాక్టర్ అని. ముఫ్పైఏళ్లపాటు డాక్టర్‌గా పనిచేసిన తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి మంచి మోడల్‌గా మారింది గీత. ఒకపక్క డాక్టర్‌గా సేవలందిస్తూనే, 67 ఏళ్ల వయసులో లేటెస్ట్ మోడల్‌గా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన గీతా ప్రకాష్ వైద్యవిద్యపూర్తయ్యాక జనరల్ ఫిజీషియన్‌గా బాధ్యతలు చేపట్టింది. ఒక డాక్టర్‌గా జీవితం ఎంతో సంతృప్తిగా సాగుతోంది. రోజూ తన క్లినిక్‌కు వచ్చే రోగులను చూడడం, వారి బాధలకు మందులు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడడం ఆమె దైనందిన చర్యగా మారింది. ఓ రోజు ఇటలీకి చెందిన ఓ ఫొటో గ్రాఫర్ ట్రీట్మెంట్ కోసం గీత దగ్గరకు వచ్చాడు. తన ట్రీట్మెంట్ పూర్తయ్యాక..ఫొటోగ్రాఫర్ కాస్త చనువు తీసుకుని ..‘‘మేడమ్! మీ ముఖం చాలా కళగా అందంగా ఉంది. మీరెందుకు మోడలింగ్ చేయకూడదు’’అని సూచించాడు. ఓ పేషెంట్ తనకు అస్సలు సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించడాన్ని గీత చిన్నగా నవ్వి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయింది. యాభైఏడేళ్ల వయసులో... కొన్ని నెలల తరువాత ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ నుంచి గీతకు ఉత్తరం వచ్చింది. ‘‘మేడమ్! మీ ఫొటోలు పంపించండి’’ అని ఆ ఉత్తర సారాంశం. ఆ ఫొటోగ్రాఫర్ మాటలు ప్రోత్సాహకరంగా ఉండడంతో గీతకు నచ్చాయి. దీంతో ‘‘చూద్దాం అతను చెబుతున్నాడు, కాబట్టి మోడలింగ్ చేద్దాం’’ అనుకుంది. అప్పటిదాకా ఫొటోల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో..ఎప్పుడూ మంచిగా రెడీ అయ్యి ఫొటోలు దిగలేదు. అప్పుడప్పుడూ దిగిన అత్యంత సాధారణ ఫొటోలను తన పిల్లలతో చెప్పి ఫొటోగ్రాఫర్‌కు పంపించింది. ఈ ఫొటోలు ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీకి నచ్చడంతో...అతను రూపొందించిన ‘కనీ’ శాలువాకు మోడలింగ్ చేసేందుకు గీత ఎంపికైంది. ఆ శాలువా ధరించి 57 ఏళ్ల వయసులో తొలిసారి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ శాలువాలు గీత వయసువారు ధరించేవి కావడం, పైగా ‘కనీ’ శాలువాలు గీతకు బాగా నప్పడంతో ఆ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ అయింది. దాంతో ఆమె మోడల్‌గా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత జైపూర్ బ్రాండ్ వాళ్లు కూడా మోడల్‌గా పనిచేయమని ఆఫర్ ఇవ్వడంతో అప్పటి నుంచి గీత మోడలింగ్‌లో దూసుకుపోతోంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆరు పదుల వయసులో గీత మోడలింగ్‌లో రాణించడానికి కుటుంబం మొత్తం మద్దతుగా నిలవడం విశేషం. ప్రతి మోడలింగ్ అసైన్‌మెంట్‌కు వెళ్లేటప్పుడు ఆమెను మరింత ఉత్సాహపరిచి పంపడం, గ్లాసీ పేపర్ల మీద వచ్చిన గీత ఫొటోలను చూపించి అభినందించేవారు. నా వృత్తిని ఆరాధిస్తాను... ‘‘వృత్తిని దేవుడుగా భావించి ఆరాధిస్తాను. మనపని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు తప్పకుండా వస్తుందని నమ్ముతాను’’ అని చెబుతూ.. ‘‘కలలు కనడం ఎప్పుడూ మానకండి, వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం, ఇప్పుడు మనవల్ల ఏం అవుతుంది అని అస్సలు అనుకోవద్దు. వయసు ఏదైనా సరే... ఏదోఒకటి సాధించాలన్న కలను కనాలి. ఈ ప్రపంచంలో దేనికీ ఇంతవరకే అన్న పరిమితి లేదు. మన అలవాట్ల ద్వారా కూడా ఏదైనా సాధించవచ్చు’’. అని మహిళలకు పిలుపునిస్తోంది. డాక్టర్‌గానూ.. మోడల్‌గానూ... ఒకపక్క డాక్టర్‌గా బిజీగా ఉంటూనే గత పదేళ్లుగా మోడలింగ్‌లో రాణిస్తోంది గీతాప్రకాష్. మోడల్‌గా మారినప్పటికీ గీత తన డాక్టర్ వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు. వారాంతాల్లో మోడలింగ్‌కు సమయం కేటాయిస్తూ...మిగతా సమయంలో పేషంట్లను చూసేది. మోడలింగ్‌లో తనకంటూ ఒక గుర్తింపు రావడంతో మరింత బాగా చేయడానికి ప్రయత్నించేది. మోడలింగ్‌ను ప్రేమిస్తూనే..తన ఇంట్లో చారిటబుల్ క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అన్జు మోడీ, తరుణ్ తహిలియానీ, గౌరవ్ గుప్తా, టొరాణి, నికోబార్, జేపోర్, అష్దీన్ల వద్ద అందాల మోడల్‌గా రాణిస్తూ ఎంతో మంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది. -
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గీతాబోధ
తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్. కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్.. ఢిల్లీలోని స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ చదివింది. కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్ కేఎస్ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్ (అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్లు రూపొందించేది. ఇథోస్ అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘ఇథోస్’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్ సెమినార్లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్. 2018లో ఇథోస్.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్‌లో ఆన్లైన్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది. ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది. చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు. -
అలకు ఎదురు‘గీత’
నర్సు గీత గురించి వింటే ఒకటే అనిపిస్తుంది. రిటైర్మెంట్ అనేది ఎవరో ఇచ్చేస్తే పూలదండతో పాటు ఇంటికి తెచ్చేసుకునేది కాదని. గీత వయసు ప్రస్తుతం 66 ఏళ్లు. సర్వీస్ రూల్స్ ఆమెను రిటైర్ చేశాయి తప్పితే, సర్వీస్ చేయాలనే ఆమె తపనను ‘రిటైర్మెంట్ మోడ్’ లోకి నెట్టేయలేకపోయాయి. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో గీత చిన్నా చితక సేవల్ని అందించడం కాదు, లోకల్ యూత్ ని కలుపుకుని ఆపదలో ఉన్నవారి కోసం ఏకంగా పరుగులే పెడుతోంది. మైసూర్ లో ఇప్పుడు ‘అల’కు ఎదురీదుతున్న గీత.. ఆమె! మైసూరుకు, చామరాజనగర్‌కు మధ్య పెద్ద దూరం ఉండదు. అరవై కి.మీ. దూరం. లేదా గంటన్నర ప్రయాణం. అయితే ఈ సెకండ్ వేవ్‌లో అది క్షణాలతో సహా లెక్కించవలసిన అత్యవసర దూరం అయింది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగల్లు, హనూర్ తాలూకాల గ్రామాల్లో ఎంతోమంది కోవిడ్ బాధితులు మైసూర్ నుంచి వచ్చే ఆక్సిజన్ సిలెండర్ల కోసం, వైద్యసేవల కోసం ఎదురు చూస్తుండటం వల్ల ఇటీవల ఏర్పడిన అత్యవసర స్థితి. ఈ స్థితిలో గీత అనే రిటైర్డ్ నర్సు తన విశ్రాంత జీవితానికి స్వస్తి చెప్పి, విధులకు పునరంకితం అయిన విధంగా లేచి, గత రెండు నెలలుగా బాధితులకు అవసరమైన సిలెండర్లను, వైద్యసేవలను తనే స్వయంగా అందించి వస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ‘భయపడాల్సిందేమీ లేదు’ అని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గీతకు తెలిసిన వాళ్లిద్దరు ఇటీవల ఆక్సిజన్ అందుబాటులో లేక మరణించడం ఆమెను కదలించింది. ఆ కదలికే ఆమెను ఈ మార్గంలోకి రప్పించింది. ‘రిటైర్ అయి ఇంట్లో ఉంటే మాత్రం! నేనేమీ చేయలేనా..’ అని అనుకుంటున్న సమయంలో ‘స్వామీ వివేకానంద యూత్ మూవ్మెంట్’ (ఎస్వీవైఎం) గురించి ఆమెకు తెలిసింది. ఆ టీమ్ ఆక్సిజన్ అవసరం అయిన పేషెంట్ల వివరాలు తెలుసుకుని వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను సమకూర్చుతోంది. వెళ్లి వెంటనే వారిని కలిశారు గీత. నర్సుగా ఎమర్జెన్సీ సేవల్ని అందించడంలో తనకున్న అనుభవం గురించి వారికి చెప్పారు. ‘‘నేనూ మీతో కలిసి పని చేస్తాను’’ అన్నారు. ‘‘మీరు మాతో కలిసి పని చేయడం కాదు, మేమే మీతో కలిసి పనిచేస్తాం మేడమ్’’ అన్నారు వారు! అన్నమాట ప్రకారమే పేషెంట్ల సమాచారాన్ని వారు తెచ్చేవారు. వారికి ఏర్పరచవలసిన సదుపాయాలేమిటో గీత సూచించేవారు. మందులు, ఆహారం ఇవ్వడం వరకు మాత్రమే గీత అండ్ టీమ్ పరిమితం కాలేదు. గీత స్వయంగా పేషెంట్లను కలుసుకుని వారికి సేవలు చేసేవారు. ఆమె సేవాభావాన్ని, నిర్వహణ బలాన్ని గమనించిన ఎస్వీవైఎం మైసూరులోని ఆమె ఇంట్లోనే ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్యాంక్‌ను నెలకొల్పింది! ఇంటి నుంచి గీతే ఇప్పుడు వాటిని బట్వాడా చేస్తున్నారు. ‘‘కరోనా పేషెంట్లకు అంత సమీపంగా వెళ్లి సేవ చేస్తున్నారు.. మీకేమీ భయంగా ఉండదా?’’ అని ఆమెను అడిగితే.. ‘‘అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే ఉన్నాను’’ అని నవ్వుతూ చెప్తారు. గీత ఇంట్లో ఆమెతో పాటు 96 ఏళ్ల ఆమె తల్లి కూడా ఉంటారు. ఆమెను సంరక్షించుకుంటూనే, ఎంతోమందికి తల్లిలా తను సేవలు అందిస్తున్నారు. -
గుండె లోతుల్లోంచి రావాలి!
ఒక రాజుగారు ప్రతిరోజూ ఒక పండితుడి వద్ద భగవద్గీత వినేవాడు. రాజుగారి వద్ద సెలవు తీసుకునే ముందు పండితుడు రాజుగారిని ‘‘రాజా! నేను చెప్పింది మీకు అర్థమయిందా?’’ అని అడిగేవాడు. రాజుగారు దానికి సమాధానం చెప్పకుండా, ‘‘అయ్యా! ముందు మీరు అర్థం చేసుకుని, తర్వాత నాకు చెప్పండి’’ అనేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. పండితుడు ఎంతో శ్రమపడి, గీతలోని శ్లోకాలను శ్రావ్యంగా గానం చేస్తూ, వీలయినంత తేలిక భాషలో రాజుగారికి తాత్పర్యం చెప్పేవాడు. కానీ, రాజుగారు మాత్రం షరా మామూలుగా ‘‘ముందు మీరు అర్థం చేసుకుని, తర్వాత నాకు చెప్పండి’’ అనేవాడు. ప్రతిరోజూ ఇంటికి తిరిగివచ్చి, పండితుడు రాజుగారి మాటలకు అంతరార్థమేమిటి? అని ఆలోచించేవాడు. ఆ పండితుడు మంచి భక్తుడు. జపధ్యానాలతో కాలం గడిపే భక్తి పరాయణుడు. లోతుగా ఆలోచించిన కొద్దీ, క్రమంగా అతడికి రాజుగారి మాటలలోని ఆంతర్యం అర్థమైంది. ఈ ప్రపంచంలో నిత్యము, శాశ్వతమూ అయినది భగవంతుడొక్కడే అని, మిగిలినదంతా అనిత్యమూ, నశ్వరమూ అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. దాంతో సంసారంపై విరక్తి వచ్చి, సన్యాసం స్వీకరించాడు. ఇల్లు వదిలి వెళ్లిపోయే ముందు రాజుగారికి కబురు పంపాడు, ‘‘రాజా! నాకిప్పుడు అర్థమైంది’’ అని. ఈ కథను రామకృష్ణులవారు తన శిష్యులకు చెబుతూ, ‘‘పాండిత్యం వల్ల మీరు అర్థం చేసుకోవలసిందీ, ఆ పాండిత్యం వల్ల మీరు సాధించగలిగిన ప్రయోజనమూ ఏమిటంటే– వివేకం, వైరాగ్యం. ఆ రెండు గుణాలూ లేని పాండిత్యం మీకు వ్యర్థం’’ అని బోధించేవారు. చాలామంది తాము భగవద్గీతను నిత్యం పారాయణం చేస్తామని, అందులోని శ్లోకాలను అద్భుతంగా గానం చేస్తామని, భగవద్గీత గురించి యువతలో ప్రచారం చేస్తున్నామనీ గొప్పగా చెప్పుకుంటారు. అంతేకానీ, ఆచరణలో మాత్రం శూన్యం. నిజంగా గీతాబోధ చేసేవారయితే, చిత్తశుద్థితో గీతాగానం చేసేవారయితే వారికి గీతలో కృష్ణుడు చెప్పిన – ‘ఫలితం నాకు వదిలెయ్యి... కర్మ మాత్రం నువ్వు చెయ్యి’ అనేది ఒంటబట్టి ఉండేది. పేరుకోసం, ప్రచారం కోసం పాకులాడి ఉండేవారు కారు. ఆత్మస్తుతి, పర నింద చే సే వారి నైజంలో మార్పు వచ్చి ఉండేది. -
మానవత్వం మరిచిన మహిళ
తొమ్మిదేళ్ల బాలికపై కిరాతకం ఇంట్లో చాకిరీ చేయించుకొని కర్రతో దాడి మల్కాపురం: బాలికతో ఇంటి పని చేయించింది ఓ మహిళ. అంతటితో ఆ గక ఆ చిన్నారిపై విరుచుకుపడి కర్రతో గాయపరి చింది. బాలిక బాధ చూడలేక స్థానికులు కలుగచేసుకోవడంతో వ్యవహారం పోలీసుల వరకు వె ళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రాని కి చెందిన నేవీ ఉద్యోగి మనోజ్‌కుమార్, అంజలి దంపతులు తమ రెండేళ్ల పాపతో మల్కాపురం సమీపాన ఇందిరాకాలనీలో నివాసముంటున్నా రు. మనోజ్ ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు తరచు క్యాంప్‌లు వెళ్తుంటాడు. అంజలి తన పాపను చూసుకునేందుకు, ఇంటి పని కోసం ఏడాది క్రితం గీత అనే తొమ్మిదేళ్ల బాలికను బీహార్ నుంచి తీసుకువచ్చిందని తెలిసింది. శుక్రవా రం గీత సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంజలి పలుమా ర్లు కర్రతో కొట్టి, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయపరిచినట్టు స్థానికులు తెలి పారు. పాప కేకలు వెయ్యడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. గాయాలతో ఉన్న గీతను ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించి, పోలీ సులు అంజలిని ప్రశ్నించగా.. ఆ పాపకు గాయాలెలా అయ్యాయో తెలియద ని వాదించింది. అంజలి రోజూ పాపతో క్రూరంగా వ్యవహరిస్తోందని, గతం లో ఇదే మాదిరిగా ఓ చిన్నారిని పనికి తీసుకువచ్చి దాడి చేసిందని స్థానికులు చెప్పారు. ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల పిల్లను ఇంట్లో పనికి పెట్టుకోవడం తప్పు కదా అని ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసులతో అంజలి దురుసుగా ప్రవర్తిం చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ రంగనాథ్ కేసు నమోదు చేశారు. -
సేవారధులు
నిరుపేదలకు అండగా ఉండాలని, వారి పిల్లల చదువులకు ఊతం అవ్వాలని తపిస్తున్న చిత్తా థామస్ రెడ్డి స్వస్థలం కడప జిల్లాలోని పోరుమామిళ్లపల్లి. థామస్‌రెడ్డి భార్య గీత. ఆమె పుట్టి పెరిగిన ఊరు అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఏటిపల్లి. ఈ ఇద్దరి గమ్యం సేవామార్గమే! అవసరార్థులకు సేవ చేయడమంటే ఆ దైవానికి సేవ చేయడమే అనే భావాలు ఇద్దరినీ కలిపాయి. పల్లెల్లో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడి చదువులు ఎలా ఉంటాయో, అర్ధంతరంగా పిల్లల చదువులు ఎందుకు ఆగిపోతాయో వారికి తెలుసు. అందుకే వీలైనంత మందికి విద్యాదానం చేయాలని శ్రమిస్తున్నారు. తమ గ్రామంలో అనారోగ్యంతో మగ్గిపోతున్న ఒంటరి చిన్నారిని చేరదీసి, తనకు తెలిసిన వైద్య సేవలు చేసిన గీతకు అక్కడ ప్రజల బాధలేంటో పన్నెండేళ్ల వయసులోనే అర్థమయ్యాయి. అందుకే పట్టుబట్టి డాక్టర్ అయ్యారు గీత. అలా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు అందించడం, పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, బాలబాలికలకు ఆరోగ్య అవగాహన కలిగించడం తమ బాధ్యతగా భావించారు ఈ దంపతులు. వీరిద్దరి తపన, ఆరాటాలకు ప్రతిరూపమే పన్నెండేళ్ల క్రితం రూపుదిద్దుకున్న ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్’. చేయూత కోసం అమెరికాలో... ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో తొలుత అక్కల రెడ్డి పల్లెలో చిత్తా శౌరిరెడ్డి స్మారక పాఠశాలను స్థాపించారు. 200 మందికి ఉచిత విద్య, వసతి కల్పించేటట్టుగా నిధులను పరిపుష్టం చేయడానికి ఈ దంపతులు ఎందరి సహకారాన్నో అర్థించారు. ఆ క్రమంలోనే అమెరికాలోని మిత్రులు కొందరు మేమున్నామంటూ ముందుకొచ్చారు. కొందరు వ్యక్తిగతంగా విద్యార్థులను దత్తత (స్పాన్సర్) తీసుకుంటామన్నారు. అప్పుడొచ్చింది వీరికో అద్భుతమైన ఆలోచన. ‘‘అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఎందరో మన దేశంలో నిరుపేదల కష్టాలకు తమ వంతు సేవలు అందించాలనుకున్నా, వారికి సరైన మార్గం దొరకడం లేదు. అలాంటి వారికీ ఇక్కడి అవసరార్థులకూ మధ్య వంతెనగా మారితే బావుంటుందని భావించాం’’అని గీత చెప్పారు. పదేళ్ల క్రితం ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ వీరు అమెరికా చేరారు. చికాగోలో కార్యాలయాన్ని స్థాపించారు. స్వదేశంలో ఉన్న నిరుపేద, అనాథ విద్యార్థులను గుర్తించడం, వారి వివరాలను దాతలకు అందజేయడం, ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వారి సాయాన్ని భద్రంగా అవసరార్థులకు చేరేవేయడం.. ఇలా పారదర్శకంగా ఉంటుంది వీరి ఆచరణ. వీరి ప్రచారానికి ప్రభావితులైన వారి దయార్థ్ర హృదయం ఫలితంగా స్వదేశంలో ఈ దంపతుల సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరించాయి. పోరుమామిళ్లపల్లిలోని ఉచిత పాఠశాల విద్యార్థుల సంఖ్యను 400కి చేర్చడంతో పాటు నంద్యాలలోని నవజీవన్ మూగ పాఠశాలలోని 100మంది, మైదుకూరు వికలాంగ్ పాఠశాలలో 50 మంది.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ దంపతుల చేయూతను అందుకుంటున్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 2 వేలకు చేరుకుంది. ఒక్కో విద్యార్థి అవసరాన్ని బట్టి ఏడాదికి కనీసం రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు విద్యా సంబంధ ఖర్చులను వీరు దాతల ద్వారా సమకూరుస్తున్నారు. పుట్టిన గడ్డకు సేవలు... డాక్టర్ థామస్‌రెడ్డి దంపతులు స్టూడెంట్స్ స్పాన్సర్షిప్ ప్రోగ్రాంతో పాటు ఏటేటా డిసెంబరులో పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు, బి.మఠం మండలాల్లోని పేద అనాథ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. వృద్ధులకు నీడనివ్వాలనే ధ్యేయంతో ఆశ్రమం నెలకొల్పారు. మహిళలకు, వికలాంగులకు వృత్తి విద్యా కోర్సులు నేర్పించి బాసటగా నిలుస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో హుదూద్ తుపాన్ బాధితులను చేయూతనందించారు. వైద్యురాలైన గీత తరచుగా మురికివాడల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పల్లెటూరి యువతులు, మహిళల ఆరోగ్యం కోసం మొబైల్ క్లినిక్‌ను సైతం నడుపుతున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని సనత్‌నగర్, జెడ్ కాలనీలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘‘మన దేశానికి చెందిన దాతలకు - పేదలకు మధ్య వారధిగా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని’’ వివరించారు ఈ దంపతులు. ఇన్ని సేవాకార్యక్రమాలు చేస్తున్నారు మీ పిల్లల గురించి చెప్పండి.. అని అడిగితే- ‘‘మాకు రెండు వేల మంది పిల్లలు.. వారి సంఖ్య ముందు ముందు ఇంకా పెరగవచ్చు. వారిందరినీ చదివించి, జీవితంలో స్థిరపడేలా చేయాలన్నదే మా లక్ష్యం’’ అంటూ చెదరని చిరునవ్వుతో తెలిపారు గీతా యెరువా, చిత్తా థామస్ రెడ్డి దంపతులు. విదేశాలలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకొని, అనుకున్నది సాధించాక పుట్టిపెరిగిన నేలను ఏదైనా చేయాలనుకునేవారికి ఈ దంపతుల సేవాపథం తప్పక స్ఫూర్తినిస్తుంది. ఎన్ఆర్ఐలుగా ఉన్న థామస్‌రెడ్డి, గీత దంపతులు గ్రహణమొర్రి ఉన్న పేద పిల్లలకు ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు కర్నూలు జిల్లా నంద్యాలలో అమెరికా వైద్య బృందం చేత ఉచిత ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.