ఒక రాజుగారు ప్రతిరోజూ ఒక పండితుడి వద్ద భగవద్గీత వినేవాడు. రాజుగారి వద్ద సెలవు తీసుకునే ముందు పండితుడు రాజుగారిని ‘‘రాజా! నేను చెప్పింది మీకు అర్థమయిందా?’’ అని అడిగేవాడు. రాజుగారు దానికి సమాధానం చెప్పకుండా, ‘‘అయ్యా! ముందు మీరు అర్థం చేసుకుని, తర్వాత నాకు చెప్పండి’’ అనేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. పండితుడు ఎంతో శ్రమపడి, గీతలోని శ్లోకాలను శ్రావ్యంగా గానం చేస్తూ, వీలయినంత తేలిక భాషలో రాజుగారికి తాత్పర్యం చెప్పేవాడు. కానీ, రాజుగారు మాత్రం షరా మామూలుగా ‘‘ముందు మీరు అర్థం చేసుకుని, తర్వాత నాకు చెప్పండి’’ అనేవాడు.
ప్రతిరోజూ ఇంటికి తిరిగివచ్చి, పండితుడు రాజుగారి మాటలకు అంతరార్థమేమిటి? అని ఆలోచించేవాడు. ఆ పండితుడు మంచి భక్తుడు. జపధ్యానాలతో కాలం గడిపే భక్తి పరాయణుడు. లోతుగా ఆలోచించిన కొద్దీ, క్రమంగా అతడికి రాజుగారి మాటలలోని ఆంతర్యం అర్థమైంది. ఈ ప్రపంచంలో నిత్యము, శాశ్వతమూ అయినది భగవంతుడొక్కడే అని, మిగిలినదంతా అనిత్యమూ, నశ్వరమూ అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. దాంతో సంసారంపై విరక్తి వచ్చి, సన్యాసం స్వీకరించాడు. ఇల్లు వదిలి వెళ్లిపోయే ముందు రాజుగారికి కబురు పంపాడు, ‘‘రాజా! నాకిప్పుడు అర్థమైంది’’ అని.
ఈ కథను రామకృష్ణులవారు తన శిష్యులకు చెబుతూ, ‘‘పాండిత్యం వల్ల మీరు అర్థం చేసుకోవలసిందీ, ఆ పాండిత్యం వల్ల మీరు సాధించగలిగిన ప్రయోజనమూ ఏమిటంటే– వివేకం, వైరాగ్యం. ఆ రెండు గుణాలూ లేని పాండిత్యం మీకు వ్యర్థం’’ అని బోధించేవారు. చాలామంది తాము భగవద్గీతను నిత్యం పారాయణం చేస్తామని, అందులోని శ్లోకాలను అద్భుతంగా గానం చేస్తామని, భగవద్గీత గురించి యువతలో ప్రచారం చేస్తున్నామనీ గొప్పగా చెప్పుకుంటారు. అంతేకానీ, ఆచరణలో మాత్రం శూన్యం. నిజంగా గీతాబోధ చేసేవారయితే, చిత్తశుద్థితో గీతాగానం చేసేవారయితే వారికి గీతలో కృష్ణుడు చెప్పిన – ‘ఫలితం నాకు వదిలెయ్యి... కర్మ మాత్రం నువ్వు చెయ్యి’ అనేది ఒంటబట్టి ఉండేది. పేరుకోసం, ప్రచారం కోసం పాకులాడి ఉండేవారు కారు. ఆత్మస్తుతి, పర నింద చే సే వారి నైజంలో మార్పు వచ్చి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment