లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గీతా ప్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశలు కురిపించారు. గీతా ప్రెస్ దేవాలయం కంటే తక్కువేం కాదని అన్నారు. ఈ మేరకు గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. ప్రతిపక్షాల చర్యలను ఎండగట్టారు. గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన విషయం తెలిసిందే.
'కొన్నిసార్లు సన్యాసులు దారి చూపిస్తారు. మరికొన్ని సార్లు గీతా ప్రెస్ లాంటి సంస్థలు మార్గం చూపిస్తాయి' అని మోదీ చెప్పారు. గీతా ప్రెస్ మానవత్వానికి దారి చూపిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీకి గీతా ప్రెస్‌తో మంచి సంబంధం ఉందని గుర్తు చేశారు. గాంధీ నెలవారీ మ్యాగజీన్ 'కల్యాన్'ను ఈ సంస్థకే కేటాయించారని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఆ మ్యాగజీన్‌ను ప్రకటనలు లేకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు.
గీతా ప్రెస్‌కు మహాత్మాగాంధీ శాంతి బహుమతిని కేటాయిస్తూ కొన్నిరోజుల క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ పార్టీ భావాజాలానికి చెందిన సంస్థకే కేటాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గీతా ప్రెస్ ఆ బహుమతికి చెందిన ప్రైజ్ మనీ కోటి రూపాయలను నిరాకరించింది. అనంతరం ప్రధాని మోదీ గీతా ప్రెస్‌పై మాట్లాడింది ఇదే తొలిసారి.
గీతా ప్రెస్ ఎంతో మంచి పుస్తకాలను ముద్రిస్తుందని ప్రధాని తెలిపారు. ఎక్కడ గీత ఉంటుందో అక్కడ సాక్షాత్తు కృష్ణుడు ఉంటాడని అన్నారు. గీతా ప్రెస్ దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశ జ్ఞాన సంపదను పెంచుతోందని కొనియాడారు. 'ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్' విధానాన‍్ని గీతా ప్రెస్ ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.
ఇదీ చదవండి: 'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment