సేవారధులు
నిరుపేదలకు అండగా ఉండాలని, వారి పిల్లల చదువులకు ఊతం అవ్వాలని తపిస్తున్న చిత్తా థామస్ రెడ్డి స్వస్థలం కడప జిల్లాలోని పోరుమామిళ్లపల్లి. థామస్‌రెడ్డి భార్య గీత. ఆమె పుట్టి పెరిగిన ఊరు అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఏటిపల్లి. ఈ ఇద్దరి గమ్యం సేవామార్గమే! అవసరార్థులకు సేవ చేయడమంటే ఆ దైవానికి సేవ చేయడమే అనే భావాలు ఇద్దరినీ కలిపాయి. పల్లెల్లో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడి చదువులు ఎలా ఉంటాయో, అర్ధంతరంగా పిల్లల చదువులు ఎందుకు ఆగిపోతాయో వారికి తెలుసు. అందుకే వీలైనంత మందికి విద్యాదానం చేయాలని శ్రమిస్తున్నారు.
తమ గ్రామంలో అనారోగ్యంతో మగ్గిపోతున్న ఒంటరి చిన్నారిని చేరదీసి, తనకు తెలిసిన వైద్య సేవలు చేసిన గీతకు అక్కడ ప్రజల బాధలేంటో పన్నెండేళ్ల వయసులోనే అర్థమయ్యాయి. అందుకే పట్టుబట్టి డాక్టర్ అయ్యారు గీత. అలా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు అందించడం, పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, బాలబాలికలకు ఆరోగ్య అవగాహన కలిగించడం తమ బాధ్యతగా భావించారు ఈ దంపతులు. వీరిద్దరి తపన, ఆరాటాలకు ప్రతిరూపమే పన్నెండేళ్ల క్రితం రూపుదిద్దుకున్న ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్’.
చేయూత కోసం అమెరికాలో...
ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో తొలుత అక్కల రెడ్డి పల్లెలో చిత్తా శౌరిరెడ్డి స్మారక పాఠశాలను స్థాపించారు. 200 మందికి ఉచిత విద్య, వసతి కల్పించేటట్టుగా నిధులను పరిపుష్టం చేయడానికి ఈ దంపతులు ఎందరి సహకారాన్నో అర్థించారు. ఆ క్రమంలోనే అమెరికాలోని మిత్రులు కొందరు మేమున్నామంటూ ముందుకొచ్చారు. కొందరు వ్యక్తిగతంగా విద్యార్థులను దత్తత (స్పాన్సర్) తీసుకుంటామన్నారు. అప్పుడొచ్చింది వీరికో అద్భుతమైన ఆలోచన. ‘‘అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఎందరో మన దేశంలో నిరుపేదల కష్టాలకు తమ వంతు సేవలు అందించాలనుకున్నా, వారికి సరైన మార్గం దొరకడం లేదు. అలాంటి వారికీ ఇక్కడి అవసరార్థులకూ మధ్య వంతెనగా మారితే బావుంటుందని భావించాం’’అని గీత చెప్పారు. పదేళ్ల క్రితం ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ వీరు అమెరికా చేరారు. చికాగోలో కార్యాలయాన్ని స్థాపించారు. స్వదేశంలో ఉన్న నిరుపేద, అనాథ విద్యార్థులను గుర్తించడం, వారి వివరాలను దాతలకు అందజేయడం, ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వారి సాయాన్ని భద్రంగా అవసరార్థులకు చేరేవేయడం.. ఇలా పారదర్శకంగా ఉంటుంది వీరి ఆచరణ. వీరి ప్రచారానికి ప్రభావితులైన వారి దయార్థ్ర హృదయం ఫలితంగా స్వదేశంలో ఈ దంపతుల సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరించాయి. పోరుమామిళ్లపల్లిలోని ఉచిత పాఠశాల విద్యార్థుల సంఖ్యను 400కి చేర్చడంతో పాటు నంద్యాలలోని నవజీవన్ మూగ పాఠశాలలోని 100మంది, మైదుకూరు వికలాంగ్ పాఠశాలలో 50 మంది.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ దంపతుల చేయూతను అందుకుంటున్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 2 వేలకు చేరుకుంది. ఒక్కో విద్యార్థి అవసరాన్ని బట్టి ఏడాదికి కనీసం రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు విద్యా సంబంధ ఖర్చులను వీరు దాతల ద్వారా సమకూరుస్తున్నారు.
పుట్టిన గడ్డకు సేవలు...
డాక్టర్ థామస్‌రెడ్డి దంపతులు స్టూడెంట్స్ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాంతో పాటు ఏటేటా డిసెంబరులో పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు, బి.మఠం మండలాల్లోని పేద అనాథ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నారు. వృద్ధులకు నీడనివ్వాలనే ధ్యేయంతో ఆశ్రమం నెలకొల్పారు. మహిళలకు, వికలాంగులకు వృత్తి విద్యా కోర్సులు నేర్పించి బాసటగా నిలుస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో హుదూద్ తుపాన్ బాధితులను చేయూతనందించారు. వైద్యురాలైన గీత తరచుగా మురికివాడల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పల్లెటూరి యువతులు, మహిళల ఆరోగ్యం కోసం మొబైల్ క్లినిక్‌ను సైతం నడుపుతున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని సనత్‌నగర్, జెడ్ కాలనీలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘‘మన దేశానికి చెందిన దాతలకు - పేదలకు మధ్య వారధిగా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని’’ వివరించారు ఈ దంపతులు.
ఇన్ని సేవాకార్యక్రమాలు చేస్తున్నారు మీ పిల్లల గురించి చెప్పండి.. అని అడిగితే- ‘‘మాకు రెండు వేల మంది పిల్లలు.. వారి సంఖ్య ముందు ముందు ఇంకా పెరగవచ్చు. వారిందరినీ చదివించి, జీవితంలో స్థిరపడేలా చేయాలన్నదే మా లక్ష్యం’’ అంటూ చెదరని చిరునవ్వుతో తెలిపారు గీతా యెరువా, చిత్తా థామస్ రెడ్డి దంపతులు. విదేశాలలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకొని, అనుకున్నది సాధించాక పుట్టిపెరిగిన నేలను ఏదైనా చేయాలనుకునేవారికి ఈ దంపతుల సేవాపథం తప్పక స్ఫూర్తినిస్తుంది.
ఎన్‌ఆర్‌ఐలుగా ఉన్న థామస్‌రెడ్డి, గీత దంపతులు గ్రహణమొర్రి ఉన్న పేద పిల్లలకు ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు కర్నూలు జిల్లా నంద్యాలలో అమెరికా వైద్య బృందం చేత ఉచిత ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.