Glamor roles
-
రీల్ లైఫ్‌లోనే అలా ఉంటా!
నటి తమన్నా పేరు వినగానే దర్శక నిర్మాతలకు ముందు గుర్తుకొచ్చేది గ్లామరేనట. మొదట వేరే నటిని అనుకుని ఆ తరువాత నటి తమన్నాను ఆ పాత్రకు ఎంపిక చేస్తే ఆమెను దృష్టిలో పెట్టుకుని అదనంగా కొన్ని గ్లామర్ సన్నివేశాలను చిత్రంలో చేర్చుతున్నారట. ఈ విషయాన్ని తమన్నా తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోతున్నారట. ఇటీవల దర్శకుడు సురాజ్ హీరోయిన్లకు కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చేది అందాలారబోత కోసమేనని నటి తమన్నాను దృష్టిలో పెట్టుకునే అన్నారన్నది గమనార్హం. ఇమాజినేషన్ పేరుతో దర్శక నిర్మాతలు తమన్నాను పాటల్లో కురచ దుస్తుల్లో చూపించడానికి మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తుంటారు. ఆమె కూడా అలాంటి పాత్రలకు న్యాయం చేయడానికి ఏమాత్రం సంకోచించరంటున్నారు సినీ వర్గాలు. తమన్నా కథానాయకి అయితే ఆ చిత్రంలో గ్లామర్‌కు కొరత ఉండదు అని యువత అనుకుంటున్నారంటే ఆమె ఎక్స్పోజింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాను రీల్ లైఫ్‌లోనే అలా గ్లామర్‌గా కనిపిస్తానని, రియల్ లైఫ్‌లో సంసార పక్ష దుస్తులనే ధరిస్తానని తమన్నా అంటున్నారు. ఒక్కోసారి మోడరన్ దుస్తులు ధరించినా చూసేవాళ్లు గౌరవించే విధంగానే అవి ఉంటాయంటున్న తమన్నా సినిమాల్లోనే కురుచ దుస్తులతో తన ఇమేజ్‌కు భంగం కలిగేలా చేస్తున్నారని వాపోతున్నారట. అయితే బాహుబలి చిత్రంలో అందాలతోపాటు అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న తమన్నా భవిష్యత్తులోనైనా ఆ తరహా శక్తివంతమైన పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారట. అంతే కాదు తనకు ఇష్టమైన దర్శకులను వైవిధ్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి తన కోరికను ఆ దర్శకులు ఏపాటి నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు శింబుకు జంటగా అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలి–2 చిత్రం ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. -
అలాంటి సినిమాలు చేయను!
‘‘అందం, అభినయం.. నాకు రెండూ ముఖ్యమే. నటనలో రెండూ భాగమే. కథానాయికను కేవలం అందాల బొమ్మగా చూపించే చిత్రాలు, గ్లామర్ పాత్రలు చేయను’’ అని కథానాయిక సురభి స్పష్టం చేశారు. నాని, సురభి, నివేదా థామస్ నటీనటులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల సురభి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - ‘‘ నాని పక్కన నటిస్తే మన నటన మెరుగవుతుంది. అందుకే తనతో మరిన్ని చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా చిత్రీకరణలో నివేద, నేను మంచి స్నేహితులయ్యాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు. మరో కథానాయికతో కలసి తెరను పంచుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నాకు ఎటువంటి పాత్రలు సూటవుతాయో.. అవే ఎంపిక చేసుకుంటున్నాను. నా చిత్రాలన్నీ వరుసగా విజయం సాధించడం సంతోషంగా ఉంది. నటనతో పాటు నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో బొమ్మలు గీస్తుంటా. పెయింటింగ్‌లో కోర్స్ కూడా చేశాను’’ అన్నారు. -
గ్లామర్ లేని పాత్రలకు నో
గ్లామర్ లేని పాత్రలు చేయనని ఖరాఖండిగా చెబుతున్నారు నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్ నుంచి పూర్తిగా కోలీవుడ్‌పై దృష్టి సారిస్తున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. తెలుగులో ప్రస్తుతం ఒక చిత్రం కూడా లేదామెకు. అక్కడ చివరిగా నటించిన చిత్రం టెంపర్. విచిత్రం ఏమిటంటే ఆ చిత్రం హిట్ అయినా అమ్మడికి కొత్త అవకాశాలు రావడం లేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ ధనుష్‌తో మారి, విశాల్ సరసన పాయుంపులి, చిత్రాలతో పాటు మర్మమనిదన్ అనే చిత్రం కూడా చేస్తున్నారు. టాలీవుడ్లో సడన్‌గా మార్కెట్ పడి పోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కాజల్ బదులిస్తూ అక్కడ అవకాశాలు తగ్గితే ఏమి ఇక్కడ బిజీగానే వున్నాగా అని బదులిచ్చారు. తెలుగులో కొన్ని చిత్రాల్లో నెగిటివ్ పాత్ర నటించాలని అడిగారని చెప్పారు. తాను ప్రతి నాయకి పాత్రల్లో ఎప్పటికీ నటించరాదని నిర్ణయించుకున్నానన్నారు. అదే విధంగా గ్లామర్ తగిన పాత్రలో చేయదలచుకోలేదన్నారు. ఎందుకంటే అభిమానులు తన నుంచి గ్లామర్ పాత్రలనే కోరుకుంటున్నారని అన్నారు. అలాంటప్పుడు తానెందుకు గ్లామర్ లేని పాత్రలు చేయాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు కాజల్ అగర్వాల్. -
మూడో హీరోయిన్ అయితేనేం?
అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని మనం కావాలనుకున్నప్పుడు అవి రావు. నటి పార్వతీమీనన్ వ్యవహారమే ఇందుకు ఒక ఉదాహరణ. ఈ మలయాళ కుట్టి పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య పర్వాలేదనిపించుకుంది. పార్వతిమీనన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇంకేముంది పార్వతికి మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి. అయితే ఆ సమయంలో ఈ కేరళకుట్టి గ్లామర్ పాత్రలు చేయను.. ఈత దుస్తులు ధరించను.. అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చొంటా.. అంటూ తెగ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఆ అవకాశాలన్నీ తిరుగుముఖం పట్టాయి. చాన్నాళ్ల తరువాత ఆ మధ్య ధనుష్ సరసన మరియాన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. పార్వతిమీనన్తో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. మడికట్టుకు కూర్చొంటే లాభం లేదనుకుందో ఏమో! సొంతంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని అందాలారబోస్తూ ఫొటోలు తీసుకుని వెబ్సైట్ తదితర ఇతర ప్రసార సాధనాల్లో ప్రచారం చేసుకుంది. కొంతవరకు సక్సెస్ అయ్యింది కూడా. నటుడు కమలహాసన్ చిత్రం ఉత్తమవిలన్ చిత్రంలోను, అజిత్ హీరోగా నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్రంలోను నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఉత్తమ విలన్ చిత్రంలో కమలహాసన్ సరసన పూజాకుమార్, ఆండ్రియాలు నటిస్తునారు. అదే విధంగా ఎన్నై అరిందాల్‌లో అజిత్‌కు జంటగా అనుష్క, త్రిషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ పార్వతి మీనన్ మూడో హీరోయిన్ పాత్రకే పరిమితమైంది. అయితే కమలహాసన్ అజిత్ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో మూడో హీరోయిన్గా నటించే అవకాశం రావడం ఆనందమే నంటోంది పార్వతి మీనన్.