ఇచ్చుకో.. కోరుకో
- ఉద్యోగుల బదిలీలలో అధికారపార్టీ నేతల పెత్తనం
- జీఓ నెం.175 విడుదల చేసిన ప్రభుత్వం
- కలవరపడుతున్న ఉద్యోగ వర్గాలు
సాక్షి ప్రతినిధి, కడప: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు అడుగులేస్తున్నారు. ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్‌కు మంగళం పలికారు. కోరుకున్నవారికి కోరుకున్నచోట పోస్టింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తెలుగుతమ్ముళ్లు ఇందుకోసం పథక రచన చేస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్‌లో పారదర్శకతకు తిలోదకాలు ఇవ్వనున్నారు. వెరసి జీఓ నెంబర్ 175 తెలుగుదేశం పార్టీకి ఉపాధి పథకంగా మారనుంది. ప్రభుత్వాలు మారినా నియామకాలు, బదిలీలల్లో పారదర్శకతకు భంగం ఏర్పడేది కాదు. నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీల కోసం ఉన్నతాధికారులు కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు.
అలా జరగాల్సి ఉండగా జీఓ నెంబర్ 175 విడుదల చేశారు. ఆ మేరకు సీనియారిటి ప్రాతిపదికన కాకుండా ఎగ్జిక్యూటివ్ పర్సన్‌కు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు. ఇదివరకు రెండేళ్లు పూర్తి చేసుకున్న అధికారులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి స్థానాలను క్లియర్ వేకెన్సీగా చూపించేవారు. ఈ విధంగా ఉన్న నిబంధనలను తిరగరాస్తూ జీఓ నెంబర్ 175ను ఈనెల 19వతేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ వ్యవహారాలను నిర్వహించే అధికారులకు సీనియారిటీ ప్రకారం కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నియామకాలు చే పట్టే వెసులుబాటును కల్పించారు. ఆ జీఓ
ఆధారంగా ఎవరిని ఏసమయంలోనైనా బదిలీ చేయించే అవకాశం కల్పించారు.
బహిరంగ విక్రయాలకు ఆస్కారం....
అధికారులు కోరిన పోస్టింగ్ అప్పగిస్తే నజరానా అందించే అలవాటు ఇప్పటికే జిల్లాలో ఉంది. ఇప్పటి వరకూ అది శృతిమించకుండా కౌన్సెలింగ్‌కు లోబడి ఉండేది. పోలీసుశాఖలో మాత్రమే సర్కిల్ స్థాయిని బట్టి పోస్టింగ్ కోసం రాజకీయ నేతలకు ముడుపులు అందించేవారు. ఆ సంస్కృతిని ఇప్పడు అన్ని శాఖల్లోకి ప్రవేశ పెట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. 175 జీఓ కారణంగా ఎవరిని ఎప్పుడైనా కదిలించవ్చని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. జీఓ వెలువడిందే తరువాయి కొందరు ఉద్యోగులు రాజకీయ నేతల చుట్టూ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.
అధికార పార్టీకి చెందిన ఇరువురు నాయకులను ఆశ్రయించి వారి స్థానాలను రిజర్వ్ చేయించుకుంటున్నట్లు సమాచారం. జీఓ 175 ఆధారంగా సెప్టెంబర్ 30లోపు బదిలీల పక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఆమేరకు టీచర్లు మినహా ఎగ్జిక్యూటివ్ అధికారులు అధికార పార్టీ నేతలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జీఓ 175 తెలుగుదేశం పార్టీ నేతలకు ఉపాధి పథకంలా ఉందని పలువురు భావిస్తున్నారు.