రక్షిస్తారా.. శిక్షిస్తారా..
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రచందనం దుంగలు మాయమైన వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముద్దనూరు అటవీశాఖ రేంజ్ కార్యాలయ పరిధిలో సుమారు 140 ఎర్రచందనం దుంగలు మాయమైన విషయం తెలిసిందే. అయితే కార్యాలయంలో పని చేసే సిబ్బందే కనిపించకుండా పోయిన దుంగల స్థానంలో వేరే దుంగలను ఉంచారు. అంతకు ముందు దుంగలు పోయిన సంఘటనపై అధికారులు విచారణ జరుపగా సుమారు 140 దుంగలు కనిపించలేదని తేలింది.
దీంతో ఆగమేఘాల మీద సిబ్బంది కనిపించకుండా పోయిన దుంగల స్థానంలో మరో చోట నుంచి తెచ్చి గోడౌన్లో గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. అంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకున్నారు. అయితే ముద్దనూరులో ఉన్న ఎర్రచందనాన్ని ప్రొద్దుటూరు గోడౌన్‌కు తరలించే క్రమంలో కొలతల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ప్రొద్దుటూరు డీఎఫ్ఓ ఎఫ్ఆర్ఓను నియమించారు. ఆ అధికారి దుంగల కొలతలను పరిశీలించారు. రెండు రోజుల క్రితమే అధికారి పూర్తి స్థాయిలో కొలతలు, తూకం వేసి డీఎఫ్‌ఓకు నివేదిక ఇచ్చారు.
దుంగలు ఉన్నాయి.. కొలతల్లో భారీ తేడా
ప్రొద్దుటూరు గోడౌన్లో ఉన్న ముద్దనూరుకు సంబంధించిన చందనం దుంగులన్నీ ఉన్నప్పటికీ వాటి కొలతల్లో భారీ తేడా ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అయితే గతంలో ఉన్న కొలతల కంటే ఎక్కువ ఉన్నాయని, తూకం విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. పోయిన దుంగల సంఖ్య అయితే సరిపోయింది కానీ.. అంతే తూకం, కొలతలు కలిగిన దుంగలను మాత్రం ఇంటి దొంగలు సమకూర్చలేక పోయారు.
నివేదికను పరిశీలించిన తర్వాత డీఎఫ్ఓ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దుంగలు మాయమైనట్లు దాదాపుగా నిర్ధారణ అయినట్లే. మరి ఉన్నతాధికారులు ఇంటి దొంగలను రక్షిస్తారా లేక వేటు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది తమకు ముప్పు రాకుండా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
ఇంటి దొంగల వింత వాదన..
అధికారి విచారణ చేసిన తర్వాత దుంగల కొలతల్లోనూ. తూకంలో వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. 140 దుంగల్లోనూ వ్యత్యాసం కనిపించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఉన్న వాటి కంటే కొలతలు, తూకం ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలడంతో ఇంటి దొంగలు వింతగా వాదిస్తున్నారు. కావలసిన దానికంటే తక్కువగా ఉంటే ఆలోచించాలి కానీ ఎక్కువగా ఉంటే అటవీశాఖకు మేలే కదా అని వాదిస్తున్నారు. ఇందులో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వారు అధికారులతో అన్నట్లు తెలిసింది.
ఇప్పుడే నివేదిక అందింది..
ముద్దనూరు అటవీ కార్యాలయ పరిధిలో ఉన్న ఎర్రచందనం దుంగలు మాయమైన వ్యవహారంలో విచారణ నివేదిక వచ్చిందని డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి అన్నారు. ఇంకా నివేదిక చూడలేదని, చూశాక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.