Gold bangles
-
కస్టమర్లా వచ్చి.. సిబ్బందితో మాట కలిపి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని తనిష్క్ జువెలర్స్‌లో చోరీ జరిగింది. కస్టమర్లా వచ్చిన ఓ మహిళ బంగారు గాజును తస్కరించింది. వివరాలివీ... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని తనిష్క్ జువెలర్స్‌లో ఈ నెల 9న గుర్తు తెలియని మహిళ వచ్చింది. తాను బంగారు గాజులు కొనాలనుకుంటున్నట్లు సిబ్బందికి చెప్పింది. దీంతో కొన్ని రకాల డిజైన్లను చూపించారు. వివిధ గాజులను పరిశీలించిన ఆ మహిళ తనకు మరికొన్ని డిజైన్లు చూపించాలని కోరింది. ఆయా గాజుల ధరలను అడుగుతూ సిబ్బందితో మాట కలిపి దృష్టి మరల్చి ఒక బంగారు గాజును తస్కరించింది. తర్వాత తనకు డిజైన్లు నచ్చలేదని చెప్పి బయటకు వెళ్లిపోయింది. మరుసటిరోజు సిబ్బంది ఆభరణాలను లెక్కించే సమయంలో 18 గ్రాముల బరువైన బంగారు గాజు తగ్గినట్లు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టగా గుర్తుతెలియని మహిళ చోరీ చేసినట్లు తేలింది. ఈ మేరకు శుక్రవారం తనిష్క్ ప్రతినిధి ప్రవీణ్‌కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. -
ప్రియాంకకు బంగారు గాజులు తొడిగిన సుబ్బరామిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, హాలీవుడ్‌లోనూ దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రాను రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డి సత్కరించారు. ఆయన వ్యక్తిగత ఫౌండేషన్ టీఎస్ఆర్ తరుపున ఆమెను సన్మానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. సాంస్కృతికకళారంగాల్లో రాణించేవారిని గుర్తించడం టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆనవాయితీగా వస్తోంది. ఈనేపథ్యంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రియాంక చోప్రాను మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక సత్కార కార్యక్రమంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి, ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్ ఆస్కిత్, శత్రఘ్న సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సత్కరించారు. ఎంపీ సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ ప్రియాంక ప్రపంచ నటి అన్నారు. ఆమె నటనను కొనియాడారు. -
ఫ్రీగా అంటూ.. నగలతో మాయం
కంభం (ప్రకాశం జిల్లా) : బంగారానికి ఉచితంగా మెరుగుపెడతామని చెప్పి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం కంభం మండలకేంద్రంలోని గాంధీ బజార్లో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఆభరణాలకు మెరుగు పెడుతామంటూ ఓ ఇంట్లోకి వెళ్లారు. వారి మాటలను నమ్మిన శ్వేత అనే మహిళ వారికి నాలుగు బంగారు గాజులను అప్పగించింది. దాహంగా ఉందని, మంచి నీళ్లు కావాలని వారు అడగటంతో ఆమె లోపలికి వెళ్లింది. తిరిగి నీళ్లు తెచ్చేసరికి ఇద్దరు దుండగులు బంగారు గాజులతో పరారయ్యారు. సుమారు 6 తులాల విలువైన గాజులను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.