Golden Book of World
-
Shelma Sahayam: రెండు ప్రపంచాల మధ్య...
రెండు ప్రపంచాల మధ్య సంచరించే షెల్మకు... మొదటి ప్రపంచంలో కనిపించే సాంకేతిక అద్భుతాలు అంటే ఎంత ఇష్టమో రెండో ప్రపంచంలో కనిపించే కాల్పనిక కథలు అంతే ఇష్టం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ షెల్మ సహాయం రాసిన పుస్తకం ‘ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా: జెనిసిస్’ గత నెల గోల్డెన్ బుక్ అవార్డ్(ఉరుగ్వే) గెలుచుకుంది. తాజాగా గ్లోబల్ పబ్లిషింగ్ హౌజ్, ఎక్స్సెల్లర్ ఎక్స్‌లెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా)కు ఎంపికైంది... చెన్నైలో... చిన్న వయసులోనే కలం పట్టింది షెల్మ. ప్రైమరీ స్కూల్లో గాంధీజీపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. షెల్మ ఈ పోటీలో పాల్గొంది. అయితే తనకు ఆ మహాత్ముడి గురించి పెద్దగా తెలియదు ‘రకరకాల ఆయుధాలు ఉపయోగించి, బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడారు’ అని రాసింది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఇబ్బందిగా ఉండడం మాట ఎలా ఉన్నా... ఆ వ్యాసరచనే తన తొలి రచన! అయితే ఆ తరువాత కాలంలో ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడంతోపాటు రచనలు చేయడంపై ఆసక్తి పెరిగింది. ‘నేను భవిష్యత్‌లో రచయిత్రిని కావాలనుకుంటున్నాను’ అని షెల్మ అన్నప్పుడు చాలాముంది ముఖం మీదే నవ్వారు. ‘ఇంజినీర్ కావాలనేది నా కల’ అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే. ఇలాంటి సమయాల్లో బాబీ ఆంటీ తనకు ఎంతో శక్తి ఇచ్చేది. షెల్మ దృష్టిలో తాను పవర్ఫుల్ ఉమెన్. ‘వారు నీ గురించి ఏం అనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. నీకు నీ మీద ఎంత నమ్మకం ఉందనేది ముఖ్యం’ అని చెప్పేది. ఆంటీ ఇచ్చిన ఆత్మవిశ్వాస బలంతో చిన్న చిన్న రచనలు చేసి ఇంట్లో వినిపించేది. తండ్రి మెర్సిలిన్బాబు, తల్లి మేరీ శాంతి, చెల్లెళ్లు స్నేహ, రీతూలు ప్రోత్సాహకంగా మాట్లాడేవారు. ‘నాకు డిప్రెషన్‌గా అనిపించినప్పుడు పేపర్, పెన్ను అందుకొని ఏదో ఒకటి రాస్తుంటాను. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్న షెల్మ ‘ఎస్ఎస్ మెర్సె’ కలం పేరుతో ‘ది ల్యాండ్ ఆఫ్ ఆటరాక్సియా: జెనిసిస్’ అనే తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల రాసింది. దీనికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. వీడియోగేమ్స్ ఇష్టపడే యువతరాన్ని కూడా ఈ నవల ఆకట్టుకుంది. తాను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ నవలకు బీజం పడింది. అయితే అక్షరాల్లో కాకుండా తన మనసులోనే రాసుకుంటూ వస్తోంది. ఎడిట్ చేసుకుంటూ వస్తుంది. తాను చిన్నప్పుడు విన్న ఎన్నో జానపదకథలు, చదివిన పుస్తకాలు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తప్పిపోయిన తమ ఫ్రెండ్ సినన్ను వెదుక్కుంటూ కెప్టెన్ మెగెలాన్ అతని బృందం చేసిన ప్రయాణమే ఈ నవల. కెప్టెన్ బృందం చివరికి ఒక మాంత్రిక ప్రపంచంలోకి వెళుతుంది. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది నవల సారాంశం. ‘ద ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా’ ఇచ్చిన ఉత్సాహంతో షెల్మ సహాయం మరిన్ని రచనలు చేయాలనుకుంటోంది. -
6 గంటల్లో 2,501 మందికి రక్తపరీక్షలు
ఖార్గాన్: మధ్యప్రదేశ్‌లోని భిఖాన్గాన్ నగరంలో ఓ స్వచ్ఛంద సంస్థ 6 గంటల్లోనే 2,501 మందికి రక్త పరీక్షలు నిర్వహించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదిం చింది. లక్ష్య పరివార్ అనే సంస్థ వాలంటైన్స్ డే సందర్భంగా బుధవా రం ఈ కార్యక్రమం నిర్వహించింది. దీంతో అంతకుముందు అమెరికా లోని కాలిఫోర్నియాలో ఆరు గంటల్లో 1,460 మందికి రక్తపరీక్షలు నిర్వహిం చి నెలకొల్పిన రికార్డు కనుమరు గైందని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీశ్ వైష్ణోయ్ అన్నారు. రక్త పరీక్షల్ని తమ టీం కెమెరాలతో రికార్డు చేసిందని వెల్లడిం చారు. సంస్థ కన్వీనర్ చందనా శర్మకు వైష్ణోయ్ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. -
పిట్ట కొంచెం..కూత ఘనం
మైసూరు: పెద్దవాళ్లు సైతం విస్తుపోయేలా బైకులు, కార్లను అలవోకగా నడుపుతూ ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏడేళ్ల బాలిక రిఫా తాజాగా లారీని నడిపి గోల్డెన్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డులో స్థానం సంపాదించడానికి ప్రయత్నించారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రిఫా తష్కిన్ ఇటీవల ముగిసిన దసరా ఉత్సవాల్లో కూడా బైకులు, కార్లతో సాహస విన్యాసాలు చేసి ఔరా అనిపించుకున్నారు. తమ సాహస విన్యాసాలతో గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాందిచాలనే కాంక్షతో ఆదివారం నగరంలోని ఈద్గా మైదానంలో అశోక్ లైలాండ్తో పాటు పదమూడు రకాల వాహనాలతో సాహస విన్యాసాలు చేశారు. ఏడేళ్ల ప్రాయంలోనే రిఫా చేస్తున్న సాహస విన్యాసాలు ప్రతీఒక్కరినీ అబ్బుపరిచాయి. -
కాలి వేళ్లే కదిలే కుంచెలై!
దామినికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయితే తన అసౌకర్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోలేదు. చేసే పనిలోనే ఉత్సాహం వెదుక్కుంది. ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.గంట వ్యవధిలో కాలిబొటన వేలుతో 38 బొమ్మలు గీయడం ద్వారా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్’లో చోటు సాధించింది. కాలి బొటనవేలే కుంచెగా చిత్రకళలో రాణిస్తోంది రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్)కు చెందిన దామిని. బీయస్సీ మొదటి సంవత్సరం చేస్తున్న దామిని చదువులో కూడా మంచి ప్రతిభ చూపుతుంది. కాలి బొటనవేలితో ఎలా రాయాలో దామినికి చిన్నప్పుడు నేర్పించింది తల్లి. ఒకరోజు దామిని తన బొటనవేలితో బొమ్మ గీస్తుంటే చూసింది తల్లి. కూతురికి చిత్రకళ మీద ఆసక్తి ఉన్న విషయాన్ని కనిపెట్టి ఆ దిశగా ప్రోత్సహించడం ప్రారంభించారు తల్లిదండ్రులు. తల్లి మాధురిసేన్ అయితే కూతురు కోసం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. తానే ఒక విద్యార్థిగా మారింది.‘‘మా అమ్మ నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించింది. అండగా నిలిచింది’’ అని తల్లి గురించి ప్రశంసగా చెబుతుంది దామిని. దామిని మనసులో ‘నిరాశ’ అనేది ఎప్పుడూ తొంగిచూడకుండా తల్లి మాధురి సేన్ ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యం నింపేది.‘‘బాగా చదవడం ద్వారా సొంతకాళ్ల మీద నిలబడే ధైర్యం వస్తుంది’’ అని ఎప్పటికప్పుడు కూతురికి చదువు విలువ తెలియజెప్పేది.హాబీగా మొదలైన ‘ఆర్ట్’ దామిని దైనందిన జీవితంలో భాగమైంది.‘‘బొమ్మలు సాధన చేస్తున్నప్పుడు నాలో తెలియని ఉత్సాహం వెల్లువెత్తుతుంది’’ అంటున్న దామిని కాళ్ల సహాయంతో బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, వంట చేయడం... మొదలైన పనులు కూడా సొంతంగా చేస్తుంది. ‘‘అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా...ఏదో కోల్పోయినట్లు నిస్తేజంగా కనిపిస్తారు చాలామంది. ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అనిపిస్తుంది అంటారు ఇరుగు పొరుగు. ‘‘దేవుడు మనకో అందమైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని సార్థకం చేసుకోవాలి’’ అని నమ్ముతుంది దామిని. పనిలో పట్టుదల, ఉత్సాహం మాత్రమే కాదు దామిని మాటలో ‘పరిణతి’ కూడా కనిపిస్తుంది. ‘‘నాకు ఈ లోపం ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో...మన మీద మనకే జాలి మొదలవుతుంది. అయితే మనకు కావల్సింది జాలి కాదు...అంతు లేని ఉత్సాహం. నేను చేయగలను. చేస్తాను అనుకుంటే విజయాలు మన వెంటే నడుస్తాయి’’ అంటుంది దామిని. ‘‘మిగిలిన విద్యార్థులతో పోల్చితే దామిని ధారణశక్తి గొప్పగా ఉంటుంది. ఒక్కసారి వింటే మరచిపోదు’’ అంటున్నాడు దామినికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు హరీష్ జోషి. ‘‘బొటనవేలితో ఎలా రాయాలో అమ్మ నేర్పించింది. అయితే బయట నలుగురి ముందు రాయడానికి సంకోచంగా ఉండేది. ఎవరైనా నవ్వుతారేమోనని అనుమానంగా ఉండేది. బయటి వాళ్ల గురించి ఆలోచించడం కాదు నా గురించి నేను ఆలోచించుకోవాలి అనుకున్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేశాను’’ అని చెబుతుంది దామిని. బెంగళూరులో జరిగిన ఇండియన్ ఇంక్లూజన్ సమ్మిట్(ఐఐయస్)లో దామిని కూడా ఒక వక్తగా పాల్గొంది. ‘ఐఐఎస్’ అనేది ఎందరిలోనో స్ఫూర్తి, ఆత్మస్థైర్యాన్ని నింపే వేదిక. ఈ వేదిక ద్వారా ఆమె ఇచ్చిన ప్రసంగం మరింత మందికి చేరువై స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు.ఐఏఎస్ ఆఫీసరై వికలాంగులకు సేవ చేయాలనేది దామిని కల. ఆమె ముందు ఇలాంటి కలలు ఎన్నో ఉన్నాయి. విజేతలకు కలలు కనడంతో పాటు ఆ కలలను నిజం చేసుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. దామిని తన కలలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.