కాలి వేళ్లే కదిలే కుంచెలై!
కాలి వేళ్లే కదిలే కుంచెలై!
Published Sun, Dec 4 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
దామినికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయితే తన అసౌకర్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోలేదు. చేసే పనిలోనే ఉత్సాహం వెదుక్కుంది. ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.గంట వ్యవధిలో కాలిబొటన వేలుతో 38 బొమ్మలు గీయడం ద్వారా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్’లో చోటు సాధించింది. కాలి బొటనవేలే కుంచెగా చిత్రకళలో రాణిస్తోంది రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్)కు చెందిన దామిని.
బీయస్సీ మొదటి సంవత్సరం చేస్తున్న దామిని చదువులో కూడా మంచి ప్రతిభ చూపుతుంది. కాలి బొటనవేలితో ఎలా రాయాలో దామినికి చిన్నప్పుడు నేర్పించింది తల్లి. ఒకరోజు దామిని తన బొటనవేలితో బొమ్మ గీస్తుంటే చూసింది తల్లి. కూతురికి చిత్రకళ మీద ఆసక్తి ఉన్న విషయాన్ని కనిపెట్టి ఆ దిశగా ప్రోత్సహించడం ప్రారంభించారు తల్లిదండ్రులు. తల్లి మాధురిసేన్ అయితే కూతురు కోసం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. తానే ఒక విద్యార్థిగా మారింది.‘‘మా అమ్మ నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించింది. అండగా నిలిచింది’’ అని తల్లి గురించి ప్రశంసగా చెబుతుంది దామిని.
దామిని మనసులో ‘నిరాశ’ అనేది ఎప్పుడూ తొంగిచూడకుండా తల్లి మాధురి సేన్ ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యం నింపేది.‘‘బాగా చదవడం ద్వారా సొంతకాళ్ల మీద నిలబడే ధైర్యం వస్తుంది’’ అని ఎప్పటికప్పుడు కూతురికి చదువు విలువ తెలియజెప్పేది.హాబీగా మొదలైన ‘ఆర్ట్’ దామిని దైనందిన జీవితంలో భాగమైంది.‘‘బొమ్మలు సాధన చేస్తున్నప్పుడు నాలో తెలియని ఉత్సాహం వెల్లువెత్తుతుంది’’ అంటున్న దామిని కాళ్ల సహాయంతో బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, వంట చేయడం... మొదలైన పనులు కూడా సొంతంగా చేస్తుంది.
‘‘అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా...ఏదో కోల్పోయినట్లు నిస్తేజంగా కనిపిస్తారు చాలామంది. ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అనిపిస్తుంది అంటారు ఇరుగు పొరుగు. ‘‘దేవుడు మనకో అందమైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని సార్థకం చేసుకోవాలి’’ అని నమ్ముతుంది దామిని. పనిలో పట్టుదల, ఉత్సాహం మాత్రమే కాదు దామిని మాటలో ‘పరిణతి’ కూడా కనిపిస్తుంది.
‘‘నాకు ఈ లోపం ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో...మన మీద మనకే జాలి మొదలవుతుంది. అయితే మనకు కావల్సింది జాలి కాదు...అంతు లేని ఉత్సాహం. నేను చేయగలను. చేస్తాను అనుకుంటే విజయాలు మన వెంటే నడుస్తాయి’’ అంటుంది దామిని.
‘‘మిగిలిన విద్యార్థులతో పోల్చితే దామిని ధారణశక్తి గొప్పగా ఉంటుంది. ఒక్కసారి వింటే మరచిపోదు’’ అంటున్నాడు దామినికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు హరీష్ జోషి. ‘‘బొటనవేలితో ఎలా రాయాలో అమ్మ నేర్పించింది. అయితే బయట నలుగురి ముందు రాయడానికి సంకోచంగా ఉండేది. ఎవరైనా నవ్వుతారేమోనని అనుమానంగా ఉండేది. బయటి వాళ్ల గురించి ఆలోచించడం కాదు నా గురించి నేను ఆలోచించుకోవాలి అనుకున్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేశాను’’ అని చెబుతుంది దామిని.
బెంగళూరులో జరిగిన ఇండియన్ ఇంక్లూజన్ సమ్మిట్(ఐఐయస్)లో దామిని కూడా ఒక వక్తగా పాల్గొంది. ‘ఐఐఎస్’ అనేది ఎందరిలోనో స్ఫూర్తి, ఆత్మస్థైర్యాన్ని నింపే వేదిక. ఈ వేదిక ద్వారా ఆమె ఇచ్చిన ప్రసంగం మరింత మందికి చేరువై స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు.ఐఏఎస్ ఆఫీసరై వికలాంగులకు సేవ చేయాలనేది దామిని కల. ఆమె ముందు ఇలాంటి కలలు ఎన్నో ఉన్నాయి. విజేతలకు కలలు కనడంతో పాటు ఆ కలలను నిజం చేసుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. దామిని తన కలలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.
Advertisement
Advertisement