ఉత్తమ చిత్ర పురుషోత్తమన్‌ | Indian artist Ajay Purushothaman on his artwork getting featured at Times Square billboard | Sakshi
Sakshi News home page

ఉత్తమ చిత్ర పురుషోత్తమన్‌

Published Fri, Jun 16 2023 5:45 AM | Last Updated on Fri, Jun 16 2023 5:45 AM

Indian artist Ajay Purushothaman on his artwork getting featured at Times Square billboard - Sakshi

న్యూయార్క్‌లోని టైమ్స్‌స్కైర్‌ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించిన ఆ ఆర్ట్‌వర్క్‌ ప్రేక్షకులను బాగా ఆట్టుకుంటుంది. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకొంటూ ‘వావ్‌’ అన్నారు. ప్రేక్షకులే కాదు కళావిమర్శకులు కూడా ‘బ్రహ్మాండం’ అన్నారు. ఆ ఆర్ట్‌వర్క్‌ను సృష్టించింది బెంగళూరుకు చెందిన అజయ్‌ పురుషోత్తమన్‌...

బెంగళూరులోని ఒక ఎడ్వర్‌టైజింగ్‌ కంపెనీలో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్‌ పురుషోత్తమన్‌కు చిన్నప్పుడు చాలామంది పిల్లలలాగే బొమ్మలు వేయడం అంటే ఇష్టం. కార్టూన్‌ క్యారెక్టర్లు అంటే బోలెడు ఇష్టం. తన అభిమాన క్యారెక్టర్‌లను గీయడంలో ప్రాక్టిస్‌ చేస్తుండేవాడు. ఈ ఆసక్తి స్కూల్‌ రోజుల నుంచి కాలేజి రోజుల వరకు వచ్చింది.
2డీ ఆర్ట్, త్రీడి ఆర్ట్‌లతో ప్రయోగాలు చేస్తుండేవాడు. తనకు తెలిసిన కథలను యానిమేషన్‌ మరియు త్రీడి మోడలింగ్‌లోకి తీసుకువచ్చాడు.
ఎన్నో సొంత ప్రాజెక్ట్‌లు చేసేవాడు.

న్యూయార్క్‌లో జరిగే ‘ఎన్‌ఎఫ్‌టీ ఎన్‌వైసీ’ ప్రదర్శన ‘ఎన్‌ఎఫ్‌టీ’పై ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే వేదిక. ఈ ఉత్సవానికి అజయ్‌ హాజరు కానప్పటికీ అతడి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ప్రశంసలు అందుకున్నాయి.
‘మన ఆర్ట్‌ను ప్రపంచ వేదిక మీదికి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటాడు అజయ్‌. న్యూయార్క్‌ టైమ్స్‌స్కైర్‌ బిల్‌బోర్డ్‌పై తన ఆర్ట్‌వర్క్‌ ప్రదర్శించడం అజయ్‌ పురుషోత్తమన్‌ని ఎంతో సంతోషానికి గురిచేసింది. మొదట దీని గురించి విన్నప్పుడు ‘కలా నిజమా!’ అనుకున్నాడు.
 ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాలనుకున్నాడు. సన్నిహితుల సహాయంతో న్యూయార్క్‌కు వెళ్లి ‘ఇంతకు మించిన ఆనందం ఏమున్నది!’ అనుకున్నాడు.

గత సంవత్సరం అజయ్‌ మొదలుపెట్టిన ‘టాయ్‌ స్టోరీస్‌ ప్రొఫైల్‌’ చాలామందిని ఆకట్టుకుంది. ఈ యానిమేషన్‌ సిరీస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక హిప్‌–హప్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తాడు. ‘షోలే’ సినిమాలోని క్యారెక్టర్లు అన్నీ కలిసి ఒక పాటకు డ్యాన్స్‌ చేస్తాయి! నిజజీవితంలోని ప్రముఖ వ్యక్తులు ఈ సిరీస్‌లోని క్యారెక్టర్లు. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే వెబ్‌3, ఎన్‌ఎఫ్‌టీకి సంబంధించి ఎగై్జటింగ్‌ ప్రాజెక్ట్‌ కోసం అర్జెంటీనా ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేస్తున్నాడు.
‘ఇది సవాళ్లతో కూడిన ప్రయాణం’ అంటున్నాడు అజయ్‌. సాధారణ ఆర్టిస్ట్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న అజయ్‌ పురుషోత్తమన్‌ ఆ సవాళ్లను అధిగమించి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.
 
మోస్ట్‌ పాపులర్‌
నాన్‌–ఫంగిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ)లు చిత్రకళ, సంగీతం, క్రీడా ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని, ట్రెండ్‌ను అందిపుచ్చుకొని మన దేశంలోని ‘మోస్ట్‌ పాపులర్‌ ఎన్‌ఎఫ్‌టీ క్రియేటర్‌’లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్‌ పురుషోత్తమన్‌. తనకు వచ్చే కంటెంట్‌ ఐడియాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ  మొదలుపెట్టాడు. తనలోని సృజనకు సంబంధించి అవతలి కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. తాను రూపొందించిన ఎన్‌ఎఫ్‌టీలను రకరకాల డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకం మొదలు పెట్టాడు. తన ఆర్ట్‌ మన దేశానికి మాత్రమే పరిమితం కావాలని అజయ్‌ అనుకోలేదు. ‘అక్కడ ఏం జరుగుతుంది’ అంటూ అంతర్జాతీయ ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. ట్రెండ్‌ ఏమిటో తెలుసుకున్నాడు. హాలివుడ్‌ కలెక్షన్స్‌కు శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన గాయకుల త్రీడీ బాటిల్‌ ఆర్ట్‌ను రూపొందించాడు. ప్రయాణాలు అంటే అజయ్‌కు ఇష్టం. ఎందుకంటే స్థానిక సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నది తన కళలోకి వచ్చి చేరుతుంది. బలాన్ని ఇస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement