
రెండు ప్రపంచాల మధ్య సంచరించే షెల్మకు... మొదటి ప్రపంచంలో కనిపించే సాంకేతిక అద్భుతాలు అంటే ఎంత ఇష్టమో రెండో ప్రపంచంలో కనిపించే కాల్పనిక కథలు అంతే ఇష్టం. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షెల్మ సహాయం రాసిన పుస్తకం ‘ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా: జెనిసిస్’ గత నెల గోల్డెన్ బుక్ అవార్డ్(ఉరుగ్వే) గెలుచుకుంది. తాజాగా గ్లోబల్ పబ్లిషింగ్ హౌజ్, ఎక్స్‌సెల్లర్ ఎక్స్‌లెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా)కు ఎంపికైంది...
చెన్నైలో... చిన్న వయసులోనే కలం పట్టింది షెల్మ. ప్రైమరీ స్కూల్లో గాంధీజీపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. షెల్మ ఈ పోటీలో పాల్గొంది. అయితే తనకు ఆ మహాత్ముడి గురించి పెద్దగా తెలియదు
‘రకరకాల ఆయుధాలు ఉపయోగించి, బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడారు’ అని రాసింది.
ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఇబ్బందిగా ఉండడం మాట ఎలా ఉన్నా... ఆ వ్యాసరచనే తన తొలి రచన!
అయితే ఆ తరువాత కాలంలో ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడంతోపాటు రచనలు చేయడంపై ఆసక్తి పెరిగింది.
‘నేను భవిష్యత్‌లో రచయిత్రిని కావాలనుకుంటున్నాను’ అని షెల్మ అన్నప్పుడు చాలాముంది ముఖం మీదే నవ్వారు.
‘ఇంజినీర్ కావాలనేది నా కల’ అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే. ఇలాంటి సమయాల్లో బాబీ ఆంటీ తనకు ఎంతో శక్తి ఇచ్చేది. షెల్మ దృష్టిలో తాను పవర్‌ఫుల్ ఉమెన్.
‘వారు నీ గురించి ఏం అనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. నీకు నీ మీద ఎంత నమ్మకం ఉందనేది ముఖ్యం’ అని చెప్పేది.
ఆంటీ ఇచ్చిన ఆత్మవిశ్వాస బలంతో చిన్న చిన్న రచనలు చేసి ఇంట్లో వినిపించేది. తండ్రి మెర్సిలిన్‌బాబు, తల్లి మేరీ శాంతి, చెల్లెళ్లు స్నేహ, రీతూలు ప్రోత్సాహకంగా మాట్లాడేవారు.
‘నాకు డిప్రెషన్‌గా అనిపించినప్పుడు పేపర్, పెన్ను అందుకొని ఏదో ఒకటి రాస్తుంటాను. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్న షెల్మ ‘ఎస్‌ఎస్ మెర్సె’ కలం పేరుతో ‘ది ల్యాండ్ ఆఫ్ ఆటరాక్సియా: జెనిసిస్’ అనే తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల రాసింది. దీనికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.
వీడియోగేమ్స్ ఇష్టపడే యువతరాన్ని కూడా ఈ నవల ఆకట్టుకుంది.
తాను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ నవలకు బీజం పడింది. అయితే అక్షరాల్లో కాకుండా తన మనసులోనే రాసుకుంటూ వస్తోంది. ఎడిట్ చేసుకుంటూ వస్తుంది. తాను చిన్నప్పుడు విన్న ఎన్నో జానపదకథలు, చదివిన పుస్తకాలు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి.
తప్పిపోయిన తమ ఫ్రెండ్ సినన్‌ను వెదుక్కుంటూ కెప్టెన్ మెగెలాన్ అతని బృందం చేసిన ప్రయాణమే ఈ నవల. కెప్టెన్ బృందం చివరికి ఒక మాంత్రిక ప్రపంచంలోకి వెళుతుంది. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది నవల సారాంశం.
‘ద ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా’ ఇచ్చిన ఉత్సాహంతో షెల్మ సహాయం మరిన్ని రచనలు చేయాలనుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment