‘రియో’ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు
గోల్ఫర్ అనిర్బన్
కోల్కతా: రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం ప్రకటించిన మొత్తాన్ని కేంద్ర క్రీడాశాఖ ఇప్పటివరకు ఇవ్వలేదని మరో గోల్ఫర్ అనిర్బన్ లాహిరి ధ్వజమెత్తాడు. ‘ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం అష్టకష్టాలు పడి అత్యున్నత శిక్షణ తీసుకున్న మాకు అప్పట్లో రూ. 30 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రియో గేమ్స్ ముగిసి నాలుగు నెలలైనా ఒక్క పైసా ఇవ్వలేదు’ అని అనిర్బన్ అన్నాడు. రియోలో మాకెదురైన చేదు అనుభవాలపై సహచర గోల్ఫర్ ఎస్ఎస్పీ చౌరాసియా చెప్పిందంతా నూటికి నూరుపాళ్లు నిజమని చెప్పాడు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), క్రీడా శాఖ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చుట్టూ తిరిగిన చౌరాసియా చివరకు రూ.5.5 లక్షలైనా అందుకున్నాడని... కానీ తనకు ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పాడు.
‘ఒలింపిక్స్ సన్నాహాలకు ఒక్కో గోల్ఫర్కు రూ. 30 లక్షలిస్తామన్నారు. తర్వాత ఆ మొత్తాన్ని రూ. 15 లక్షలకు తగ్గించారు. ఇలా ప్రకటించినవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఆటగాళ్లకు అందెదెన్నడో క్రీడాశాఖ వర్గాలే చెప్పాలి’ అని అనిర్బన్ అన్నాడు. ఒలింపిక్స్ కోసం తను సొంత డబ్బుతో సన్నద్ధమైనట్లు చెప్పాడు. భారత ఒలింపిక్ సంఘం, క్రీడాశాఖ ఇలా ఏ ఒక్కరి నుంచి ఆర్థిక సాయం అందలేదని వివరించాడు.