నగల కోసం నానమ్మని చంపాడు..
తల్లిదండ్రులు చనిపోవడంతో మనవడిని పెంచి పెద్దచేసిందా వృద్దురాలు.. బంగారం కోసం తల్లికాని తల్లినే హత్యచేసి బావిలో పడేశాడా ప్రబుద్దుడు.. ఈ దారుణ సంఘటన మండల కేంద్రమైన హత్నూరలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హత్నూర గ్రామానికి చెందిన వృద్దురాలు గొల్లదేవమ్మ(90) చిన్నకుమారుడు మృతిచెందడంతో మనుమడు అశోక్‌ను చిన్నప్పటి నుంచి పెంచింది. బంగారు కమ్మలు ఇమ్మని అశోక్ అడగడంతో నానమ్మ దేవమ్మకు మధ్య కొంత ఘర్షణ జరిగింది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో అశోక్ బంగారం గుండ్లు తీసుకొని ఇంట్లో ఉన్న ఈలపీట, చాకు లాంటి పరికరంతో వృద్దురాలు దేవమ్మను ఇంట్లోనే గొంతుకోసి హత్య చేశాడు.
శనివారం ఉదయం శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా గ్రామ శివారులోని పాడుబడిన బావిలో పడేశాడు. అనుమానం రాకుండా శనివారం నానమ్మ దేవమ్మ కనిపించడం లేదంటు ఇతర కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. దీంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా దేవమ్మ ఆచూకి తెలియలేదు. దీంతో దేవమ్మ పెద్ద కొడుకు కుమారులు, రెండవ కొడుకు మల్లేశంలు అశోక్ ను యువకునిన గట్టిగా అడిగారు.
ఇంట్లో నానమ్మ, నువ్వే ఉన్నారు. ఏం జరిగిందో చెప్పు అంటు నిలదీయడంతో మనువడు అశోక్ మాటల్లో తడబడడం వల్ల అనుమానం వచ్చి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో భయపడిన మనుమడు అశోక్ తానే చంపి బావిలో పడేసినట్లు చెప్పడంతో స్థానికులు పెద్ద ఎత్తున మృతదేహం కోసం గాలించగా ఆదివారం ఉదయం గ్రామ శివారులోని పాడుబడిన బావిలో మృతదేహం కనిపించడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎస్సై బాల్‌రెడ్డి కేసునమోదు చేసుకొని బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయించారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామ నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.