gollapally
-
పుట్టపర్తి వైభవం.. ఖండాంతరం!
పుట్టపర్తి అర్బన్: నాలుగు దశాబ్దాల క్రితం పది పూరి గుడిసెలతో ఉన్న కుగ్రామం నేడు బహుళ అంతస్తులకు కేంద్రీకృతమైంది. ఒకప్పడు రోడ్డు పక్కన కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచి చూసిన జనం.. నేడు కేవలం గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా విమానంలో చేరుకునేలా ఏర్పాటైన విమానాశ్రయాన్ని చూస్తున్నారు. కుగ్రామం నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన పుట్టపర్తి ప్రస్థానంపై సత్యసాయి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి.. పుట్టపర్తి ఆవిర్భావం వెనుక పురాణ కథను స్థానికులు నేటికీ గుర్తు చేస్తుంటారు. ‘కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, కర్ణాటక నుంచి వచ్చి చిత్రావతి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతంలో పది ఇళ్లు మాత్రమే ఉండేవి. గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి గొల్లపల్లి అని పిలుచుకునేవారు. జీవనం కోసం ఎక్కువగా గోవులను పెంచేవారు. ఓ ఆవు పాలు ఇవ్వకుండా మొరాయిస్తుండడంతో దాని యజమాని నిఘా ఉంచాడు. ఓ మధ్యాహ్న సమయంలో ఆవు పుట్ట వద్దకెళ్లి నిల్చోన్నప్పుడు పొదుగు నుంచి పాలు పుట్టలోకి ధారాపాతంగా కారుతుండడం గమనించాడు. ఇది గమనించిన యజమాని బండరాయితో ఆవును కొట్టబోగా అది తప్పించుకుంది. అదే సమయంలో పుట్టలోని నుంచి వెలుపలకు వచ్చిన పాముకు బండరాయి తగిలి చనిపోతూ గొల్లపల్లి పుట్టల మయంగా మారుతుందని, పాడి పశువులు కనుమరుగవుతాయని శపించింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శాప విమోచనం కోసం పుట్ట ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించి వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు’. అలా గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా రూపాంతరం చెందింది. సత్యసాయి ఆవిర్భావంతో మహర్దశ.. గొల్లపల్లిలో 1926 నవంబర్ 23వ తేదీన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ.. 1940 అక్టోబర్‌లో అవతార ప్రకటనతో సత్యసాయిగా మారారు. ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం 1948లో ప్రశాంతి నిలయానికి సత్యసాయి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23 నాటికి ప్రశాంతి నిలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. సత్యసాయిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయి. వచ్చే భక్తులకు విడిది, ఇతర సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ పరిధి విస్తరించింది. దీంతో 1964లో పంచాయతీగా పుట్టపర్తి మారింది. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ 1980 నవంబర్‌లో సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధి కోసం 1981లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 1984లో నిర్మాణ పనులు చేపట్టి 1991లో అన్ని రకాల సదుపాయాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1990లో ఆర్టీసీ బస్టాండ్, 1991 నవంబర్‌లో సత్యసాయి విమానాశ్రయం, 2000 నవంబర్‌లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. 1995 జూలైలో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. 1995 జూలైలో సాయికుల్వంత్ మంటపాన్ని నిర్మించారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్(పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. (చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష) -
ప్రియురాలి మరణంతో కలతచెంది..
సాక్షి, జగిత్యాల: ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో కలతచెందిన ఓ యువకు డు శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మానాల లస్మయ్య–అమృతవ్వ దంపతుల మూడో కుమారుడు రాకేశ్ (21), అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉపాధి నిమిత్తం రాకేశ్ రెండేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారనే కారణంతో రాకేశ్ ప్రేమించిన యువతి (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన రాకేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దుబాయి క్యాంపులోని గదిలో శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు రాకేశ్ సెల్ఫీ వీడియో తీస్తూ ‘కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నాం. ఈ రోజు నా నుంచి దూరమయ్యింది. అమ్మాయి లేని జీవితం నాకొద్దు. బై మమ్మీ ఐ మిస్ యూ’అంటూ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు దుబాయి వెళ్లి తమ బతుకులు మార్చుతాడనుకుంటే తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
‘మా బిడ్డను ఆదుకోండి సారూ..’
సాక్షి, గొల్లపల్లి : ముద్దుగా ఉన్న పాపాయికి పెద్ద కష్టమొచ్చింది.ఆడుతూ పాడుతూ.. హాయిగా ఉండాల్సిన ఆ చిన్నారి కాలేయ సంబంధిత వ్యాధితో కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ చేయాల్సిందేనని హైదరాబాద్‌లోని వైద్యులు తేల్చగా ఆరోగ్యశ్రీకి వ్యాధి అర్హత లేక, డబ్బులు కట్టేందుకు ఆర్థికస్థోమత లేక కన్నోళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండె దిటవు చేసుకుని తమ బిడ్డను ఆదుకోవాలని దయార్థ హృదయులను వేడుకుంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన నిరుపేదలు షిండే శారద–నరేశ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా నుంచి గొల్లపల్లి వలస వచ్చారు. ఇక్కడే నివాసం ఏర్పర్చుకుని ఓటుహక్కు, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు కల్గి ఉన్నారు. పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. తల్లి శారద ఏడాది క్రితం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ పలు ఆసుపత్రులు చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో పాటు ఖరీదైన వైద్యం అందకపోవడం మృతి చెందింది. నాన్నే అన్నీ తానై వారిని సాకుతున్నాడు. నలుగురు పిల్లలను తల్లి లేని లోటు తీర్చేందుకు నమ్ముకున్న సీస కమ్మరి వృత్తితో వచ్చిన పదో పరకతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరిలో చిన్నదైన నాలుగేళ్ల కూతురు ఐశ్వర్య కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకట తరగతి చదువుతున్న ఈ బాలిక పుట్టిన రెండేళ్ల నుంచే ఈ జబ్బు తీవ్రతతో అస్వస్థతకు గురవుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ జబ్బు పెరిగిపోతోంది. భార్య చనిపోయినప్పటి నుంచి భర్తకు వీరి ఆలనా పాలన కష్టంగా మారింది. కూతురుకు ఎలాగైనా వ్యాధి నయం చేయాలనే ఆ తండ్రి మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి రూ.లక్ష వరకు ఖర్చు చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో చూపించగా, వెంటనే ఆపరేషన్ చేయాలని అందుకు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే వ్యాధిలో లేదని కార్డు వర్తించదని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల నుంచి ఐశ్వర్యకు మలమూత్ర విసర్జనలకు కూడా వెళ్లడం లేదని కడుపు ఉబ్బుతోందని వాపోయాడు. తన కూతురును ఎలా బతికించుకునేది అని నరేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దాతలు, ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించాలని వేడుకుంటున్నాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. చిన్నారిని ఆదుకునేందుకు ఆర్థికసాయం చేయాలనుకునే వారు ఫోన్ నంబర్ 9000404115కు కాల్ చేయాలని కోరారు. -
బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ గొల్లపల్లి : మండల కేంద్రంలోని కోమళ్ల మల్లయ్య– లచ్చవ్వ దంపతుల కూతురు వివాహాన్ని అధికారులు ఆదివారం అడ్డుకున్నారు. కూలీపనులు చేసుకునే మల్లయ్య అనారోగ్యానికి గురవడంతో పదో తరగతి చదివే తమ కూతురుకు ధర్మపురి మండలానికి చెందిన తమ బంధువు కుమారుడికి ఇచ్చి సోమవారం వివాహం జరిపించాలని నిశ్చయించారు. బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం అందడంతో ఎస్సై ఉపేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మణెమ్మ ఆదివారం బాలిక ఇంటికి చేరుకున్నారు. మైనారిటీ తీరకుండానే వివాహం చేస్తే బాలిక అనారోగ్యానికి గురవుతుందని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 18ఏళ్ల వయస్సు నిండే వరకూ ఆమెకు వివాహం జరిపించబోమంటూ వారి నుంచి లిఖితపూర్వకంగా హామీపత్రం రాయించుకున్న అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు హరిప్రియ, అనంతలక్ష్మి, ఎంపీటీసీ ముస్కు జలజ తదితరులు పాల్గొన్నారు.