పుట్టపర్తి అర్బన్: నాలుగు దశాబ్దాల క్రితం పది పూరి గుడిసెలతో ఉన్న కుగ్రామం నేడు బహుళ అంతస్తులకు కేంద్రీకృతమైంది. ఒకప్పడు రోడ్డు పక్కన కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచి చూసిన జనం.. నేడు కేవలం గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా విమానంలో చేరుకునేలా ఏర్పాటైన విమానాశ్రయాన్ని చూస్తున్నారు. కుగ్రామం నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన పుట్టపర్తి ప్రస్థానంపై సత్యసాయి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి..
పుట్టపర్తి ఆవిర్భావం వెనుక పురాణ కథను స్థానికులు నేటికీ గుర్తు చేస్తుంటారు. ‘కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, కర్ణాటక నుంచి వచ్చి చిత్రావతి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతంలో పది ఇళ్లు మాత్రమే ఉండేవి. గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి గొల్లపల్లి అని పిలుచుకునేవారు. జీవనం కోసం ఎక్కువగా గోవులను పెంచేవారు. ఓ ఆవు పాలు ఇవ్వకుండా మొరాయిస్తుండడంతో దాని యజమాని నిఘా ఉంచాడు.
ఓ మధ్యాహ్న సమయంలో ఆవు పుట్ట వద్దకెళ్లి నిల్చోన్నప్పుడు పొదుగు నుంచి పాలు పుట్టలోకి ధారాపాతంగా కారుతుండడం గమనించాడు. ఇది గమనించిన యజమాని బండరాయితో ఆవును కొట్టబోగా అది తప్పించుకుంది. అదే సమయంలో పుట్టలోని నుంచి వెలుపలకు వచ్చిన పాముకు బండరాయి తగిలి చనిపోతూ గొల్లపల్లి పుట్టల మయంగా మారుతుందని, పాడి పశువులు కనుమరుగవుతాయని శపించింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శాప విమోచనం కోసం పుట్ట ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించి వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు’. అలా గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా రూపాంతరం చెందింది.
సత్యసాయి ఆవిర్భావంతో మహర్దశ..
గొల్లపల్లిలో 1926 నవంబర్ 23వ తేదీన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ.. 1940 అక్టోబర్‌లో అవతార ప్రకటనతో సత్యసాయిగా మారారు. ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం 1948లో ప్రశాంతి నిలయానికి సత్యసాయి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23 నాటికి ప్రశాంతి నిలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. సత్యసాయిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయి.
వచ్చే భక్తులకు విడిది, ఇతర సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ పరిధి విస్తరించింది. దీంతో 1964లో పంచాయతీగా పుట్టపర్తి మారింది. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ 1980 నవంబర్‌లో సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధి కోసం 1981లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 1984లో నిర్మాణ పనులు చేపట్టి 1991లో అన్ని రకాల సదుపాయాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా 1990లో ఆర్టీసీ బస్టాండ్, 1991 నవంబర్‌లో సత్యసాయి విమానాశ్రయం, 2000 నవంబర్‌లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. 1995 జూలైలో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. 1995 జూలైలో సాయికుల్వంత్ మంటపాన్ని నిర్మించారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్(పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది.
(చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష)
Comments
Please login to add a commentAdd a comment